logo

జంఝాటం

తమది రైతు ప్రభుత్వమని చెప్పుకొనే వైకాపా ఏనాడూ ఆ దిశగా అడుగులు వేయలేదు. కనీసం అన్నదాత వైపు కన్నెత్తి చూడలేదు. అధికారంలోకి రాక ముందు అనేక హామీలను నీటిమూటల్లో నింపేసిన సీఎం జగన్‌మోహన్‌రెడ్డి.. అధికారంలోకి వచ్చిన వెంటనే మేమింతే అన్నట్లు వాటన్నింటినీ అటకెక్కించేశారు.

Published : 19 Apr 2024 03:45 IST

జంఝావతి ప్రాజెక్టుపై నోరు విప్పని జగన్‌
నాటి పాదయాత్రలో హామీతో మాయ
అయిదేళ్లలో కనీసం పట్టించుకోని వైనం

జంఝావతి నదిపై రబ్బరు డ్యామ్‌

తమది రైతు ప్రభుత్వమని చెప్పుకొనే వైకాపా ఏనాడూ ఆ దిశగా అడుగులు వేయలేదు. కనీసం అన్నదాత వైపు కన్నెత్తి చూడలేదు. అధికారంలోకి రాక ముందు అనేక హామీలను నీటిమూటల్లో నింపేసిన సీఎం జగన్‌మోహన్‌రెడ్డి.. అధికారంలోకి వచ్చిన వెంటనే మేమింతే అన్నట్లు వాటన్నింటినీ అటకెక్కించేశారు. అలా ఓ మూలకు వెళ్లిపోయింది మన్యం జిల్లా కల్పతరువైన జంఝావతి ప్రాజెక్టు. పూర్తి చేస్తామని నీళ్లిస్తామని నాటి పాదయాత్రలో ఇచ్చిన మాటను మడమ తిప్పి.. మర్చిపోయారు మన జగన్‌.

‘జంఝావతి ప్రాజెక్టును దశాబ్దాలుగా పాలకులు విడిచిపెట్టేశారు. వైకాపా అధికారంలోకి రాగానే ప్రాజెక్టు పరిధిలో నెలకొన్న సమస్యలన్నింటినీ పరిష్కరిస్తాం. పూర్తిస్థాయిలో నీరందించి పార్వతీపురం నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేస్తాం’ గత ఎన్నికల సమయంలో ప్రతిపక్షనేతగా జగన్‌మోహన్‌రెడ్డి పార్వతీపురం నడిబొడ్డున నిలబడి చెప్పిన మాటలివి.

న్యూస్‌టుడే, పార్వతీపురం: మన్యంలోని కొమరాడ, గరుగుబిల్లి, పార్వతీపురం, సీతానగరం, మక్కువ మండలాల్లో 24 వేల ఎకరాలకు పైగా సాగునీరు అందించేందుకు కొమరాడ మండలంలోని రాజ్యలక్ష్మీపురం సమీపంలో 1976లో రూ.15.51 కోట్లతో జంఝావతి నదిపై ప్రాజెక్టును ప్రారంభించారు. కొన్నినెలల పాటు పనిచేసినా.. తరువాత ఒడిశా అభ్యంతరం తెలిపింది. జలాశయం సమీపంలో తమ రాష్ట్రానికి చెందిన 11 గ్రామాల్లోని 1100 ఎకరాల భూమి ముంపుబారిన పడుతోందని, ఆ ప్రభావం పెరిగే అవకాశం ఉందని చెప్పింది. ఇందులో అటవీ ప్రాంతం ఎక్కువ కావడంతో కాస్త ఆటంకం ఏర్పడింది.

1980లో చర్చలు..

వివాదాస్పద స్థలం మునిగిపోకుండా 1980లో రెండు రాష్ట్రాల మధ్య చర్చలు జరిగాయి. దీంతో ఓ ఒప్పందానికి వచ్చారు. జలాశయానికి అవసరమైన పనులు చేసుకోవచ్చని ఒడిశా భరోసా ఇచ్చింది. అయితే ముంపు సమస్య మాత్రం పరిష్కారానికి రాలేదు. ముఖ్యమంత్రి హోదాలో సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్‌పట్నాయక్‌ను భువనేశ్వర్‌లో కలిశారు. కానీ ఏమీ మాట్లాడకుండానే వచ్చేసినట్లు అప్పట్లో ఆరోపణలు వినిపించాయి.

తాత్కాలికంగా రబ్బరు డ్యాం..

ఒడిశా ఒప్పుకోకపోవడంతో స్పిల్‌వే నిర్మించకుండా 2006లో రబ్బరు డ్యాం ఏర్పాటు చేశారు. నీరు చేరితే.. దానంతట అదే దిగువకు వెళుతుంది. ఇలా దాదాపు 12 వేల ఎకరాలకు నీరందుతుందని భావించారు. 3.6 కిలోమీటర్ల మేర లింకు కాలువను తవ్వి, ఎత్తిపోతలతో మరో 12 వేల ఎకరాలకు నీరివ్వాలనుకున్నారు. ఈమేరకు 650 హెచ్‌పీ మోటార్లు మూడు, ప్రత్యేకంగా విద్యుత్తు సబ్‌స్టేషన్‌ను పెట్టారు. కానీ ఇవన్నీ అక్కరకు రాలేదు. పక్క రాష్ట్రం ఒప్పుకొంటే రివర్‌గ్యాప్‌ను మూసేసి, గేట్లు ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంది. కానీ ఆ దిశగా అడుగులు పడడం లేదు.

స్పందించని గుత్తేదారులు

జలాశయం ప్రారంభం నుంచి ఇప్పటివరకు రూ.124 కోట్ల అంచనాతో పనులు జరిగాయి. కానీ అవేవీ పూర్తికాలేదు. వైకాపా ప్రభుత్వం వచ్చాక కాలువల ఏర్పాటు, ఇతర పనులకు రూ.28.50 కోట్లు మంజూరు చేసింది. నెల్లూరుకు చెందిన గుత్తేదారుకు అప్పగించారు. కాలువలు, సూపర్‌ పాసేజ్‌లు, ఓటీలు తదితరాలు నిర్మించాలి. డిస్ట్రిబ్యూటరీలకు సంబంధించి 250 వరకు నిర్మాణాలు చేపట్టాలి. అయితే బిల్లుల చెల్లింపుల్లో జాప్యంతో కదలిక లేదని తెలుస్తోంది. దీంతో తమను తప్పించాలని సదరు గుత్తేదారులు బహిరంగంగానే కోరుతున్నారు.

ఆ బండరాయే తొలగించలేక..

కొమరాడ మండలం డంగభద్ర దగ్గర కాలువలో ఉన్న బండరాయిని తొలగించడానికి రూ.4 కోట్లు మంజూరయ్యాయి. దీన్ని తొలగిస్తే తప్ప నీరు స్వేచ్ఛగా కాలువలో ప్రవహించే పరిస్థితి లేదు. ఈ ప్రక్రియ కొన్నేళ్లుగా సాగుతూనే ఉంది.

పాత ప్రతిపాదనలే కొనసాగుతున్నాయి. గతంలోనే ప్రాజెక్టును పూర్తిచేయడానికి అంచనాలు రూపొందించి ప్రభుత్వానికి నివేదించాం. గుత్తేదారులు పనులు చేయాల్సి ఉంది. పూర్తిచేయాలని లేఖలు రాస్తున్నాం. డంగభద్ర వద్ద బండరాయి తొలగింపు ప్రక్రియ సాగుతోంది.

జగదీశ్వరరావు, ప్రాజెక్టు కార్యనిర్వాహక ఇంజినీరు,

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని