logo

క్వారీలపై వికృత స్వారీ

చీమకుర్తిలోని గెలాక్సీ గ్రానైట్‌కు ప్రపంచ వ్యాప్తంగా పేరుంది. జిల్లాతో పాటు పొరుగు రాష్ట్రాలకు చెందిన వేల మంది కార్మికులకు ఇక్కడి గనులు ఉపాధి చూపుతుంటాయి.

Updated : 27 Jun 2023 05:18 IST

ఆదుకుంటానంటూ ప్రతిపక్షంలో మాటలు
అధికారంలోకి వస్తూనే ప్రత్యర్థులపై వేధింపులు
జిల్లాలో సగానికి పైగా గనుల్లో నిలిచిన పనులు
ఈనాడు, ఒంగోలు

చీమకుర్తిలోని గెలాక్సీ గ్రానైట్‌కు ప్రపంచ వ్యాప్తంగా పేరుంది. జిల్లాతో పాటు పొరుగు రాష్ట్రాలకు చెందిన వేల మంది కార్మికులకు ఇక్కడి గనులు ఉపాధి చూపుతుంటాయి. ప్రభుత్వ ఖజానాకు ఆదాయంతో పాటు విదేశీ మారక ద్రవ్యాన్నీ సమకూర్చి పెడుతుంటాయి. ఇంతటి కీలకమైన క్వారీలకు ఇప్పుడు రాజకీయ గ్రహణం పట్టుకుంది. అటు ప్రభుత్వం, ఇటు అధికార పార్టీకి చెందిన కొందరు నేతలు క్వారీలపై పెత్తనం చెలాయిస్తూ ఇష్టారీతిన స్వారీ సాగిస్తున్నారు. ఫలితంగా కార్యకలాపాలు నిర్వహించాలంటేనే వ్యాపారులు వణికిపోతున్నారు.

ఆనాడు నేనున్నానంటూ...: ప్రతిపక్ష నాయకుడి హోదాలో వైఎస్‌.జగన్‌ మోహన్‌ రెడ్డి రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర నిర్వహించారు. ఆ సమయంలో ప్రకాశం జిల్లాకూ వచ్చారు. ఇక్కడి గ్రానైట్‌ క్వారీలు, పరిశ్రమల నిర్వాహకులు, కటింగ్‌, పాలిషింగ్‌ యూనిట్ల యజమానులతో సమావేశమై వినతులు స్వీకరించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యుత్తు రాయితీ ఇస్తామని, శ్లాబ్‌ విధానం అమలు చేస్తామని, మరిన్ని ఇతర రాయితీలతో ప్రోత్సాహం అందిస్తామని హామీలు గుప్పించారు.

నెలలపాటు తనిఖీలు...: 2019 మే 30న ముఖ్యమంత్రిగా జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. గతంలో ఇచ్చిన హామీల మేరకు తమ సమస్యలు తీరుతాయని గ్రానైట్‌ వర్గాలు ఆశించాయి. అయితే నెలలు గడిచినా ఆ ఆనవాళ్లేమీ కనిపించలేదు. సరికదా అదే ఏడాది డిసెంబర్‌లో జిల్లాలోని గ్రానైట్‌ క్వారీల్లో విజిలెన్స్‌, గనుల శాఖ ఆధ్వర్యంలో తనిఖీలు ముమ్మరంగా చేపట్టారు. దాదాపు నెల రోజులపాటు ఈ సోదాలు సాగాయి.

జరిమానాలతో బెంబేలు...: తనిఖీలు పూర్తై అధికారులు నివేదికలను ప్రభుత్వానికి అందజేశారు. తర్వాత కొద్దిరోజులకే గనుల శాఖ నుంచి 108 మంది లీజుదారులకు తాఖీదులు అందాయి. రూ.3 వేల కోట్ల వరకు జరిమానాలుగా చెల్లించాలంటూ అందులో పేర్కొన్నారు. రూ.కోట్లలో ఉన్న జరిమానాలను చూసి క్వారీ యజమానులు బెంబేలెత్తారు.

అయినవాళ్లకు మినహాయింపులు...: తాఖీదులు అందుకున్న వారిలో కొందరు ప్రభుత్వ పెద్దలను కలిసి రాయబేరాలు సాగించారు. మంత్రాంగం ఫలించి అధికార పార్టీకి చెందిన క్వారీ నిర్వాహకులకు జరిమానాల నుంచి మినహాయింపు లభించింది. ఈ తీరుపై ఇతరులు కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.

పడిపోయిన  ప్రభుత్వ ఆదాయం...

చీమకుర్తి గ్రానైట్‌ క్వారీల నుంచి రాయల్టీ రూపంలో ప్రభుత్వానికి పెద్ద మొత్తంలో ఆదాయం వస్తుంది. 2019-20లో ఒక నెలలోనే ఎగుమతులు 54 వేల క్యూబిక్‌ మీటర్లుండగా.. 2022లో 45 వేలకు పడిపోయాయి. ఈ ఏడాది ఇప్పటి వరకు ఒక నెల మొత్తం అసలు ఎగుమతులే లేని దుస్థితి. 2020-21లో గనుల శాఖకు రాయల్టీ రూపంలో రూ.371 కోట్లు ఆదాయం సమకూరగా.. గతేడాది రూ.428 కోట్ల లక్ష్యానికి గాను రూ.300 కోట్ల వరకే వసూలైంది. ఈ ఏడాది ఇప్పటి వరకు వ్యాపారం, ఎగుమతులు పెద్దగా లేవు. దీంతో రూ.150 కోట్లు కూడా ఆదాయం రాని దుస్థితి. వేధింపులకు తోడు కొవిడ్‌ కారణంగా అంతర్జాతీయంగా ఎగుమతులు నిలిచిపోయాయి. అదే సమయంలో భారీగా పెరిగిన ఇంధన ధరలు, సముద్ర రవాణా ఛార్జీలు ఆందోళనకు గురిచేశాయి. ఈ పరిణామాలన్నీ క్వారీలపై ప్రభావం చూపుతూ కార్యకలాపాలు తగ్గి ప్రభుత్వ ఆదాయానికి గండి పడింది.

లీజులా..  మాకొద్దు బాబోయ్‌...

చీమకుర్తిలోని ఓ గ్రానైట్‌ గని

తనిఖీలు, తాఖీదులు, జరిమానాలతో ఇప్పటికే క్వారీల్లో కార్యకలాపాలను పలువురు నిలిపివేశారు. చీమకుర్తిలో మొత్తం 45 క్వారీలు యజమానుల చేతిలో ఉన్నాయి. వీటి పరిధిలో 160 వరకు లీజులున్నాయి. ఇరవై సంవత్సరాలకు ఒకసారి లీజులను పునరుద్ధరించుకోవాల్సి ఉంటుంది. గతంలో హెక్టార్‌కు రూ.1.30 లక్షలు చెల్లిస్తే సరిపోయేది.. ఇప్పుడు రూ.12 లక్షల వరకు కట్టమంటున్నారు. అదే సమయలో 2020లో క్వారీలకు విధించిన జరిమానాలు చెల్లిస్తేనే పునరుద్ధరిస్తామని చెబుతున్నారు. దీంతో పలువురు తమ లీజులను పునరుద్ధరించుకునేందుకు ముందుకు రాలేదు. కొందరు ముందుకొచ్చినప్పటికీ.. అధికార పార్టీ నేతల ఒత్తిడితో అధికారులు సాహసించడం లేదు. దీంతో ఒకప్పుడు కర్నూలు- ఒంగోలు రహదారిపై చీమలదండును తలపించేలా రాకపోకలు సాగించే టిప్పర్లు ఇప్పుడు అంతగా కనిపించడం లేదు. రామాయపట్నం పోర్టుకు తరలించే గ్రానైట్‌ వ్యర్థాల రాళ్ల వాహనాలే తిరుగుతున్నాయి.

ఎగుమతులు ఊపందుకోలేదు..

చీమకుర్తి గ్రానైట్‌ క్వారీల నుంచి విదేశాలకు ఎగుమతులు ఇంకా ఊపందుకోలేదు. వ్యాపారం లేక ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం కూడా భారీగా తగ్గింది. గతేడాదితో పోల్చితే 40 శాతమే సమకూరింది. డెబ్భైకి పైగా లీజుల్లో క్వారీయింగ్‌ సాగుతోంది. పన్నెండింటికి సంబంధించిన లీజుల పునరుద్ధరణ దరఖాస్తులు పరిశీలనలో ఉన్నాయి.

జగన్నాథరావు, డీడీ, గనుల శాఖ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని