logo

Harassment: ‘లాడ్జికొస్తావా! డిప్యుటేషన్‌ రద్దు చేయించమంటావా!!’

‘నీ డిప్యుటేషన్‌ రద్దు చేయించకుండా ఉండాలంటే నా కోరిక తీర్చాలి. మార్కాపురంలోనే నా స్నేహితుడికి లాడ్జి ఉంది. అక్కడికి వస్తావా! లేదంటే పొదిలికి రా.. అక్కడా కుదరదంటే కంభం వచ్చినా సరే.

Updated : 26 May 2024 09:26 IST

డీఎల్పీవో కార్యాలయంలో కీచక అధికారి
మహిళా ఉద్యోగినికి వేధింపులు

మార్కాపురం, న్యూస్‌టుడే: ‘నీ డిప్యుటేషన్‌ రద్దు చేయించకుండా ఉండాలంటే నా కోరిక తీర్చాలి. మార్కాపురంలోనే నా స్నేహితుడికి లాడ్జి ఉంది. అక్కడికి వస్తావా! లేదంటే పొదిలికి రా.. అక్కడా కుదరదంటే కంభం వచ్చినా సరే. ఎక్కడనేది నీ ఇష్టం. నేను చెప్పినట్లు చేయకుంటే డిప్యుటేషన్‌ రద్దు చేయిస్తా. అప్పుడు ఇక్కడే ఉద్యోగం చేసుకోలేవు. దూర ప్రాంతానికి వెళ్లి వస్తుంటే అప్పుడు తెలుస్తుంది నీకు నరకం. అంతా నా చేతుల్లోనే ఉంది. నా మాట విని మార్కాపురంలోని నా స్నేహితుడి లాడ్జికి రా’... ఇవీ మార్కాపురం డివిజనల్‌ పంచాయతీ కార్యాలయంలో ఓ మహిళా ఉద్యోగినికి అధికారి నుంచి ఎదురైన లైంగిక వేధింపులు.  

మార్కాపురంలోని డివిజనల్‌ పంచాయతీ కార్యాలయం

మార్కాపురం డివిజనల్‌ పంచాయతీ కార్యాలయం మహిళా ఉద్యోగినులను లైంగికంగా వేధించే ప్రాంతంగా మారింది. ఇక్కడ పనిచేసే కొందరు అధికారులు.. కీచకుల అవతారమెత్తారు. ఇప్పటికే సీనియర్‌ సహాయకుడు శ్రీనివాసులు సస్పెన్షన్‌కు గురయ్యారు. ఇదే కార్యాలయంలో పనిచేసే మరో బాసుదీ అదే తీరు. మహిళా ఉద్యోగినులకు తన మాటలు, చేతలతో కార్యాలయంలో నరకం చూపుతున్నాడు. వారితో బూట్లు తీయించుకోవడం.. కాళ్లు పట్టించుకోవడం నిత్యకృత్యమైంది. ఓ వితంతు మహిళకు ప్రభుత్వం కరుణ చూపి ఉద్యోగమిచ్చింది. ఇతర ప్రాంతంలో విధులు నిర్వహించలేక ఆమె డిప్యుటేషన్‌పై మార్కాపురం వచ్చారు. అప్పటి నుంచి ఆమెపై కన్నేసిన అధికారి.. డిప్యుటేషన్‌ అంశాన్ని అదునుగా తీసుకొని వేధింపులకు గురిచేయ సాగాడు. తోటి ఉద్యోగులు భోజనానికి వెళ్లిన తర్వాత సదరు మహిళా ఉద్యోగినితో అసభ్యంగా ప్రవర్తించేవాడు. చెప్పిన పని చేయకుంటే ‘నీ సంగతి నాకు తెలుసు. నిన్ను ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతా. నాకు సహకరించకుంటే డిప్యుటేషన్‌ రద్దు చేయిస్తా’.. అంటూ బెదిరింపులకు దిగేవాడు. మార్కాపురంలోని తన స్నేహితుడి లాడ్జికి రావాలని, లేకుంటే పొదిలి, కంభమైనా రావాలంటూ వేధిస్తుండేవాడు. తన ప్రొబిషన్‌ కాలం పూర్తయ్యే వరకు వీటన్నింటినీ పంటి బిగువున భరిస్తూ వచ్చారు. చివరికి విసిగివేసారి నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం నాయకులకు శనివారం లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని