logo

గనులను దోచిన గజదొంగలు

కడుపు కొట్టడమే తప్ప.. కడుపు నింపడం తెలియని జగన్‌ మోహన్‌ రెడ్డి విధానాలతో జిల్లాలో లక్షల మందికి ఉపాధి చూపే గ్రానైట్‌ పరిశ్రమ కుదేలైంది.

Updated : 06 May 2024 05:25 IST

గ్రానైట్‌ క్వారీలు, యూనిట్లపై వికృత స్వారీ
పరిశ్రమపై జగన్‌ సర్కారు ముప్పేట దాడి
లక్షల మంది ఉపాధికి ఉరి

డుపు కొట్టడమే తప్ప.. కడుపు నింపడం తెలియని జగన్‌ మోహన్‌ రెడ్డి విధానాలతో జిల్లాలో లక్షల మందికి ఉపాధి చూపే గ్రానైట్‌ పరిశ్రమ కుదేలైంది. వికృత విధానాలతో ప్రపంచ కీర్తి గడించిన గెలాక్సీ గ్రానైట్‌ తన మెరుపులను పోగొట్టుకోవాల్సి వచ్చింది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తన ఊరడింపు మాటలతో అందరినీ నమ్మించారు. సీఎం కాగానే తనలోని పీడకుణ్ని నిద్రలేపారు. రాయితీలివ్వకపోగా విద్యుత్తు ఛార్జీలు అమాంతం పెంచేశారు. ఈ బాదుడును భరించలేక పోతున్నామని యజమానులు మొత్తుకునే దుస్థితి కల్పించారు. జిల్లాకు ఆదాయం, విదేశీ మారకద్రవ్యాన్ని తెచ్చి పెట్టడంతో పాటు లక్షల మందికి జీవనోపాధి కల్పించే యూనిట్లకు తాళాలు పడేలా చేశారు. తన అనుయాయకులను మాత్రమే ప్రోత్సహించి గనుల్లో గజదొంగల సామ్రాజ్యాన్ని సృష్టించుకున్నారు. జిల్లాను పారిశ్రామికంగా కోలుకోలేని దెబ్బతీశారు.

ఈనాడు, ఒంగోలు

వంచకుడు 1

జిల్లాలోని గ్రానైట్‌ క్వారీలు, పాలిషింగ్‌ యూనిట్లపై ఆధారపడి లక్షల మంది బతుకుతున్నారు. ఈ యూనిట్లను కాపాడుకుంటేనే మన పిల్లలకు ఉపాధి, ఉద్యోగాలు దొరుకుతాయి. వలసలు ఆగుతాయి..’ 

గత ఎన్నికల సందర్భంగా జగన్‌ మోహన్‌ రెడ్డి ఓట్ల కోసం దంచిన ఉపన్యాసాలివి

పీడకుడు 2

ఇబ్బందుల్లో ఉన్న గ్రానైట్‌ పరిశ్రమలకు తోడ్పాటు అందజేసేలా యూనిట్‌కు రూ.2 విద్యుత్తు రాయితీ ఇస్తామని 2022లో చీమకుర్తికి వచ్చినప్పుడు సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి హామీ ఇచ్చారు. రాయితీ మాట అటుంచి వివిధ రకాల సర్‌ఛార్జీల రూపంలో బిల్లులను మోతెక్కిస్తున్నారు. విద్యుత్తు బిల్లు రూ.95 వేలు వస్తే సర్‌ఛార్జీలు వివిధ రూపాల్లో మరో రూ.37 వేల వరకు ఉంటున్నాయని పరిశ్రమల యజమానులు ఆవేదన చెందుతున్నారు. ‌్ర పరిశ్రమలకు రావాల్సిన రాయితీల సంగతి సరేసరి. ఇదిగో అదిగో అంటూ గత మూడేళ్లుగా చెబుతున్న ప్రభుత్వం.. ఇంతవరకు జమ చేయలేదు.

గ్రహణం పట్టించిందిలా...

చీమకుర్తి ప్రాంతంలో మొత్తం 45 క్వారీలున్నాయి. వీటికి సంబంధించి మొత్తం 160 వరకు లీజులున్నాయి. వైకాపా ప్రభుత్వంలో లీజుల పునరుద్ధరణ సక్రమంగా చేపట్టలేదు. 2020లో క్వారీలకు పెద్ద మొత్తంలో జరిమానాలు విధించారు. ఆ మొత్తం చెల్లిస్తేనే లీజు పునరుద్ధరణంటూ మెలిక పెట్టారు. హెక్టార్‌కు చెల్లించాల్సింది రూ.1.30 లక్షలైతే.. ఆ మొత్తాన్ని రూ.12 లక్షల వరకు పెంచారు. ఇక్కడే వైకాపా నాయకులు రంగంలోకి దిగారు. గిట్టని వారికి లీజులు పునరుద్ధరించకుండా మోకాలడ్డారు. చేసేదేమీ లేక పలువురు క్వారీల్లో కార్యకలాపాలు ఆపేశారు.

  • ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మొత్తం పాలిషింగ్‌ యూనిట్లు 2,000కి పైగా ఉన్నాయి.
  • చీమకుర్తి మండలంలోని ఆర్‌ఎల్‌పురం, బూదవాడ, మర్రిచెట్లపాలెం, పొదిలి మండలం ఏలూరు రోడ్డు, గెలాక్సీపురి శివారు ప్రాంతాల్లోనే 800కి పైగా పరిశ్రమలున్నాయి. సంతనూతలపాడు మండల పరిధిలో, కనిగిరి ప్రాంతం, మద్దిపాడు మండలం గుళ్లాపల్లి పారిశ్రామికవాడలోనూ వందల సంఖ్యలో ఔత్సాహికులు గతంలో నెలకొల్పారు.
  • చీమకుర్తి ప్రాంతంలోని గెలాక్సీ గ్రానైట్‌, బల్లికురవ, గురిజేపల్లి ప్రాంతాల్లోని స్టీల్‌గ్రే, బ్లాక్‌పెరల్‌ గ్రానైట్‌ క్వారీల నుంచి ముడిరాళ్లను తెచ్చి ఈ పరిశ్రమల్లో కోసి పాలిష్‌ చేసి విక్రయాలు సాగిస్తుంటారు.
  • వియత్నాం, ఇటలీ, మధ్యప్రాచ్య దేశాలతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాలకు ఈ స్లాబులు  ఎగుమతి అవుతుంటాయి.
  • చీమకుర్తి ప్రాంతంలో ఉన్న పరిశ్రమల్లోనే ప్రత్యక్షంగా సుమారు 20 వేల మంది కార్మికులు ఉపాధి పొందుతుంటారు. పరోక్షంగా మరో పదివేల మందికి ఉపాధి లభిస్తోంది. ‌్ర  గతంలో చీమకుర్తి ప్రాంతం నుంచి నెలకు సుమారు 3 వేల కంటెయినర్ల వరకు ఎగుమతులుండేవి. ప్రస్తుతం ఆ సంఖ్య వెయ్యికి మించడం లేదు.
  • గ్రానైట్‌ క్వారీల్లో విజిలెన్స్‌, గనుల శాఖ ఆధ్వర్యంలో విస్తృతంగా తనిఖీలు చేయించారు. దాదాపు నెల రోజులపాటు సాగిన ఈ సోదాలతో యజమానులను బెంబేలెత్తించారు.
  • అవకతవకలంటూ 108 మంది లీజుదారులకు రూ.2,500 కోట్ల మేర జరిమానాలు విధిస్తూ షోకాజ్‌ నోటీసులు జారీ చేయించారు. అదే సమయంలో అధికార పార్టీకి చెందిన క్వారీ నిర్వాహకులను మాత్రం జరిమానాల నుంచి మినహాయించారు.
  • గ్రానైట్‌ రాళ్ల తరలింపునకు బిల్లులు, అనుమతులు సరిచూసుకుని అధికారులు కొన్ని సంఖ్యలు కేటాయించాల్సి ఉంటుంది. వైకాపా నేతలు ఇందులోనూ తమ కళను ప్రదర్శించారు. ఇష్టారీతిన నంబర్లు వేసి రాళ్లను తరలించి అమ్మేసుకున్నారు. ఇలా రోజుకు 200 వరకు తరలించి నెలకు దాదాపు రూ.1.20 కోట్ల వరకు స్వాహా చేశారు.
  • క్వారీల్లో ఉత్పత్తి చేసిన రాయిలో యజమానులు నాణ్యమైన రాయి ఎగుమతులు చేసుకుంటారు. నాణ్యత తక్కువ, చిన్నవి 20 శాతం వరకు మిగులుతాయి. వీటిపై అధికర పార్టీ నాయకులు కన్నేశారు. రాజకీయ పలుకుబడితో అనుమతికి మించి తరలించి జేబులు నింపుకొన్నారు. ఏపీఎండీసీ పరిధిలోని రెండు క్వారీల నుంచి కూడా ఇలాగే తరలించారు. అయినా అధికారులు పట్టించుకున్న పాపాన పోలేదు.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని