logo

గంజాం జిల్లాకు అదనపు కేంద్ర బలగాలు

గంజాం జిల్లా అస్కా లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని కళ్లికోట అసెంబ్లీ సెగ్మెంట్‌లో పోలింగుకు ముందు చెలరేగిన రాజకీయ హింస నేపథ్యంలో ఎన్నికల సంఘం చర్యలు చేపట్టింది.

Published : 18 May 2024 01:05 IST

 గ్రామాల్లో కేంద్ర బలగాల కవాతు

బ్రహ్మపుర నగరం, న్యూస్‌టుడే: గంజాం జిల్లా అస్కా లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని కళ్లికోట అసెంబ్లీ సెగ్మెంట్‌లో పోలింగుకు ముందు చెలరేగిన రాజకీయ హింస నేపథ్యంలో ఎన్నికల సంఘం చర్యలు చేపట్టింది. జిల్లాలో ఈ నెల 20న జరగనున్న ఎన్నికలకు అదనంగా ఇరవై కంపెనీల సీఏపీఎఫ్‌ (సెంట్రల్‌ ఆర్మ్డ్‌ పోలీసు ఫోర్స్‌)ను మోహరిస్తారు. దీనిపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి నికుంజ బిహారి ధొళో అధ్యక్షతన సమావేశమైన కమిటీ గంజాం జిల్లాలో అదనపు కేంద్ర బలగాల మోహరింపునకు ఆమోదం తెలిపింది. రిజర్వు ఫోర్స్‌ లేదా స్ట్రైకింగ్‌ ఫోర్స్‌ కింద వివిధ పోలింగు బూత్‌ల వద్ద వారిని నియమిస్తారు. ఈమేరకు ప్రధాన ఎన్నికల అధికారి ధొళో గంజాం జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టరుకు ఆదేశాలు జారీ చేశారు. కళ్లికోట ఠాణా పరిధిలోని శ్రీకృష్ణశరణపూర్‌ గ్రామంలో అభ్యర్థుల ఎన్నికల ప్రచార బ్యానర్లు కట్టే విషయమై భాజపా-బిజద మద్దతుదారులు, కార్యకర్తల మధ్య పరస్పరం దాడులు జరిగిన సంగతి తెలిసిందే. భాజపా కార్యకర్త ఒకరు మృతి చెందగా, పలువురు గాయపడడంతో గురువారం కళ్లికోట ఠాణా వద్ద రోజంతా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి విదితమే. దీంతో జిల్లాలో శాంతియుతంగా ఎన్నికల నిర్వహణపై ఎన్నికల సంఘం ప్రత్యేకంగా దృష్టిపెట్టింది. పార్టీల నేతలు, కార్యకర్తలు శాంతియుతంగా మెలగాలని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు పాల్పడినా కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసు అధికారులు హెచ్చరించారు. ప్రజలు కూడా సంయమనం పాటించాలని సూచించారు.

గురువారం శ్రీకృష్ణ శరణపూర్‌ గ్రామంలో జరిగిన హింస నేపథ్యంలో కళ్లికోట ఠాణా వద్ద గ్రామస్థులు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని