logo

వైకాపా నేతల విధ్వంసం

అయిదేళ్లలో పాలకుడి అండతో వైకాపా నేతలు సృష్టించిన ప్రకృతి విధ్వంసం అంతా ఇంతా కాదు.. కనిపించిన కొండను కొల్లగొట్టి..అందుబాటులో ఉన్న ఇసుకను దోచేసి.. అక్కడక్కడా ఉన్న ఎర్రమట్టిని తవ్వేసి.. రూ. కోట్లు దండుకున్నారు.

Updated : 06 May 2024 05:39 IST

దర్శిలో కొండలు, కోనలు ఛిధ్రం
ముండ్లమూరులో ఇసుక దోపిడీ
వందలాది వాహనాల్లో మట్టి తరలింపు
అయిదేళ్లలో రూ. వందల కోట్ల దోపిడీ

అయిదేళ్లలో పాలకుడి అండతో వైకాపా నేతలు సృష్టించిన ప్రకృతి విధ్వంసం అంతా ఇంతా కాదు.. కనిపించిన కొండను కొల్లగొట్టి..అందుబాటులో ఉన్న ఇసుకను దోచేసి.. అక్కడక్కడా ఉన్న ఎర్రమట్టిని తవ్వేసి.. రూ. కోట్లు దండుకున్నారు. ఫలితంగా పచ్చని గిరులు..తరులతో పాటు, నదులు నామరూపాలు కోల్పోయాయి. ఇటు పోలీసు.. అటు రెవెన్యూ యంత్రాంగం  ప్రేక్షకపాత్ర వహించారు. ముఖ్యమంత్రి జగన్‌ హయాంలో జిల్లాలో ఈ దోపిడీ స్వేచ్ఛగా.. యథేచ్ఛగా సాగుతూనే ఉంది.

దర్శి, న్యూస్‌టుడే: వైకాపా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సహజ వనరుల విధ్వంసం ఇష్టారాజ్యంగా సాగుతోంది. దర్శి మండల పరిధిలో పర్యావరణానికి ప్రతిరూపాలైన కొండలను లక్ష్యంగా చేసుకుని మట్టి మాఫియా చెలరేగిపోయింది. అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధుల అండతో భారీ యంత్రాల సాయంతో తవ్వకాలు చేపట్టి మట్టిని సరిహద్దులు దాటించారు.  

దర్శి ప్రాంతంలో వెంకటాచలంపల్లికి సమీపంలో దర్శి-కురిచేడు ప్రధాన రహదారికి ఇరువైపులా ఉన్న రెండు కొండలు, దర్శి నుంచి దొనకొండకు వెళ్లే మార్గంలో చందలూరుకు సమీపంలోని కొండ, దర్శి నుంచి పోతవరం వెళ్లే మార్గంలో కొండలను వైకాపా నాయకులు కొల్లగొట్టి మట్టిని తరలించి సొమ్ము చేసుకున్నారు. వీటితో పాటు చలివేంద్రకు సమీపంలో జగనన్న కాలనీని ఆనుకుని ఉన్న కొండతో పాటు సమీపంలోని చెరువుల్లోని మట్టిని రోజుకు 100 నుంచి 150 టిప్పర్లతో తవ్వి తరలించారు.      

దర్శి : వెంకటాచలంపల్లికి సమీపంలో తవ్వకాలతో తరిగిపోయిన కొండప్రాంతం

అధికారం అండతో..

దర్శి ప్రాంతంలో కొండమట్టి నాణ్యంగా ఉండటం, రియల్‌ వ్యాపారం ఊపందుకోవటంతో అక్రమార్కులకు వరంగా మారింది. దీన్ని అవకాశంగా తీసుకుని ట్రక్కు మట్టిని రూ.5 వేల నుంచి రూ.6 వేల వరకు విక్రయిస్తున్నారు. ప్రతిరోజూ సరాసరి 100 నుంచి 150 లారీల మట్టి తరలుతున్నట్లు ప్రజలు ఆరోపిస్తున్నారు. ఈ లెక్కన నెలలో రూ.2.5 నుంచి రూ.3 కోట్ల మేర కొల్లగొడుతున్నారు. తెదేపా ప్రభుత్వంలో అవసరమైన మట్టిని తరలింపునకు అద్దె లారీలు వినియోగించాలంటే భయపడే వ్యక్తులు..నేడు లారీ యజమానులుగా మారారు. ప్రధాన మాఫియా వ్యక్తులు పొక్లెయిన్లు, టిప్పర్లను సొంతంగా కొనుగోలు చేసేస్థితికి చేరారంటే దోపిడీ ఏ స్థాయిలో జరుగుతుందో అర్థం చేసుకోవచ్చని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొందరు నిల్వ చేయటం ద్వారా వ్యాపారం చేస్తున్నా అధికారులు ఏమీ చేయలేక చేతులెత్తేస్తున్నారు. సంబంధించిన అధికారులు జోక్యం చేసుకుని అడ్డుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

చిలకలేరును ఇష్టారాజ్యంగా తవ్వి

దర్శి నియోజకవర్గ పరిధిలో ముండ్లమూరు మండలం చిలకలేరును ఇసుక అక్రమార్కులు దోచుకున్నారు. చిలకలేరు పరిధిలోని పోలవరం, తమ్మలూరు, మల్కాపురం, కుంకుబాడు, మోదేపల్లి రీచ్‌ల నుంచి రోజుకు 20 నుంచి 60 టిప్పర్ల ఇసుకను అక్రమంగా తరలించి అధికార పార్టీ నాయకులు జేబులు నింపుకున్నారు. దర్శి, తాళ్లూరు మండలాల పరిధిలో విస్తరించిన దోర్నపు వాగు, ముసి వాగులో ఇసుక తవ్వకాలతో వాటి రూపురేఖలు మారిపోయాయి.

ప్రభుత్వ ధరకు రెండింతలు వసూలు చేస్తూ..

దర్శి మండలం పోతవరం సమీపంలో యంత్రాల సాయంతో  మట్టి తవ్వకం

రాత్రీ, పగలు తేడా లేకుండా తరలిస్తూ వచ్చిన ఆదాయాన్ని దర్శి, తాళ్లూరు, ముండ్లమూరు మండలాల నాయకులు పంపకాలు చేసుకుంటున్నారు. ఇసుక కావాలంటే వీరు అనుమతులు లేకుండా కొనలేని పరిస్థితి కల్పించారు. వారు చెప్పిన ధరకే కొనుగోలు చేయాలని బెదిరింపులకు దిగారు. దర్శి ప్రాంతంలో రూ.1,020 టన్ను ధర అని ప్రభుత్వ లెక్కలు చెపుతున్నా రెండింతలు మూడింతలు వసూలు చేస్తున్నారు. టన్ను ఇసుకను రూ.3,000 వరకు కొనుగోలు చేయవలసి వస్తోందని సమీప గ్రామాల ప్రజలు వాపోతున్నారు.  

పెద్దలకు నెలకు రూ. లక్ష కప్పం చెల్లిస్తూ..

కలనూతల-1 నిర్వాసితుల కాలనీకి సమీపంలో కొండ మట్టిని తవ్వుతున్న యంత్రాలు (పాత చిత్రం)

మార్కాపురంలో అధికార పార్టీకి చెందిన నేతలు అయిదేళ్లుగా ఈ దందాను అనుయాయులు, తమకు నమ్మకమైన గుత్తేదారులకు అప్పగించి వారి నుంచి నెలవారీ పర్సంటేజీలు దండుకుంటున్నారు. ఇలా ప్రతి ఒక గుత్తేదారు నెలకు రూ.లక్ష వరకు అధికార పార్టీ నేతలకు కప్పం చెల్లిస్తున్నారు. స్థానికులు పొరపాటున మట్టి, ఇసుకను తరలించుకుంటే అధికారులను ఇళ్లకు పంపి వారిపై జరిమానాలు విధించేలా చేస్తున్నారు.

అధికార పడగ నీడలో పశ్చిమం

రూపురేఖలు కోల్పోయిన వేములకోట చెరువు

మార్కాపురం: వైకాపా నేతల పడగ నీడలో పశ్చిమ ప్రకాశం విలవిల్లాడింది. మార్కాపురం, పెద్దారవీడు, తర్లుపాడు మండలాల్లో వారికి ఎదురు చెప్పే వారే లేకపోవడంతో దొరికిన మట్టిని దొరికినట్టే దోచుకున్నారు. తమ స్థిరాస్తి వెంచర్లకు తరలించుకున్నారు. ఇలా అయిదేళ్ల కాలంలో దాదాపు రూ.100 నుంచి రూ.150 కోట్ల మేర మట్టి మాఫియా దండుకుంది.

మార్కాపురం నడిబొడ్డున..

నామరూపాల్లేని మార్కాపురం చెరువు

మార్కాపురం పట్టణ నడిబొడ్డున ఉన్న పెద్దచెరువుతో పాటు మండలంలోని వేములకోట చెరువు, దరిమడుగు గ్రామ శివారులోని మాబుసాహెకుంట, కలనూతల నిర్వాసిత కేంద్రం వద్ద కొండను పిండిచేసి మట్టి, గ్రావెల్‌ను దోచుకున్నారు. రాయవరం చెరువు, కోలభీమునిపాడు గ్రామ సమీపంలోని ముద్దసానమ్మ గండి వద్ద ఉన్న కొండ, పెద్దారవీడు మండలంలోని దేవరాజుగట్టు ప్రాంతంలోని కొండ, పెద్దారవీడు చెరువు, తర్లుపాడు మండలాల్లో ఉన్న చెరువుల్లోని మట్టిని అధికార పార్టీ నేతలు అక్రమంగా తరలించుకుపోయారు. స్థానిక ఇటుకల వ్యాపారులకు విక్రయించి జేబులు నింపుకున్నారు.

నిశిరాత్రి వేళ..

పశ్చిమ ప్రాంతంలోని చెరువులు, కొండలను రాత్రివేళ కొల్లగొడుతున్నారు. ప్రతి రోజు రాత్రి 9 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం   6 గంటల వరకు టిప్పర్లు, ట్రాక్టర్ల ద్వారా ఆ మట్టిని తరలిస్తున్నారు. ఇలా నిత్యం 60 నుంచి 80 వరకు ట్రిప్పులు సరఫరా చేస్తున్నారు. ఇలా రోజూ రూ.2.50 లక్షల నుంచి  రూ.3 లక్షల వరకు జేబుల్లో వేసుకుంటున్నారు. చెరువు మట్టి టిప్పరుకు రూ.3 వేలు, కొండమట్టికి రూ.5వేలు వసూలు చేస్తున్నారు. అదే ట్రాక్టరు చెరువు మట్టి అయితే రూ.1500 వరకూ దండుకుంటున్నారు. ప్రభుత్వానికి పన్నులు, సీనరేజ్‌ రూపంలో ప్రతి నెల చెల్లించాల్సిన రూ.30 లక్షల ఆదాయాన్ని అక్రమార్కులే దిగమింగుతున్నారు.

గనుల అధికారులు మమ..

మార్కాపురం భూగర్భ గనుల శాఖ తూతూమంత్రంగా దాడులు జరిపించి మమ అన్పిస్తున్నారు. కార్యాలయ పరిధిలోని మార్కాపురం, యర్రగొండపాలెం, గిద్దలూరు, కనిగిరి నియోజకవర్గాల్లో గతేడాది ఏప్రిల్‌ నుంచి ఈ ఏడాది ఏప్రిల్‌ వరకు 240 కేసులు నమోదు చేసినట్లు భూగర్భగనుల శాఖ ఏడీ విష్ణువర్థనరావు తెలిపారు. రూ.88.82 లక్షల మేర అపరాధ రుసుం విధించినట్లు చెప్పారు. నిత్యం వందలాది వాహనాల్లో తరలిపోతుంటే ఏడాది మొత్తంలో కేవలం రెండొందలకు పైగా కేసులే నమోదు చేయడం వారి నిఘా లోపానికి అద్దం పడుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని