logo

జగన్‌ రాజ్యంలో.. ఇసుక దందా

జగన్‌ రాజ్యంలో అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. నదుల్లో ఇసుకను అక్రమంగా తవ్వుకుపోతూ రూ.కోట్లలో సొమ్ము చేసుకుంటున్నారు. జిల్లాలోని పలు రేవుల నుంచి విశాఖ, విజయనగరం, బొబ్బిలి, పార్వతీపురానికి రోజూ వందల సంఖ్యలో లారీలతో తరలిస్తున్నా పట్టించుకునే వారే లేకుండా పోయారు. 

Published : 02 May 2024 03:53 IST

అర్ధరాత్రి వేళల్లో తవ్వకాలు
ప్రమాదకరంగా మారిన నదులు
న్యూస్‌టుడే, పార్వతీపురం, కొమరాడ, జియ్యమ్మవలస, పాలకొండ, గ్రామీణం, భామిని, మక్కువ  

జగన్‌ రాజ్యంలో అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. నదుల్లో ఇసుకను అక్రమంగా తవ్వుకుపోతూ రూ.కోట్లలో సొమ్ము చేసుకుంటున్నారు. జిల్లాలోని పలు రేవుల నుంచి విశాఖ, విజయనగరం, బొబ్బిలి, పార్వతీపురానికి రోజూ వందల సంఖ్యలో లారీలతో తరలిస్తున్నా పట్టించుకునే వారే లేకుండా పోయారు.  

జియ్యమ్మవలస మండలంలోని నాగావళి నదీ పరివాహక ప్రాంతం బిత్రపాడు. గతంలో ఇక్కడ ఇసుక రేవు ఉండేది. ప్రస్తుతం ఎత్తేసినా అక్రమార్కులు నది నుంచి ఇష్టారీతిన ఇసుక తీసుకెళ్తున్నారు. రోజూ పదుల సంఖ్యలో ట్రాక్టర్లు, నాటు బళ్లపై తరలిస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. ట్రాక్టర్‌కు రూ.3000 నుంచి రూ.4000, నాటు బండికి రూ.1200 నుంచి రూ.1400 తీసుకొని అమ్ముకుంటున్నారు.

నది దిశనే మార్చేశారు..

పాలకొండ మండలంలో గోపాలపురం, అంపిలి, అన్నవరం, యరకరాయపురం, చినమంగళాపురం, గొట్టమంగళాపురం గ్రామాలను ఆనుకుని నాగావళి ప్రవహిస్తోంది. అనుమతులు ఉన్నాయని చెప్పి అన్నవరం, గోపాలపురం, యరకరాయపురం వద్ద ఇష్టానుసారంగా తవ్వేశారు. మూడేళ్లలో వందలాది వాహనాలతో తరలించి నదీ గర్భాన్ని ధ్వంసం చేశారు. ఏకంగా నది దిశను మార్చేసి అడ్డుకట్టలు వేసి నీరు మళ్లించారు. పాలకొండ పట్టణంలో తాగునీటి ఎద్దడి ఏర్పడుతుందని తెదేపా నాయకులు ఆందోళనలు చేసినా ఎవరూ పట్టించుకోలేదు. 


ఊటబావుల వద్దే..  

న్యూస్‌టుడే, బలిజిపేట: బలిజిపేట మండలంలోని 11 గ్రామాలకు తాగునీరు ఇచ్చేందుకు అంపావల్లి వద్ద ఊటబావులు ఏర్పాటు చేశారు. ఈ ప్రాంతంలోనూ కొందరు అక్రమంగా తవ్వకాలు చేపట్టి ఇసుకను తరలిస్తున్నారు. దీంతో బావులు ప్రమాదంలో పడ్డాయి. రెవెన్యూ, పోలీసు శాఖల దృష్టికి  తీసుకెళ్తామని నీటిసరఫరా విభాగం డీఈఈ హనుమంతరావు తెలిపారు.  


సువర్ణముఖిని దోచేశారు..

న్యూస్‌టుడే, సీతానగరం : సీతానగరం మండల పరిధిలోని లక్ష్మీపురం, బూర్జ, పెదంకలాం, సీతానగరం రేవుల నుంచి అనుమతులు లేకున్నా పార్వతీపురం, గరుగుబిల్లి మండలాలకు ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు. నదిలో బగ్గందొరవలస వద్ద పైలట్ ప్రాజెక్టు, సీతానగరం వద్ద నర్సిపురం మెగా రక్షిత పథకం ఇన్‌ఫిల్టర్‌ బావుల నుంచి 21  గ్రామాలకు తాగునీరు వెళ్లాల్సిఉంది. ఇక్కడ తవ్వకాలతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి.  


ఆగిన ఇళ్ల నిర్మాణాలు

న్యూస్‌టుడే, పాచిపెంట: పాచిపెంట మండలంలో వేగావతి, వట్టిగెడ్డ నదీ తీర ప్రాంతాల్లో ఇసుక అక్రమ తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. కర్రివలస వద్ద ఆనకట్ట పైభాగంలో టన్నుల కొద్దీ మేటలు ఉన్నాయి. పోతులగెడ్డ కొండవాగు ప్రవాహంతో కొట్టుకొచ్చిన ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు. ఒకప్పుడు ట్రాక్టరు లోడు రూ.1500కే దొరికేది. ఇప్పుడు రూ.2,500కు పైగా పెరగడంతో పాచిపెంటలో పలువురు ఇళ్ల నిర్మాణాలను నిలిపేశారు.


ఆంక్షలు పెట్టినా ఆగలేదు..

క్కువ మండలంలో తెదేపా హయాంలో పేదలకు ఉచితంగా ఇసుక ఇచ్చేందుకు దేవరశిర్లాం సమీపంలో ఉన్న సువర్ణముఖి నదిలో రేవు గుర్తించారు. నిల్వలు పూర్తి కావడంతో ఆపేయాలని అధికారులు హెచ్చరికలు జారీ చేసినప్పటికీ తవ్వకాలు ఆగడం లేదు. ఈ ప్రాంతంలోనే పార్వతీపురం మండలంలోని 61 గ్రామాలకు నీరు అందించే రక్షిత మంచినీటి పథకం ఉన్నా  ఎవరూ పట్టించుకోలేదు. కొందరి అండదండలతో పార్వతీపురం, మక్కువ నుంచి వందల సంఖ్యలో ట్రాక్టర్లతో రాత్రివేళలో ఇక్కడికి చేరుకొని ఇసుకను తరలిస్తున్నారు. ఎన్నికల కోడ్‌ రావడంతో తవ్వకాలు వద్దని పోలీసులు హెచ్చరించినా ఆపిన దాఖలాలే లేవు.


ఇంటి నిర్మాణం గగనమే..

- పి.రాంప్రసాద్‌, సతివాడ, భామిని.

ప్రస్తుత పరిస్థితుల్లో ఇల్లు కట్టుకోవడానికి నానా అవస్థలు పడుతున్నాం. నేను ఏడాదిన్నర క్రితం పని ప్రారంభించాను. సామగ్రి మొత్తం సమకూరగా ఇసుక కొరత వేధిస్తోంది. మా గ్రామ సమీపంలో కోసలి నుంచి నాటు బళ్లతో తీసుకొచ్చి రూ.900 చొప్పున విక్రయిస్తున్నారు. అది మొత్తం 3 సిమెంట్‌ బస్తాలకే వస్తోంది. దీంతో ఆర్థికంగా భారం పడుతోంది.


ఇక్కట్లు పడుతున్నాం..

- రమణమ్మ, కార్మికురాలు, జన్నివీధి

ఇసుక లేక ఉపాధి పనులు దొరకడం లేదు. గతంలో అందుబాటు ధరలో దొరికేది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ధర  భారీగా పెరిగిపోయింది. పేదలు ఇళ్లు నిర్మించుకుంటే ఇసుక సరఫరా చేస్తామని చెప్పి చేయలేదు. దీంతో పనులు జరగక పోవడంతో ఉపాధి లేకుండా పోతోంది. ఇసుక అందుబాటులో లేదని ఎప్పటికప్పుడు నిర్మాణాలు ఆపేస్తున్నారు.

న్యూస్‌టుడే, సాలూరు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని