Kolkata Vs Punjab: క్రికెట్‌.. బేస్‌బాల్‌ గేమ్‌లా మారిపోతోంది: పంజాబ్ కెప్టెన్

ఐపీఎల్ 17వ సీజన్‌లో భారీ స్కోర్లు నమోదు కావడం సర్వసాధారణమైంది. 200+ కాకుండా.. 250+ స్కోరుకూడా దాటిపోవడం గమనార్హం.

Published : 27 Apr 2024 11:27 IST

ఇంటర్నెట్ డెస్క్: కోల్‌కతా - పంజాబ్‌ (Kolkata Vs Punjab) జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో 523 పరుగులు నమోదయ్యాయి. తొలుత కోల్‌కతా 261 పరుగులు చేయగా.. పంజాబ్‌ 262 పరుగులు సాధించింది. ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు నమోదైన మూడో మ్యాచ్‌గా నిలిచింది. ఇదే సీజన్‌లో బెంగళూరు-హైదరాబాద్‌ మధ్య జరిగిన పోరులో ఏకంగా 549 రన్స్‌ నమోదైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తమ జట్టు విజయం సాధించడంపై పంజాబ్‌ కెప్టెన్ ఆనందం వ్యక్తం చేస్తూనే కీలక వ్యాఖ్యలు చేశాడు. 

‘‘ఈ విజయం మాకు చాలా కీలకం. ప్లేఆఫ్స్ రేసులో నిలవాలంటే ప్రతి మ్యాచ్‌లోనూ గెలవాలి. ఇప్పుడు భారీ టార్గెట్‌ను ఛేదించడం ఆనందంగా ఉంది. ఇటీవల బ్యాటర్ల దూకుడు ఎక్కువైంది. దీంతో క్రికెట్‌ బేస్‌బాల్ గేమ్‌లా మారిపోతోంది. మాకు రాబోయే మ్యాచ్‌లు అత్యంత కీలకం. కఠిన సవాల్ తప్పదు. వాటిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం. మా కుర్రాళ్లు కూడా అదే విధంగా సన్నద్ధమవుతున్నారు. ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసం నింపేందుకు కోచ్‌లు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. జానీ బెయిర్‌స్టో, శశాంక్‌ ఇన్నింగ్స్‌ హైలైట్. మరీ ముఖ్యంగా ఈ టోర్నీ ద్వారా శశాంక్‌ వంటి అద్భుతమైన క్రికెటర్‌ మాకు లభించాడు. అశుతోష్‌ కూడా కీలక ఇన్నింగ్స్‌లతో మెప్పించాడు. జట్టులోని ప్రతి ఒక్కరి ఆటపై గర్వంగా ఉంది’’ అని సామ్ కరన్ వ్యాఖ్యానించాడు.

పొరపాటు ఎక్కడో అన్వేషించాలి: శ్రేయస్

‘‘భారీ లక్ష్యం నిర్దేశించినా మాకు ఓటమి ఎదురు కావడం బాధగా ఉంది. ఇరు జట్ల బ్యాటర్లు అద్భుతంగా ఆడారు. సునీల్ నరైన్‌, ఫిలిప్ సాల్ట్ అదరగొట్టారు. ఈడెన్ గార్డెన్స్‌లోని ప్రేక్షకులతోపాటు మ్యాచ్‌ చూసినవారందరికీ కనులపండుగే. 260+ టార్గెట్‌ను కాపాడుకోలేకపోవడానికి గల కారణాలను విశ్లేషించుకుంటాం. ఎక్కడ పొరపాటు జరిగిందో తెలుసుకుని సరి చేసుకుంటాం’’ అని కోల్‌కతా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తెలిపాడు.

మరికొన్ని విశేషాలు.. 

  • ఐపీఎల్‌లో ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్స్‌లు నమోదైన మ్యాచ్‌ ఇదే. పంజాబ్ బ్యాటర్లు 24 సిక్స్‌లు బాదారు. టీ20 చరిత్రలో పంజాబ్‌ కంటే నేపాల్ మాత్రమే (26 సిక్స్‌లు) ముందుంది.
  • ఓవరాల్‌గా టీ20 మ్యాచ్‌లో అత్యధిక సిక్స్‌లు నమోదైన మ్యాచ్‌గా రికార్డు సృష్టించింది. పంజాబ్ 24 బాదగా.. కోల్‌కతా 18 సిక్స్‌లను కొట్టింది. మొత్తం 42 సిక్స్‌లతో టాప్‌లో నిలిచింది.
  • ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు నమోదైన మ్యాచ్‌ లిస్ట్‌లో ఇది మూడో మ్యాచ్‌. ఇదే సీజన్‌లో బెంగళూరు-హైదరాబాద్ (549), హైదరాబాద్ - ముంబయి (523), కోల్‌కతా - పంజాబ్ (523) పరుగుల వర్షం కురిసింది.
  • ఐపీఎల్‌లోనే కాదు మొత్తంగా టీ20 క్రికెట్లో ఇదే అత్యధిక లక్ష్య ఛేదన. గత ఏడాది వెస్టిండీస్‌పై 259 పరుగుల ఛేదనతో దక్షిణాఫ్రికా రికార్డును పంజాబ్‌ బద్దలు కొట్టింది. ఐపీఎల్‌లో 2020లో పంజాబ్‌పై రాజస్థాన్‌ (224) విజయం సాధించింది.
  • టీ20 క్రికెట్‌లో 250+ స్కోర్లను చేసిన కోల్‌కతా ఏడో జట్టుగా నిలిచింది. ఈ జట్టు ఇది రెండోసారి నమోదు చేసింది. సర్రే (3), హైదరాబాద్‌ (3), చెక్ రిపబ్లిక్ (2), సోమర్‌సెట్ (2), యార్క్‌షైర్‌ (2), బెంగళూరు (2) ముందున్నాయి.
  • ప్రస్తుత సీజన్‌లో 250+ స్కోర్లు నమోదు కావడం ఆరోసారి. మొత్తంగా ఐపీఎల్ చరిత్రలో 8 సార్లు భారీ స్కోర్లను జట్లు సాధించాయి.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని