logo

ఆశలు అడియాసలు చేశావ్‌ జగనన్న

ఆశా కార్యకర్తల్లో  వివిధ కారణాలతో చనిపోయిన వారంతా 30 నుంచి 50 ఏళ్ల లోపు వాళ్లే. వీరిలో కొంతమందికి భర్తలు లేరు. పెళ్లీడుకు వచ్చిన ఆడపిల్లలు, ఇంకా చదువుకుంటున్న పిల్లలు ఉన్నారు.

Published : 06 May 2024 03:54 IST

రోడ్డు ప్రమాదాల్లో కొందరు.. అనారోగ్యంతో మరికొందరు
ఆశా కార్యకర్తలపై జగన్‌ ప్రభుత్వ నిరాదరణ
విజయనగరం వైద్య విభాగం-పార్వతీపురం పట్టణం, న్యూస్‌టుడే

ఆశా కార్యకర్తల్లో  వివిధ కారణాలతో చనిపోయిన వారంతా 30 నుంచి 50 ఏళ్ల లోపు వాళ్లే. వీరిలో కొంతమందికి భర్తలు లేరు. పెళ్లీడుకు వచ్చిన ఆడపిల్లలు, ఇంకా చదువుకుంటున్న పిల్లలు ఉన్నారు. ఎంతో కొంత జీతం వస్తుంది కదా అని ఎన్నో ఆశలతో ఉద్యోగం చేస్తున్న ఆశా కార్యకర్తల్లో 60 శాతం మంది రక్తపోటు, మధుమేహం, కేన్సర్‌ తదితర సమస్యలతో బాధపడుతున్నారు. రాజశేఖరరెడ్డి బిడ్డ మా జగనన్న.. కచ్చితంగా ఆదుకుంటాడన్న ఆశతో ఎంతో మంది ఆశా కార్యకర్తలు.. గతంలో ఆ ప్రభుత్వానికి అండగా నిలిచారు. తీరా అధికారంలోకి వచ్చాక వీరి ఆశల అడియాసలయ్యాయి. ఎన్నికల్లో ఏ విధంగా బుద్ధి చెప్పాలో తెలుసునని రగలిపోతున్నారు.


  • బొండపల్లి, కర్లాం, గుర్ల పీహెచ్‌సీల పరిధిలో విధులు నిర్వహిస్తున్న ఆశా కార్యకర్తలు లక్ష్మి, రౌతు సత్యవతి, అరుణకుమారి కేన్సర్‌ వ్యాధితో ప్రాణాలు కోల్పోయారు.

  • పూసపాటిరేగ మండలంలో విధి నిర్వహణలో ఈశ్వరమ్మ, మరుపల్లిలో కృష్ణవేణి, గర్భాంలో రమణమ్మ రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. చల్లపేట పీహెచ్‌సీ పరిధిలో మరో ఆశా కార్యకర్త అనారోగ్యంతో చనిపోయారు.

శా కార్యకర్త.. క్షేత్ర స్థాయిలో ఎటువంటి వైద్యారోగ్య పథకమైనా వీరి సేవలు తప్పనిసరి. గర్భం దాల్చినా, బాలింత అయినా, చిన్నారులు పౌష్టికాహారం తీసుకోవాలన్నా, క్షయ, ఎయిడ్స్‌, కుష్ఠు, ఫైలేరియా రోగగ్రస్థులను గుర్తించాలన్నా, పల్స్‌ పోలియో విజయవంతం కావాలన్నా, టీకాలు అందరికీ చేరాలన్నా వీరిదే కీలక పాత్ర. ఇటీవల నిర్వహించిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలోనూ వీరే ముఖ్యపాత్ర పోషించారు. వీరు లేకుండా వైద్యులు ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేరు. ఎవరు ప్రసవమైనా.. ఏ ప్రాణం ఆగినా.. ఉన్నతాధికారులు ముందుగా వీరినే సంప్రదిస్తారు. క్షేత్ర స్థాయిలో ప్రజారోగ్యంపై కీలక పాత్ర పోషించే ఆశా కార్యకర్తల జీవితాలు మాత్రం మారడం లేదు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి రావడానికి వీరు ఎంతగానో కృషి చేసినా.. వారికి ఇచ్చిన హామీలు మాత్రం కలగానే మిగిలిపోయాయి. ఉద్యోగ భద్రత లేదు. సమాన పనికి సమాన వేతనం లేదు. అలవెన్స్‌లు లేవు. సొంత మనుషులు కష్టంలో ఉన్నా చూడటానికి వీలు పడదు. ఈ దుర్భర పరిస్థితుల నుంచి బయటపడేసి మేమూ మనుషులమే అని ఆత్మగౌరవాన్ని చాటేందుకు రాష్ట్ర వ్యాప్తంగా పలుమార్లు ధర్నాలకు దిగారు. ఆడబిడ్డల ఆక్రందనలు ఆ జగన్‌ చెవిలో పడలేదు.


సంక్షేమ పథకాలకు దూరం..

కలెక్టరేటు వద్ద ధర్నా కార్యక్రమంలో ఆశా కార్యకర్తలు

ఉమ్మడి జిల్లాలో 3,814 మంది ఆశా కార్యర్తలు పనిచేస్తున్నారు. వీరికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి మొత్తం రూ.10 వేలు వేతనంగా చెల్లిస్తున్నాయి. దాన్ని కూడా నెలలో ఒకసారి కాకుండా రెండు విడతలుగా విడుదల చేస్తున్నారు. ఇస్తున్న ఈ రూ.10 వేల జీతాన్ని ప్రభుత్వం ఉద్యోగంలా భావించి సంక్షేమ పథకాలను దూరం చేశారని ఆశా కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో వైద్య, ఆరోగ్య శాఖ కార్యక్రమాలకు అలవెన్స్‌ ఇచ్చేవారని,  క్షయ, కుష్ఠు, గర్భిణులకు వైద్య పరీక్షలు, బాలింతలు, చిన్నారులకు టీకాలు, పల్స్‌ పోలియా, ఇంద్ర ధనుస్సు వంటి కార్యక్రమాలు నిర్వహించినా.. పౌష్టిహారం, రక్తహీనతతో లోపంతో బాధపడేవారిని ఆసుపత్రికి తీసుకువెళ్లి వైద్య చికిత్సలు అందించినప్పుడు అలవెన్స్‌ ఇచ్చేవారు. ఇప్పుడు పనిభారం పెంచి అలవెన్స్‌లు ఆపేశారని ఆశా కార్యకర్తలు వాపోతున్నారు.


సమ్మె చేస్తే హామీ ఇచ్చారు..

సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆశా కార్యకర్తలు గతేడాది డిసెంబరు 14, 15 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా విధులు బహిష్కరించి సమ్మె చేశారు. ఈ సమయంలో వీరి ఆర్తనాదాలు విని వెంటనే పరిగెత్తుకొని వచ్చి ఏదో మొక్కుబడిగా వారిని శాంతింపజేయడానికి కొన్ని డిమాండ్ల పరిష్కారానికి ఒప్పుకొన్నారు. రూ.6 లక్షల బీమా, రూ.20 వేలు మట్టి ఖర్చులకు ఇస్తామని, రికార్డులను ప్రభుత్వమే కొని ఇస్తుందని హామీ ఇచ్చి సమ్మె విరమింపజేశారు. మినిట్స్‌లో ఆ హామీలు చూపించి.. ప్రభుత్వం జీవోలు మాత్రం విడుదల చేయలేదు.


కొన్ని డిమాండ్లు

  • పని భారం తగ్గించాలి. సంబంధం లేని పనులు చేయించరాదు.
  • ఆన్‌లైన్‌, రికార్డులు ఒక పని ఒక్కసారి మాత్రమే చేయించాలి.
  • నాణ్యమైన చరవాణి, 4జీ సిమ్స్‌ ఇవ్వాలి. ఆన్‌లైన్‌ వర్క్‌పై శిక్షణ ఇవ్వాలి.
  • ప్రభుత్వ, వైద్యసెలవులు వెంటనే అమలు చేయాలి.
  • సచివాలయాలు, ఉపకేంద్రాల్లో రోజూ ఉదయం నుంచి సాయంత్రం వరకు కూర్చోబెట్టడం ఆపాలి.
  • రిజిస్టర్‌లో రోజూ సంతకం చేయించడం వెంటనే ఆపాలి.
  • పీహెచ్‌సీకి పిలిపించిన ప్రతిసారీ టీఏ, డీఏలు ఇవ్వాలి.
  • రూ.10 లక్షల గ్రూపు బీమా సౌకర్యం కల్పించాలి.
  • ఏఎన్‌ఎం, ఆరోగ్య కార్యదర్శి నియామకాల్లో వెయిటేజీ ఇవ్వాలి.

వేధింపులు ఆపాలి
- బి.సుధారాణి, ఇందిర, ఆశా కార్యకర్తల సంఘం (సీఐటీయూ) ఉమ్మడి జిల్లాల నాయకులు

సమయానికి భోజనానికి పంపకుండా వేధించడం వల్ల తీవ్ర మానసిక ఆందోళనకు గురై.. చాలా మంది అనారోగ్యం పాలవుతున్నారు. గర్భవతులుగా, బాలింతలుగా ఉన్న ఆశా కార్యకర్తల్లో చాలా మందికి సెలవులు ఇవ్వకపోగా.. రూ.10 వేలు వేతనం ఇస్తున్నామనే పేరుతో 24 గంటల చాకిరీ చేయిస్తున్నారు. ఆసుపత్రిలో, క్షేత్ర స్థాయిలో వైద్య ఉద్యోగులు, సిబ్బంది చేయాల్సిన అనేక రకాల పనులను మాచేత చేయించడం తగదు. గ్రామీణ ప్రాంతాల్లో నెట్‌వర్కు లేకపోయినా, ఫోన్లు పనిచేయకపోయినా మమ్మల్నే బాధ్యుల్ని చేస్తూ నిందించడం మానుకోవాలి. జాతీయ ఆరోగ్య మిషన్‌ నిబంధనలకు భిన్నంగా వ్యవహరిస్తూ ఆశాలను తీవ్రమైన ఒత్తిడికి ప్రభుత్వం గురి చేస్తోంది. ఈ వేధింపుల నుంచి విముక్తి కోసం సంఘటితంగా ప్రయత్నిస్తున్నాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని