logo

వీరిని చూస్తుంటే బాధని‘పింఛన్‌’

సామాజిక భద్రత పింఛన్లను బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో లబ్ధిదారులకు కష్టాలు వచ్చి పడ్డాయి.

Published : 02 May 2024 04:13 IST

సీతంపేట, న్యూస్‌టుడే: సామాజిక భద్రత పింఛన్లను బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో లబ్ధిదారులకు కష్టాలు వచ్చి పడ్డాయి. మేడే సందర్భంగా బుధవారం బ్యాంకులకు సెలవు అయినప్పటికీ పలువురు పింఛనుదారులు గ్రామాల నుంచి ఆటోల్లో సీతంపేట వచ్చారు. ఎస్‌బీఐ ఖాతాదారుల సేవా కేంద్రాల వద్దకు వెళ్లి తమ పొదుపు ఖాతాలు పని చేస్తున్నాయో.. లేదోనని పరిశీలించుకున్నారు. ఖాతాల్లో నగదు జమ అయితే విత్‌డ్రా చేసుకోవడానికి మరికొందరు వచ్చారు.

సీతంపేట, కుసిమిలో బ్యాంకు శాఖలు ఉన్నాయి. మండల కేంద్రానికి 15 కిలోమీటర్ల దూరాన ఉన్న సీది, అంటికొండ గూడ ప్రాంతాల నుంచి లబ్ధిదారులు ఆటోలు, ఇతర వాహనాల్లో ఇక్కడికి చేరుకున్నారు. పింఛను డబ్బులు ఇంకా ఖాతాల్లో పడలేదని తెలిసి ఉసూరుమంటూ వెనుదిరగడం కనిపించింది. ప్రతి నెలా ఒకటినే పింఛను చేతికి అందేదని, ప్రభుత్వ తీరుతో ఇబ్బంది పడాల్సి వస్తోందని పలువురు వాపోయారు. మండలంలోని శిఖర గ్రామాల లబ్ధిదారుల బాధలు అన్నీ, ఇన్నీ కావు. గ్రామంలో ఇంటి వద్దనే పింఛన్లు అందించాలని గిరిజనులు కోరుతున్నారు.

పాచిపెంట, న్యూస్‌టుడే: పాచిపెంట మండలానికి చెందిన పలువురు పింఛనుదారులు సచివాలయాలకు వెళ్లి ఉద్యోగులను సంప్రదిస్తున్నారు. బ్యాంకు ఖాతాల్లో పింఛను నగదు జమ అయ్యిందని, అక్కడికి వెళ్లితీసుకోండంటూ చెప్పడంతో బ్రాంచిలకు వెళుతున్నారు. బుధవారం మేడే సందర్భంగా బ్యాంకుకు సెలవు కావడంతో ఖాతాల్లో నగదు జమ అయ్యిందో లేదో తెలియని పరిస్థితితో పలువురు లబ్ధిదారులు ఇంటి ముఖం పట్టారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని