logo

భాజపాకే ఎచ్చెర్ల

ఎచ్చెర్ల నియోజకవర్గానికి తెదేపా-జనసేన-భాజపా కూటమి తరఫున అభ్యర్థిని ఖరారు చేయడంతో రాజకీయంగా నెలకొన్న ఉత్కంఠకు తెర పడింది.

Published : 28 Mar 2024 05:41 IST

కూటమి అభ్యర్థిగా ఈశ్వరరావు

ఈనాడు డిజిటల్‌ శ్రీకాకుళం, న్యూస్‌టుడే రణస్థలం: ఎచ్చెర్ల నియోజకవర్గానికి తెదేపా-జనసేన-భాజపా కూటమి తరఫున అభ్యర్థిని ఖరారు చేయడంతో రాజకీయంగా నెలకొన్న ఉత్కంఠకు తెర పడింది. భాజపా తరఫున నడుకుదిటి ఈశ్వరరావు పోటీ చేస్తారని బుధవారం ఆ పార్టీ అధిష్ఠానం ప్రకటన విడుదల చేసింది. ఎచ్చెర్ల నుంచి తెదేపా నుంచి కిమిడి కళావెంకటరావు, కలిశెట్టి అప్పలనాయుడు టికెట్లు ఆశించగా వారికి దక్కలేదు. ఈ నేపథ్యంలో వారి అనుచరులు కొంత నిరాశకు గురయ్యారు. ఇదిలా ఉండగా జిల్లాలో ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి తెదేపా, వైకాపా అభ్యర్థులను ఖరారు చేయడంతో ప్రచార పర్వం ఊపందుకోనుంది.

అభ్యర్థి: నడుకుదిటి ఈశ్వరరావు
వయసు: 53
విద్యార్హత: పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌
భార్య: రజని
సంతానం: ఇద్దరు కుమారులు  

రాజకీయ నేపథ్యం: ఈశ్వరరావు 2009 నుంచి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. 2013లో ఆయన తల్లి మహాలక్ష్మి బంటుపల్లి సర్పంచిగా ఎన్నికయ్యారు. అనేక అభివృద్ధి పనులతో ప్రజలకు చేరువయ్యారు. 2014లో తెదేపాలో చేరి సాధారణ ఎన్నికల్లో ఆ పార్టీ గెలుపునకు దోహదపడ్డారు. రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ డైరెక్టర్‌గా పని చేశారు. 2019లో సాధారణ ఎన్నికల అనంతరం భాజపాలో చేరారు. పార్టీ విధానాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లారనే గుర్తింపు రావడంతో అధిష్ఠానం ఎచ్చెర్ల శాసనసభ నియోజకవర్గానికి కన్వీనర్‌గా, విజయనగరం పార్లమెంట్‌ నియోజకవర్గానికి అధ్యక్షుడిగా నియమించింది. ప్రస్తుతం ఆయన భార్య రజని బంటుపల్లి సర్పంచిగా ఉన్నారు.


పేదల సమస్యల పరిష్కారానికి కృషి

అభివృద్ధికి వనరులున్న ఎచ్చెర్ల నియోజకవర్గం వైకాపా పాలనలో వెనుకబడింది. పారిశ్రామికవాడలో స్థానికులకు ఉపాధి అవకాశాలు లభించేలా దోహదపడతా. తోటపల్లి ప్రాజెక్టు పూర్తి చేసి రైతులకు సాగునీరందేలా కృషి చేస్తా. పేదలకు అండగా నిలుస్తా.

ఎన్‌.ఈశ్వరరావు (ఎన్‌ఈఆర్‌), భాజపా ఎచ్చెర్ల నియోజకవర్గ అభ్యర్థి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని