logo

అధికారాంతమునా అరాచకం

ఎన్నికల వేళా వైకాపాలోని భూ బకాసురుల ఆగడాలకు అడ్డుకట్ట పడటం లేదు. విలువైన భూములపై కన్నేస్తున్నారు. అధికారం చేతిలో ఉన్నప్పుడే వాటిలో పాగా వేసేందుకు తహతహలాడుతున్నారు.

Published : 02 May 2024 02:23 IST

కలెక్టర్‌ ఆదేశాలున్నప్పటికీ బేఖాతరు
రూ. 4 కోట్ల స్థలంలో రాత్రికి రాత్రే బోర్డుల ఏర్పాటు
ఈనాడు, ఒంగోలు

మహిళా మార్ట్‌కు కేటాయించిన స్థలంలో ఏర్పాటు చేసిన ఓ సామాజిక వర్గానికి చెందిన బోర్డు

ఎన్నికల వేళా వైకాపాలోని భూ బకాసురుల ఆగడాలకు అడ్డుకట్ట పడటం లేదు. విలువైన భూములపై కన్నేస్తున్నారు. అధికారం చేతిలో ఉన్నప్పుడే వాటిలో పాగా వేసేందుకు తహతహలాడుతున్నారు. ఈ క్రమంలో కలెక్టర్‌ ఆదేశాలనూ ఖాతరు చేయడం లేదు. ఎవరు చెబితే మాకేంటీ అన్నట్లు వ్యవహరిస్తున్నారు. అధికారాంతమునా తమ అరాచకాలను కొనసాగిస్తున్నారు. ఇందుకు యర్రగొండపాలెం పట్టణంలో చోటుచేసుకున్న ఘటనే నిదర్శనం. ఇక్కడ ప్రధాన రహదారి వెంట ఆర్టీసీ బస్టాండ్‌ పక్కన ప్రభుత్వ స్థలం ఉంది. రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో ‘మహిళా మార్ట్‌’ ఏర్పాటుకు అధికారులు ఏడు సెంట్ల స్థలం కేటాయించారు. ఈ విషయాన్ని తెలుపుతూ కలెక్టర్‌ దినేష్‌ కుమార్‌ గతేడాది సెప్టెంబర్‌లో ఆడ్వాన్స్‌ పొజిషన్‌ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో మార్ట్‌ నిర్మాణానికి డీఆర్‌డీఏ, వెలుగు అధికారులు సిద్ధమయ్యారు. నిధుల లేమితో నిర్మాణ పనులకు నోచుకోలేదు. ఈలోగా ఎన్నికలు రావడంతో ఆ ఊసే మరుగున పడింది. ఈ స్థలం విలువ బహిరంగ మార్కెట్‌లో సుమారు రూ. 4 కోట్ల వరకు ఉంటుంది. ఇదే అదనుగా భావించిన వైకాపాలోని కొందరు నాయకులు ఆ స్థలంపై కన్నేశారు. సామాజిక సంఘాల భవనం పేరుతో మంగళవారం రాత్రి ఏకంగా బోర్డు పాతేశారు. అయినప్పటికీ రెవెన్యూ అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టకుండా మిన్నకుండిపోయారు. ఎన్నికల సమయం కావడంతో ఎవరూ పట్టించుకోరనే ఉద్దేశంతోనే అధికార పార్టీకి చెందిన కొందరు ఇలా ఆక్రమణకు దిగినట్లు విమర్శలు వినిపిస్తున్నాయి.

స్థలాన్ని మార్ట్‌కు కేటాయిస్తూ జారీ చేసిన ఉత్తర్వులు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని