logo

బాపు అడుగు..ఉద్యమానికి వెలుగు

అహింసే ఆయన మార్గం...అలుపెరుగని పోరాటం...తెల్లోళ్లను తరిమి కొట్టాలన్నదే ఏకైక లక్ష్యం..ఉద్యమాలకు ఊపిరిలూదేందుకు విశ్రాంతి లేని పయనం..అంతటా ప్రజల నుంచి నీరాజనం..ఉద్యమ కెరటాలు ఎగసిపడుతున్న వేళ.. ఆ గాంధీ మహాత్ముడి అడుగులు సిక్కోలు నేలపైనా పడ్డాయి.

Published : 12 Aug 2022 05:04 IST

ఈనాడు డిజిటల్‌, శ్రీకాకుళం, న్యూస్‌టుడే, ఆమదాలవలస గ్రామీణం, ఇచ్ఛాపురం


దాసన్నపేటలో బాపూ ప్రసంగించిన ప్రాంతం ఇదే..

అహింసే ఆయన మార్గం...అలుపెరుగని పోరాటం...తెల్లోళ్లను తరిమి కొట్టాలన్నదే ఏకైక లక్ష్యం..ఉద్యమాలకు ఊపిరిలూదేందుకు విశ్రాంతి లేని పయనం..అంతటా ప్రజల నుంచి నీరాజనం..ఉద్యమ కెరటాలు ఎగసిపడుతున్న వేళ.. ఆ గాంధీ మహాత్ముడి అడుగులు సిక్కోలు నేలపైనా పడ్డాయి..స్వాతంత్య్ర స్ఫూర్తిని ఈ గడ్డపైనా రగిలించారు..ఊరూవాడా ఉద్యమం వైపు కదిలేలా చేశారు..ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా సిక్కోలుతో గాంధీకి ఉన్న అనుబంధాన్ని స్మరించుకుందాం..పోరాట స్ఫూర్తిని అందిపుచ్చుకుందాం..  

స్వాతంత్య్ర ఉద్యమంలో భాగంగా మహాత్మాగాంధీ మూడుసార్లు జిల్లాలో పర్యటించారు. తన పాదస్పర్శతో సిక్కోలు  ప్రజల్లో ఉద్యమస్ఫూర్తిని రగిలించారు. నాయకుల్లో ఉత్తేజం నింపారు. ఉప్పు సత్యాగ్రహం, సహాయ నిరాకరణోద్యమం, విదేశీ వస్త్ర బహిష్కరణ, శాసనోల్లంఘన, క్విట్‌ ఇండియా ఉద్యమ ఘట్టాల్లో జిల్లా ప్రజలను భాగస్వాములను చేసి  సముచిత స్థానం కల్పించారు.
గాంధీజీ తొలిసారి 1927 డిసెంబరు 2న జిల్లాలో అడుగు పెట్టారు. 2, 3వ తేదీల్లో జిల్లాలో పర్యటించారు. అప్పటికే జిల్లాలో కాంగ్రెస్‌ నాయకత్వంలో బలమైన ఉద్యమమే సాగుతోంది. మందస, బొబ్బిలి, పర్లాఖెముండి జమీందారీ ఉద్యమం కూడా బలపడింది. సరిగ్గా అదే సమయంలో గాంధీజీ శ్రీకాకుళం, సారవకోట, నౌపడ, మెళియాపుట్టి, ఇచ్ఛాపురం ప్రాంతాల్లో పర్యటించారు. జాతి సంపదను బ్రిటీష్‌ వాళ్లు దోచుకుపోతున్న వైనాన్ని ప్రజలకు తెలియజేస్తూ ప్రజల్లో ఉద్యమ స్ఫూర్తి నింపుతూ ముందుకు కదిలారు.

* 1927లో శ్రీకాకుళం మున్సిపల్‌ స్కూల్‌ మైదానంలో ప్రజలనుద్దేశించి గాంధీ ప్రసంగించారు. ఆ సమయంలోనే శ్రీకాకుళం మున్సిపల్‌ కౌన్సిల్‌ ఆయన్ను సత్కరించి సన్మానపత్రం అందించింది. ఆ పత్ర సారాంశాన్ని ఓ శిలాఫలకంగా తీర్చిదిద్ది దాన్ని అప్పటి మున్సిపల్‌ భవనంలో ఏర్పాటు చేశారు. భవనం తొలగింపులో భాగంగా అది కనుమరుగైంది.

* 1930లో నౌపడా ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొనేందుకు వచ్చిన గాంధీ ఇచ్ఛాపురంలోనూ పర్యటించారు. కొన్ని గంటలు అక్కడే గడిపారు. స్థానిక నేత పుల్లెల శ్యామసుందరరావు పటిమను గుర్తించి దాసన్నపేటలో ఉద్యమకారులు, ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు.
* 1942 స్వాతంత్య్ర ఉద్యమంలో చివరిదిగా చెప్పుకొనే క్విట్ ఇండియా ఉద్యమం ఊపందుకుంటున్న రోజులవి. దేశ పర్యటనలో భాగంగా మూడు భోగీలున్న రైలులో ప్రయాణం చేస్తూ దూసి రైల్వేస్టేషన్‌లో ఆగారు. ఆయన అక్కడికొస్తున్నారని తెలుసుకుని జిల్లాలోని వివిధ గ్రామాల నుంచి పెద్దఎత్తున ఉద్యమకారులు వెళ్లారు. స్టేషన్‌ ఆవరణలోనే గాంధీ ప్రసంగించారు. అనంతరం తెల్లదొరలు వస్తున్నారని తెలుసుకున్న ఉద్యమకారులు సమీపంలో ఉన్న రేకుల షెడ్‌లో లాంతర్లతో సమావేశాన్ని చేపట్టారు. గాంధీ అక్కడే ప్రసంగించారు.
* దూసి రైల్వేస్టేషన్‌కు వచ్చినప్పుడు అక్కడ ఎలాంటి మొక్కలు లేవు. దీంతో ఉద్యమకారులు ఓ మర్రి మొక్కను తెచ్చి గాంధీకి ఇవ్వడంతో దాన్ని అక్కడే ప్లాట్‌ఫాంకి సమీపంలో నాటారు. ఇప్పుడది మహావృక్షంగా మారింది. అప్పట్లో రైలెక్కేందుకు వచ్చేవారికి నీడ లేకపోవడంతో ఈ చెట్టుకిందే అంతా ఆశ్రయం పొందేవారని స్థానికులు చెబుతున్నారు.

* 1927 డిసెంబరు 3న మెళియాపుట్టి గ్రామాన్ని గాంధీజీ సందర్శించారు. పర్లాఖెముండి నుంచి మెళియాపుట్టి చేరుకున్నారు. దుక్క రాజన్నరెడ్డి, సోదరుడు సూర్యనారాయణ రెడ్డి, అంకణాల లక్ష్మీనారాయణ, లుకలాపు లక్ష్మణదాసు రాట్నంతో నూలు వడుకుతూ స్వాగతం పలికారు. ఓ మర్రిచెట్టు కింద కూర్చుని ప్రజలనుద్దేశించి గాంధీ ప్రసంగించారు.   మహాత్ముడికి తమవంతు సాయంగా  గ్రామస్థులంతా తలోకొంత వేసుకుని రూ.వెయ్యి వరకూ విరాళంగా ఇచ్చారు. నాటి మర్రిచెట్టు కూలి ఆ ప్రదేశంలో ఇప్పుడు ఆలయం ఉంది.

* ఉప్పుపై తెల్లోళ్లు పన్ను విధింపును వ్యతిరేకిస్తూ 1930లో ఉప్పు సత్యాగ్రహానికి గాంధీ పిలుపునిచ్చారు. ఆ సమయంలో దేశవ్యాప్తంగా ఉప్పు పండించే ప్రాంతాల్లో పర్యటనలు చేస్తున్న గాంధీజీ పూండి రైల్వేస్టేషన్‌లో రైలు దిగి వరదావారి బంగ్లాలో బసచేశారు. ఆ సమయంలోనే ఉప్పు రైతులు, ఉద్యమకారులతో సమావేశాలు నిర్వహించారు. నౌపడాలో ఉప్పు సత్యాగ్రహం విజయవంతమైంది. ఇక్కడి నాయకులు భారీగా ఉప్పు పండించి, వాటిని వేలం వేసేవారు. అలా వచ్చిన డబ్బుతో ఉద్యమాలను ముందుకు తీసుకెళ్లేవారు.
* జిల్లా పర్యటనలో భాగంగా సారవకోట వచ్చిన గాంధీజీ ఓ బంగ్లాలో బస చేశారు. ఆ ప్రదేశాన్ని తర్వాత గాంధీ స్మారకంగా తీర్చిదిద్దాలని పాలకులు, అధికారులు భావించారు. రూ.2 లక్షలతో స్మారక భవనం నిర్మించి దాన్ని గ్రంథాలయానికి అప్పగించారు. 1991 జనవరి 1న దీన్ని ప్రారంభించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని