logo

కర్కశ పాలనలో రక్కసి రోడ్లు

ఎన్నికలకు ముందు దారులేస్తామని మాటిచ్చిన పాలకులు.. అధికారంలోకి రాగానే వారి జగనన్న పాలనను చూసి.. అన్నీ వదిలేశారు.. అభివృద్ధి మాటే మరిచారు. ప్రజాందోళనలతో కొన్నిచోట్ల పనులు ప్రారంభించేందుకు అధికారులు ముందుకు రాగా..

Published : 06 May 2024 04:13 IST

రోడ్లు బాగు చేస్తావంటే నమ్మేశాం
మళ్లీ నిన్ను నమ్మి మోసపోం జగన్‌

ఎన్నికలకు ముందు దారులేస్తామని మాటిచ్చిన పాలకులు.. అధికారంలోకి రాగానే వారి జగనన్న పాలనను చూసి.. అన్నీ వదిలేశారు.. అభివృద్ధి మాటే మరిచారు. ప్రజాందోళనలతో కొన్నిచోట్ల పనులు ప్రారంభించేందుకు అధికారులు ముందుకు రాగా.. ప్రభుత్వం నిధుల విడుదలలో జాప్యం చేయడం.. బిల్లులు నిలిచిపోవడంతో గుత్తేదారులు అర్ధాంతరంగా తప్పుకొన్నారు.. కొత్తగా పనులు చేసేందుకు సైతం ముందుకు రావడం లేదు. దీంతో ఈ ఐదేళ్లూ గుంతలదారుల్లోనే రాకపోకలు సాగాయి.. ఈ పరిస్థితితో ‘నమ్మి ఓటేశాం.. మళ్లీ ఆ తప్పు చేయం’ అంటూ ప్రభుత్వంపై ప్రజలు పెదవి విరుస్తున్నారు.

అధ్వాన రోడ్డు కారణంగా బొబ్బిలి గ్రామీణ మండలంలోని కారాడ వద్ద ధ్వంసమైన లారీ (పాతచిత్రం)


నిధులున్నా.. నిరుపయోగం

మధ్యలోనే నిలిచిన రావివలస- ఆరివలస మార్గం

చీపురుపల్లి, గుర్ల, మెరకముడిదాం, గరివిడి మండలాలకు 42 రహదారుల నిర్మాణానికి వ్యవసాయ మార్కెట్‌ కమిటీ నిధులు రూ.18.87 కోట్లు మంజూరయ్యాయి. చీపురుపల్లిలో 8 రహదారులకు రూ.4.51 కోట్లు, గుర్లలో 12కు రూ.5.42 కోట్లు, గరివిడిలో 12కు రూ.4.15 కోట్లు, మెరకముడిదాం మండలంలో రూ.10 రహదారుల అభివృద్ధికి రూ.4.79 కోట్లు కేటాయించారు. టెండర్లు దక్కించుకున్న ఓ గుత్తేదారు పనులు ప్రారంభించారు. కల్వర్టులు, బీటీకి ముందు చేపట్టాల్సిన ప్రక్రియను పూర్తిచేశాక.. బిల్లులు రాకపోవడంతో వదిలేశారు. ప్రస్తుతం రాళ్లు తేలిన వాటిపైనే ప్రయాణాలు సాగుతున్నాయి.

న్యూస్‌టుడే, గరివిడి


రాజాంలో ఎన్నాళ్లీ పాట్లు..

రాజాంలో రహదారుల విస్తరణ పనులను అధికార పార్టీ గాలికొదిలేసింది. రెండేళ్లుగా పనులు పూర్తి చేయలేక నాయకులు మడం తిప్పారు. గాయత్రీ కాలనీ నుంచి బొబ్బిలి కూడలి, జీఎంఆర్‌ ఇంజినీరింగ్‌ కళాశాల నుంచి అంబేడ్కర్‌ కూడలి వరకు 2 కి.మీ. మేర రహదారిని 80 అడుగుల మేర విస్తరించాలి. రెండేళ్ల క్రితం రూ.20 కోట్ల అంచనా వ్యయంతో మంత్రి బొత్స సత్యనారాయణ ప్రారంభించారు. గుత్తేదారుకు రూ.6 కోట్ల బిల్లులు చెల్లించకపోవడంతో మధ్యలోనే ఆపేశారు. నిత్యం 30 వేల మంది ఈ మార్గాల్లో ప్రయాణిస్తున్నారు. గుంతలతో వాహనాలు మరమ్మతులకు గురవుతున్నాయి. గొయ్యి వల్ల ఇటీవల వైకాపా ప్రచార రథం ఢీకొని విద్యార్థి సైతం మృతి చెందాడు. - న్యూస్‌టుడే, రాజాం


నిత్యం అవస్థలే..

వంగర మండలం అరసాడ గ్రామం నుంచి బాగమ్మపేట వెళ్లే పంచాయతీరాజ్‌ రహదారి గత ఐదేళ్లుగా అధ్వానంగా దర్శనమిస్తోంది. శివ్వాం మీదుగా తలగాం, రుషింగి, చిన్నరాజులగుమ్మడ, వీవీఆర్‌పేట వరకు ఈ దారి సాగుతోంది. అడుగడుగునా గుంతలు ఏర్పడ్డాయి. వీవీఆర్‌పేట, రాజులగుమ్మడ వాసులు వంగర రావాలంటే ఈ మార్గమే దిక్కు. అభివృద్ధికి రూ.2.40 కోట్ల నిధులు మంజూరైనా గుత్తేదారులు ముందుకు రాక పనులు ప్రారంభించలేదు. దీంతో నిత్యం అవస్థలు పడుతున్నామని పరిసరాల గ్రామస్థులు వాపోతున్నారు.

న్యూస్‌టుడే, వంగర


గజానికో గొయ్యి..

వేపాడ మండల కేంద్రానికి ప్రధాన రహదారైన సోంపురం- ఆనందపురం రోడ్డులో గజానికో గొయ్యి కనిపిస్తోంది. ఏళ్ల నుంచి అధ్వాన స్థితిలో దర్శనమిస్తోంది. నాలుగేళ్లుగా ఎలాంటి మరమ్మతులు లేవు. 16.5 కిలోమీటర్ల పొడవు గల ఈ దారి విస్తరణకు రూ.39 కోట్లు మంజూరయ్యాయి. 2021లో స్థానిక ప్రజాప్రతినిధులు పనులు ప్రారంభించారు. అయితే బిల్లుల చెల్లింపుల్లేక ఇలా గుంతలతోనే వదిలేశారు.

న్యూస్‌టుడే, వేపాడ


ధూళి రేగుతోంది..

ఇది బొబ్బిలి నుంచి తెర్లాం వెళ్లే రహదారి. అలజంగి వద్ద రాళ్లు తేలిపోయాయి. ఈ మార్గం మీదుగా రాజాం, శ్రీకాకుళం తదితర ప్రాంతాలకు నిత్యం వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. ఏడాదిగా అధ్వానంగా దర్శనమిస్తోంది. ఎక్కడికక్కడే భారీ గుంతలు ఏర్పడ్డాయి. దుమ్ము, ధూళి రేగుతోంది. గతేడాది ఈ రహదారిలోని కారాడ వద్ద గుంత కారణంగా లారీ ధ్వంసమైంది. దీంతో రూ.లక్షల నష్టం వచ్చిందని యజమాని వాపోయాడు. మరమ్మతులకు రూ.5 కోట్లతో ప్రతిపాదనలు పంపించినా నిధులు మంజూరు కాలేదు.

న్యూస్‌టుడే, బొబ్బిలి గ్రామీణం


మూడు జిల్లాలకు వెళ్లేందుకు..

సంతకవిటి, పొందూరు మండలాల మధ్య విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలను కలిపే ఆర్‌అండ్‌బీ ప్రధాన రహదారిది. దీని పరిధిలో 24 గ్రామాలున్నాయి. రెండు లైన్ల మేర విస్తరణకు 2021లో ప్రభుత్వం రూ.50 కోట్లు మంజూరు చేసింది. ర.భ.శాఖాధికారులు పలుమార్లు టెండర్లు పిలిచినా.. గతంలో చేసిన పనులకు బిల్లుల చెల్లింపులు జరగక గుత్తేదారులు ముందుకు రాలేదు. రోజూ ఈ మార్గం గుండా 1,500 మందికి పైగా ప్రయాణికులు రాకపోకలు చేస్తుంటారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం తదితర ప్రాంతాలకు వెళ్లేందుకు ఇదే ప్రధాన దారి. గోతులు ఏర్పడటంతో కావలి, మంతిన, మిర్తివలస గ్రామాలకు చెందిన పలువురు మృతి చెందారు. ఎంతో మంది గాయపడిన ఘటనలున్నాయి.

న్యూస్‌టుడే, సంతకవిటి


ప్రయాణికులకు పాట్లు

రేగిడి మండలంలోని ఉంగరాడ మెట్ట నుంచి జోడుబందర మధ్య 11.6 కి.మీ. పనులను రూ.24.89 కోట్లతో 2021 ఫిబ్రవరి 25న ప్రారంభించారు. చేసిన పనులకు బిల్లులు చెల్లించకపోవడడంతో గుత్తేదారు పనులను ఆపేశారు. రోజుకు సుమారు 500 నుంచి 600 మంది వరకూ ఈ రహదారిపై ప్రయాణిస్తుంటారు. పాతబడిన వంతెనలు, గోతులు, తారు ఊడిన రహదారిపై ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు.

న్యూస్‌టుడే, రేగిడి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని