logo

‘మిథ్యా’లయం!

ఉమ్మడి జిల్లాలో ఉన్నత విద్యకు అవకాశమున్న ఏకైక జేఎన్‌టీయూ గురజాడ విశ్వవిద్యాలయంపై ప్రభుత్వం శీతకన్ను వేసింది. 2007లో కాకినాడ విశ్వవిద్యాలయం ప్రాంగణంగా ఇది ఏర్పాటైంది.

Updated : 17 May 2024 06:28 IST

జేఎన్‌టీయూలో వెంటాడుతున్న బోధకుల కొరత
కాకినాడ విద్యాలయం నుంచే  కొందరికి జీతాలు

సమస్యల పరిష్కారానికి విద్యార్థుల ఆందోళన (పాతచిత్రం)

ఉమ్మడి జిల్లాలో ఉన్నత విద్యకు అవకాశమున్న ఏకైక జేఎన్‌టీయూ గురజాడ విశ్వవిద్యాలయంపై ప్రభుత్వం శీతకన్ను వేసింది. 2007లో కాకినాడ విశ్వవిద్యాలయం ప్రాంగణంగా ఇది ఏర్పాటైంది. 2022లో కాకినాడ నుంచి విడిపోయి యూనివర్శిటీ హోదా దక్కించుకున్నా అభివృద్ధి లేదు. బోధÅకులూ కరవయ్యారు. సమస్యలపై విద్యార్థులు పలుమార్లు రోడ్డెక్కినా ఫలితం లేదు. దీంతో ప్రవేశాలు తగ్గుతున్నాయి. 

న్యూస్‌టుడే, విజయనగరం విద్యావిభాగం

విధులిక్కడ.. జీతాలక్కడ...

ఇంజినీరింగ్‌ కళాశాలగా ఉన్న సమయంలో బోధన 41, బోధనేతర సిబ్బంది ఆరుగురు రెగ్యులర్‌గా నియమితులయ్యారు. వీరిలో  21 మంది ఫ్యాకల్టీ, ఆరుగురు బోధనేతర సిబ్బంది డిప్యుటేషన్‌పై నర్సరావుపేట, కాకినాడ విద్యాలయానికి వెళ్లారు. మరికొందరు ఐచ్ఛికం ఇచ్చి కాకినాడకు వెళ్లిపోయారు. ప్రస్తుతం బోధిస్తున్న 22 మందిలో 17 మంది ఇక్కడివారే. మిగిలినవారిని బోధనకు ఇబ్బంది లేకుండా ఇక్కడ కొనసాగిస్తున్నారు. అక్కడి నుంచే వీరికి జీతాలు చెల్లిస్తున్నారు. తాత్కాలిక ప్రాతిపదికన 51, గంటల ప్రాతిపదికన అయిదుగురు మొత్తం 56 మంది  బోధకులుగా పనిచేస్తున్నారు.  

ఇద్దరే సహాయకులు

బోధనేతర సిబ్బందిలో ఉప రిజిస్ట్రార్‌, సహాయ రిజిస్ట్రార్‌, ఇద్దరు సీనియర్‌ సహాయకులు నలుగురిని డిప్యుటేషన్‌పై తిప్పుతున్నారు. ఇటీవలే ఉప రిజిస్ట్రార్‌(డీఆర్‌)ని వెనక్కి రావాలని ఆదేశించారు. ఏఆర్‌ మెడికల్‌ లీవులో ఉన్నారు. ఇద్దరు సీనియర్‌ అసిస్టెంట్లతోనే నడుస్తోంది. కాకినాడ విశ్వవిద్యాలయమే వీరికి జీతాలు చెల్లిస్తోంది. పది వరకు పోస్టులు మంజూరు చేయాల్సి ఉన్నా, భర్తీ కాలేదు.  

విభాగాల్లో రక్షణ సిబ్బంది

పొరుగు సేవల కింద నియామకాలకు ఓ కమిటీ లేదు. రోస్టర్‌ పాటించలేదు. ఎక్కువ మంది ప్రజాప్రతినిధుల సిఫార్సుల మేరకు నియమితులైనవారే. 2007లో పొరుగుసేవల కింద తీసుకున్న 56 మంది ఉన్నారు. ఈ ప్రభుత్వం 2019 తర్వాత ఎవరినీ తీసుకోకూడదని ఉత్తర్వులిచ్చింది. అయినా అవసరం మేరకు కొందరిని నియమించారు. వీరు కాకుండా టెండర్‌పై సెక్యూరిటీ 60, హౌస్‌  కీపింగ్‌లో 60 మందిని తీసుకున్నారు.  

ప్రవేశాలకు విముఖత

ఇంజినీరింగ్‌లో మంచి ర్యాంకులు సాధించిన విద్యార్థులు ఇక్కడ ప్రవేశాలకు విముఖత చూపుతున్నారు. 2023-24లో ప్రవేశాల్లో సీఎస్‌ఈ, ఈసీఈ, ఐటీ మినహా మిగిలిన కోర్సుల్లో 10 వేలలోపు ర్యాంకుల వారు లేరు. ఎక్కువ డిమాండ్‌ ఉన్న సీఎస్‌ఈలో ఓపెన్‌ కేటగిరీ పురుషుల విభాగంలో మూడువేలలోపు ర్యాంకుల వారు లేరు. 10,546 ర్యాంకు వరకు సీట్లు లభించాయి. బీసీ-డిలో అయిదువేల ర్యాంకు దాటినవారే ప్రవేశాలు పొందారు. ఈసీఈ ఓపెన్‌లో ఏడువేలు, బీసీడీలో 10వేలు దాటిన అభ్యర్థుల నుంచి సీట్ల కేటాయింపు ప్రారంభమైంది. మెటలర్జీ ఓపెన్‌ కేటగిరీలో మహిళలకు 1,98,861 ర్యాంకుకూ సీటు లభించింది. బీసీ-డి కేటగిరీలో 1,41,492 ర్యాంకుకు సీటు కేటాయించారు. ఈఈఈలో పురుషులు ఓపెన్‌లో 29వేల ర్యాంకు, బీసీడీలో 17వేల ర్యాంకు పైబడిన వారికీ సీట్లు లభించాయి. మెకానికల్‌లో ఓపెన్‌లో పురుషులు 49వేలు ర్యాంకు, బీసీ-డిలో 24,118 ర్యాంకు పైబడిన వారికి, సివిల్‌లో 60వేల ర్యాంకుల వారు ప్రవేశాలు పొందారంటే పరిస్థితి అర్థమవుతోంది.

వసతికి వెతలు

  • వసతిగృహాల్లో సమస్యలపై విద్యార్థులు గత నవంబరు 8న ప్రవేశద్వారం వద్ద బైఠాయించారు. నాలుగేళ్ల కిందటా ఇలాగే నిరసన తెలిపారు. జేఎన్‌టీయూలో నాలుగు వసతిగృహాల్లో సుమారు వెయ్యి మంది ఉంటున్నారు. 29 సమస్యల పరిష్కారానికి అధికారులు హామీ ఇవ్వాలని డిమాండు చేశారు. ఇటీవలే వారిలో 11 మందిని వసతి గృహాల నుంచి సస్పెండ్‌ చేశారు. ఒక విద్యార్థికి పాము కరవడం, పలుమార్లు కొందరు అస్వస్థతతో ఆసుపత్రుల్లో చేరడం వంటి ఘటనలు చోటుచేసుకున్నాయి.
  • జాతీయ రహదారి-26 నుంచి విశ్వవిద్యాలయం ప్రవేశద్వారం వరకు రోడ్డు విస్తరణ ప్రతిపాదన కార్యరూపం దాల్చలేదు. వీసీ బంగ్లా, ఆడిటోరియం, వాటర్‌ట్యాంకు, పరీక్షల విభాగం నిర్మాణాలకు టెండర్లు పూర్తయ్యాయని చెబుతున్నారు. కురుపాం కళాశాలకు రూ.30కోట్లు, పరిపాలనా విభాగానికి రూ.12కోట్లు, ఆడిటోరియానికి రూ.8కోట్లు, ఇతరత్రా పనులకు రూ.20కోట్లు నిధులిచ్చినా పనులు జరగలేదు.  
  • తొలిసారిగా 2022-23లో విశ్వవిద్యాలయ స్థాయిలో పరీక్షలు నిర్వహించారు.   ప్రశ్నపత్రాల లీకేజీలు, పాతవి మళ్లీ ఇవ్వడం, ధ్రువపత్రాల జారీలో అపవాదునేసుకుంది. ఉత్తీర్ణులకు సీఎంఎం (కన్‌సాలిడేషన్‌ మార్క్స్‌ మెమో), బదిలీ పత్రాలివ్వడంలో జాప్యం జరిగింది. విద్యార్థులు యూజీసీ, ఏఐసీటీయూకి ఫిర్యాదులు చేశారు. రీవేల్యూషన్‌, అడ్వాన్స్డ్‌సప్లిమెంటరీ నిర్వహణ, ఛాలెంజింగ్‌ వేల్యూషన్‌ సక్రమంగా అమలుకావడం లేదన్న    ఆరోపణలున్నాయి.

ప్రతిబంధకాలివే..

  • నాక్‌ గుర్తింపు లేకపోవడం.
  • ఎన్‌బీఏ గుర్తింపు ఏడు బ్రాంచుల్లో ఐటీ, ఈఈఈ, సివిల్‌, మెటలర్జీ నాలుగు బ్రాంచులే ఉంది.
  • ఎన్‌ఆర్‌ఐఎఫ్‌ ర్యాంకింగ్‌లో యూనివర్సిటీ చోటు దక్కించుకోకపోవడం.
  • ప్రాంగణ నియామకాలు అంతంతమాత్రమే.


వీసీ ఏమన్నారంటే..

ఐఐటీ, ఎన్‌ఐటీల్లో సీట్లు పెరగడం.. డబ్బులు కట్టేవారంతా డీమ్డ్‌ విశ్వవిద్యాలయాలపై మొగ్గుచూపడంతో ఇక్కడకు మంచి ర్యాంకర్లు రాలేదు. విద్యాలయం నాక్‌, ఎన్‌బీఏ గుర్తింపు పొందేందుకు చర్యలు తీసుకుంటున్నాం. బోధనకు ఇబ్బంది లేకుండా తాత్కాలిక ఫ్యాకల్టీ పనిచేస్తున్నారు. ప్రాంగణ నియామకాలకు చర్యలు తీసుకుంటాం.

కె.వెంకట సుబ్బయ్య, ఉప కులపతి, జేఎన్‌టీయూ గురజాడ విద్యాలయం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని