logo

అయిదేళ్లుగా ఆధునికీకరణను అటకెక్కించారు..!

‘వైకాపా అధికారంలోకి రాగానే నారాయణపురం ఆనకట్టను ఆధునికీకరించి రైతులకు సాగునీటి ఇబ్బందులు లేకుండా చేస్తాం.’ అంటూ గత ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి జగన్‌ గొప్పలకు పోయారు.

Updated : 06 May 2024 05:43 IST

నారాయణపురం ఆనకట్ట పనులను పట్టించుకోని వైకాపా సర్కారు
బిల్లుల జాప్యంతో ముందుకు రాని గుత్తేదారులు
న్యూస్‌టుడే, బూర్జ, ఆమదాలవలస గ్రామీణం

నారాయణపురం ఆనకట్టపై షట్టర్ల దుస్థితి

‘వైకాపా అధికారంలోకి రాగానే నారాయణపురం ఆనకట్టను ఆధునికీకరించి రైతులకు సాగునీటి ఇబ్బందులు లేకుండా చేస్తాం.’ అంటూ గత ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి జగన్‌ గొప్పలకు పోయారు. అధికారంలోకి వచ్చాక పనులకు నిధులు మంజూరు చేయకుండా మొండిచేయి చూపారు. వైకాపా ప్రభుత్వం, జలవనరుల శాఖ అధికారులు ఈ ప్రాజెక్టు అభివృద్ధిపై దృష్టి సారించి ఉంటే ఏడాదికి రెండు పంటలకు సాగునీరు అందేది. అన్నదాత కష్టం పట్టని పాలకుల నిర్లక్ష్య ధోరణితో షట్టర్లు, రెగ్యులేటర్లు పాడయ్యాయి. దీంతో నాగావళి ఆనకట్ట నుంచి వచ్చిన జలాలు వృథాగా దిగువకు పోతున్నాయి.

ఇదీ పరిస్థితి..

బూర్జ మండలం లాభాం పంచాయతీ నారాయణపురం, విజయనగరం జిల్లా సంతకవిటి మండలం రంగారాయపురాల మధ్య నాగావళి నదిపై 1959-63 మధ్య నారాయణపురం ఆనకట్ట నిర్మించారు. ఎడమ ప్రధాన కాలువ బూర్జ, ఆమదాలవలస, శ్రీకాకుళం, గార మండలాలకు 39 కి.మీ. పరిధిలో 469 క్యూసెక్కుల నీటిని 7,464 హెక్టార్ల విస్తీర్ణానికి, కుడి ప్రధాన కాలువ ద్వారా సంతకవిటి (విజయనగరం జిల్లా), పొందూరు, ఎచ్చెర్ల మండలాల్లో 50 కి.మీ. పరిధిలో 469 క్యూసెక్కుల నీటిని 7,431 హెక్టార్లకు అందించేలా రూపొందించారు.

ఎడమ ప్రధాన కాలువలో బీటలు వారిన గోడలు

తెదేపా హయాంలో జైకా నిధుల మంజూరు

నారాయణపురం ఆనకట్ట పనులకు తెదేపా ప్రభుత్వం జపాన్‌ ఇంటర్నేషనల్‌ కోఆపరేటివ్‌ ఏజెన్సీ (జైకా) నుంచి రూ.112.10 కోట్లు మంజూరయ్యేలా కృషి చేసింది. 2019 ఫిబ్రవరిలో తమ్మినేని పాపారావు నారాయణపురం ఆనకట్ట ప్రాజెక్టు పేరిట విప్‌ హోదాలో కూన రవికుమార్‌ పనులకు శంకుస్థాపన చేశారు. వైకాపా అధికారంలోకి వచ్చిన అనంతరం ముగ్గురు సభ్యులతో కూడిన జైకా బృందం 2019 మేలో ఆనకట్ట పరిసరాల్లో పర్యటించింది. జలవనరుల శాఖ అధికారుల నుంచి నివేదికను తీసుకెళ్లింది. అదే ఏడాది జూన్‌లో ఆనకట్ట ఎడమ ప్రధాన కాలువ ప్రారంభంలో పనులు చేపట్టారు.

రూ.30 కోట్లకు పైగా బకాయిలు

ఎడమ ప్రధాన కాలువకు సంబంధించి రూ.62.46 కోట్లతో 16 కి.మీ. మేర లైనింగ్‌, 34 కి.మీ. పొడవునా కాలువ అభివృద్ధి, శిథిలమైన వంతెనల స్థానంలో కొత్త నిర్మాణాలు చేపట్టి శివారు ఆయకట్టుకు సాగునీరు అందించేలా పనులు చేపట్టాలి. ప్యాకేజీ ‘బి’కి సంబంధించి రూ.49.64 కోట్లతో కుడి ప్రధాన కాలువ అభివృద్ధి పనులు చేపట్టారు. ఆరేళ్లలో 35 శాతం పూర్తికాగా రూ.30 కోట్లకు పైగా బకాయిలు ఉండటంతో మిగిలిన పనులకు గుత్తేదారులు ముందుకు రావడం లేదు. ఆనకట్టపై 118 షట్టర్లు ఉంటే అందులో తుప్పు పట్టినవే అధికం. కొన్ని నీటి ప్రవాహంలో కొట్టుకుపోయాయి. కొత్తవి గుత్తేదారులు తయారు చేయించి లాభాం వద్ద వదిలేశారు. నిధులు అందకపోవడంతో వాటిని అమర్చలేదు.

ఆవిరైన ఆశలు

జైకా నిధులతో ఆనకట్ట పరిధిలో ఆధునికీకరణ పనులు సాగుతాయని సంబరపడ్డాం. వైకాపా అధికారం చేపట్టి ఐదేళ్లయినా అభివృద్ధి దిశగా అడుగులు వేయలేదు. కాలువలో నిర్మాణ వ్యర్థాలు, పనికి రాని మొక్కలు, మట్టి దిబ్బలు, గడ్డి దర్శనమిస్తున్నాయి.

పప్పల కృష్ణారావు, సర్పంచి, లాభాం


రైతులకు ఇబ్బందులు

సమయానికి సాగునీరు అందక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నారుమడులు, వెదలకు నీరందక ఆయిల్‌ ఇంజిన్ల ద్వారా నీటిని తోడుకునే పరిస్థితి ఏటా తలెత్తుతోంది. అధిక వర్షాల సమయంలో, పెద్దఎత్తున వరద వచ్చి చేతికి అందివచ్చిన పంటలు ముంపునకు గురవుతున్నాయి. ఏటా రైతులకు నష్టం తప్పడం లేదు.

గురుగుబిల్లి అప్పలనాయుడు, లాభాం


కానరాని మరమ్మతులు

పాత షట్టర్లను అమర్చడంతో వరద నీటి ఉద్ధృతికి నదిలో కొట్టుకుపోతున్నాయి. కొత్త వాటిని నిర్లక్ష్యంగా వదిలేశారు. అవి తుప్పు పట్టి పాడవుతున్నాయి. మరమ్మతులకు చర్యలు తీసుకోకపోవడం దారుణం.

బి.శంకర్‌, సేపేనపేట

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని