Miss Universe: అందాల పోటీల్లో తొలిసారి.. 60 ఏళ్ల ‘భామ’కు కిరీటం

Miss Universe Buenos Aires: 60 ఏళ్ల వయసులో అందాల తారగా కిరీటం దక్కించుకుందో మహిళ. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ ఏడాది మిస్‌ యూనివర్స్‌ పోటీల్లోనూ పాల్గొననుంది.

Updated : 27 Apr 2024 11:27 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: అందాల పోటీ అంటే మనకు టీనేజ్ అమ్మాయిలే గుర్తొస్తారు. ఆ ఆలోచనలను పటాపంచలు చేస్తూ అర్జెంటీనా (Argentina)కు చెందిన అలెజాండ్రా మరీసా రొడ్రిగోజ్‌ (Alejandra Marisa Rodriguez) సరికొత్త చరిత్ర సృష్టించారు. ఆరు పదుల వయసులో అందంతో కుర్రకారు మతిపోగొడుతోన్న ఈ ‘భామ’.. తాజాగా మిస్‌ యూనివర్స్‌ ప్రాతినిధ్యం కోసం జరుగుతున్న పోటీల్లో కిరీటం దక్కించుకున్నారు.

అర్జెంటీనాలోని బ్యూనస్‌ ఎయిర్స్‌లో ఇటీవల అందాల పోటీలు జరిగాయి. ఇందులో లా ప్లాటా నగరానికి చెందిన 60 ఏళ్ల అలెజాండ్రా ‘మిస్‌ యూనివర్స్‌ బ్యూనస్‌ ఎయిర్స్‌ (Miss Universe Buenos Aires)’ టైటిల్‌ గెలుచుకున్నారు. అందాల పోటీల్లో ఈ వయసులో కిరీటం పొందిన తొలి మహిళగా రికార్డు సృష్టించారు. వృత్తిరీత్యా న్యాయవాది, జర్నలిస్టు అయిన అలెజాండ్రా.. సంకల్పానికి వయసు అడ్డు కాదని నిరూపించారు. అందానికి సరికొత్త నిర్వచనమిచ్చారు.

ఈ ఏడాది మే నెలలో జరగబోయే ‘మిస్‌ యూనివర్స్‌ అర్జెంటీనా’ పోటీల్లో ఈమె బ్యూనస్‌ ఎయిర్స్‌ తరఫున ప్రాతినిధ్యం వహించనున్నారు. అక్కడ గెలిస్తే సెప్టెంబరులో మెక్సికో వేదికగా జరిగే ‘విశ్వసుందరి 2024’ పోటీల్లో తన దేశం తరఫున పాల్గొంటారు. ఈ అందాల రాణి ఫొటోలు, వీడియోలు ఇప్పుడు నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి.

అభ్యర్థులకు వయోపరిమితిని తొలగిస్తూ ‘మిస్‌ యూనివర్స్‌’ ఆర్గనైజేషన్‌ గతేడాది నిర్ణయం తీసుకుంది. గతంలో ఈ అందాల పోటీలో 18-28 ఏళ్ల వయసున్న మహిళలే పాల్గొనే వీలుండేది. ఈ ఏడాది నుంచి 18 ఏళ్లు పైబడిన యువతులందరికీ అవకాశం కల్పిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల డొమినికన్‌ రిపబ్లికన్‌కు చెందిన 47 ఏళ్ల హైదీ క్రూజ్‌ ఆ దేశ అందాల కిరీటం గెల్చుకున్నారు. ఈ ఏడాది విశ్వసుందరి పోటీల్లో ఆమె తన దేశం తరఫున ప్రాతినిధ్యం వహించనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు