చికిత్సకు వెళ్లొస్తూ అనంతలోకాలకు

వైద్యం కోసం చెన్నై వెళ్లిన ఆ దంపతులు తిరిగి స్వస్థలం వెళ్తుండగా ప్రమాదానికి గురై అసువులు బాసిన సంఘటన ఒంగోలు సమీప కొప్పోలు పై వంతెన వద్ద

Updated : 29 Sep 2022 05:35 IST

రోడ్డు ప్రమాదంలో దంపతులు దుర్మరణం

కుమారుడికి తీవ్ర గాయాలు

ప్రమాదానికి గురైన కారులో మృతదేహాలు

ఒంగోలు గ్రామీణం, సత్తెనపల్లి, న్యూస్‌టుడే: వైద్యం కోసం చెన్నై వెళ్లిన ఆ దంపతులు తిరిగి స్వస్థలం వెళ్తుండగా ప్రమాదానికి గురై అసువులు బాసిన సంఘటన ఒంగోలు సమీప కొప్పోలు పై వంతెన వద్ద చోటుచేసుకుంది. ఈ ఘటనలో వారి కుమారుడు తీవ్రంగా గాయపడ్డారు. ఒంగోలు తాలూకా పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పల్నాడు జిల్లా సత్తెనపల్లి పట్టణంలో ఔషధ దుకాణం నిర్వహిస్తున్న కందకట్ల సీతారామయ్య(60) గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు.. చికిత్స నిమిత్తం ఇటీవల భార్య సుశీలదేవి(55)తో కలిసి ఆయన చెన్నై వెళ్లారు. అక్కడ చూపించుకొని బుధవారం సొంత కారులో సత్తెనపల్లి బయలుదేరారు. కారును పెద్ద కుమారుడు శ్రీనివాసరావు నడుపుతున్నారు. సాయంత్రం 3.40 గంటల సమయంలో కొప్పోలు పై వంతెన వద్ద ముందు వెళ్తున్న టిప్పర్‌ను వీరి కారు ఢీకొంది. దంపతులిద్దరూ అక్కడకక్కడే మృతి చెందారు. శ్రీనివాసరావుకు తీవ్రగాయాలయ్యాయి. ఆయనను ఒంగోలులోని ఓ ప్రైవేట్‌ వైద్యశాలలో చేర్చారు. తాలుకా స్టేషన్‌ సీఐ వి.శ్రీనివాసరెడ్డి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాలను ఒంగోలు సర్వజన వైద్యశాలకు తరలించారు.

చేదోడు వాదోడుగా
సత్తెనపల్లి పాత పోలీసు స్టేషన్‌ ఎదురుగా శ్రీనివాస మెడికల్స్‌ అండ్‌ ఫ్యాన్సీ స్టోర్‌ను సీతారామయ్య నిర్వహిస్తున్నారు. వ్యాపారంలో భార్య సుశీల సహకరించేవారు. వీరికి ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. కుమారులు శ్రీనివాసరావు అలియాస్‌ వాసు, శివనాగేశ్వరరావు కూడా అదే దుకాణంలో పని చేస్తున్నారు. సీతారామయ్యకు 20 రోజుల క్రితం చెన్నైలో గుండె శస్త్రచికిత్స జరిగింది. చెన్నైలో ఉద్యోగం చేస్తున్న కుమార్తె పూర్ణ ఇంట్లో పది రోజులు ఉన్నారు. పెద్ద కుమారుడు శ్రీనివాసరావు కారులో బుధవారం వారిని తీసుకొస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. సీతారామయ్య సోదరుడు కొండలరావు ఆగస్టు 21న గుంతలో పడి మృతి చెందారు. ఆ ఘటన నుంచి తేరుకోకముందే మళ్లీ అదే ఇంట విషాదం చోటుచేసుకుంది.

సీతారామయ్య, సుశీల దంపతులు (పాతచిత్రం)


సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ.. రోటరీ క్లబ్‌ పట్టణ శాఖలో సీతారామయ్య గతంలో క్రియాశీలకంగా పని చేశారు. పల్స్‌పోలియో కార్యక్రమ నిర్వహణలో పురస్కారాలు పొందారు. మెడికల్‌ అసోసియేషన్‌ హాలు నిర్మాణానికి కృషి చేశారని సన్నిహితులు తెలిపారు.


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని