logo

ఉద్దానం ఊపిరి తీసేశారు..!

‘అన్న చెప్పారంటే చేస్తారంతే’.. ఇది వైకాపా శ్రేణులు తరచూ చెప్పే మాట. జగన్‌ ఆదుకుంటారేమోనని ఐదేళ్లు ఎదురుచూసినా కొబ్బరి రైతులకు మాత్రం ఎలాంటి ఫలితం లేకపోయింది. దిగుబడులు నామమాత్రంగా రావడం.. పరిశ్రమ, పరిశోధన కేంద్రం ఏర్పాటుకు చర్యలు తీసుకోలేదు.

Published : 06 May 2024 03:02 IST

కొబ్బరి రైతును పట్టించుకోని ప్రభుత్వం
సాగును ప్రోత్సహిస్తామని చెప్పి జగన్‌ మొండిచేయి

కంచిలి మండలం కత్తివరం వద్ద ఎండుముఖం పట్టిన  కొబ్బరి తోట

  • కవిటి మండలం జల్లుపుట్టుగ గ్రామానికి చెందిన  రైతు పండి దేవేంద్ర ఉమ్మడి కుటుంబానికి 70 ఎకరాల్లో కొబ్బరి తోటలు ఉన్నాయి. తిత్లీ తుపానుకు ముందు రెండు నెలలకు 35 వేలకు పైగా, మూడేళ్ల కిందట వరకు 15 వేల వరకు కాయలు దిగుబడి వచ్చేవి. చీడపీడల వల్ల ప్రస్తుతం నాలుగు వేలు కూడా రావడం లేదు. నష్టాలబాట పడుతున్నా ప్రభుత్వం నుంచి  ఎలాంటి సాయం లేదు.  
  • కంచిలికి చెందిన కొబ్బరి వ్యాపారి ఉత్తరాది రాష్ట్రాలకు నిత్యం 15 వేలకు పైగా కాయలు ఎగుమతి చేసేవారు. ఇతని వద్ద ఎన్నో కుటుంబాలకు ఉపాధి దొరికేది. తిత్లీ తర్వాత నెలకొన్న పరిణామాలతో దిగుబడులు గణనీయంగా తగ్గిపోయాయి. పది రోజులకు 15 వేల కాయలు రాకపోవడంతో వ్యాపారం నిలిపివేశారు. సుమారు 20 కుటుంబాలకు పైగా జీవనోపాధి సమస్య తలెత్తింది.

న్యూస్‌టుడే, సోంపేట

‘అన్న చెప్పారంటే చేస్తారంతే’.. ఇది వైకాపా శ్రేణులు తరచూ చెప్పే మాట. జగన్‌ ఆదుకుంటారేమోనని ఐదేళ్లు ఎదురుచూసినా కొబ్బరి రైతులకు మాత్రం ఎలాంటి ఫలితం లేకపోయింది. దిగుబడులు నామమాత్రంగా రావడం.. పరిశ్రమ, పరిశోధన కేంద్రం ఏర్పాటుకు చర్యలు తీసుకోలేదు. చీడపీడల నివారణను పట్టించుకోలేదు. మద్దతు ధర హామీలకే పరిమితం కావడంతో ఉసూరుమంటున్నారు. వైకాపా ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం లేకపోవడంతో జీవనోపాధికి రైతులు భూములు విక్రయిస్తుండగా కూలీలు, ఇతర వర్గాలవారు వలస బాట పడుతున్నారు.

కోనసీమ కొబ్బరి తర్వాత సిక్కోలు కాయలకు ఆదరణ ఎక్కువ. ఉత్తరప్రదేశ్‌, ఝార్ఖండ్‌, పశ్చిమ బంగ, ఒడిశా, హరియాణా, గుజరాత్‌, అసోం తదితర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తారు. జిల్లాలో ఎక్కువ మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న కొబ్బరి సాగుకు వైకాపా పెద్దలు అన్నివిధాలుగా మొండిచేయి చూపారు.  

అనుబంధ పరిశ్రమలు మూత  

ఉద్దానంలో కొబ్బరి పరిశోధన కేంద్రం ఏర్పాటు హామీలకే పరిమితమైంది. రైతుల భాగస్వామ్యంతో ఏర్పాటు చేయతలపెట్టిన కొబ్బరి పార్కు ప్రతిపాదనల దశ దాటలేదు. ఉద్దానం కొబ్బరి నాణ్యత బాగుండటంతో వెయ్యి కాయకు రూ.నాలుగైదు వేలు అధిక ధర చెల్లించే పరిస్థితి ఉంది. గతంలో ఇక్కడ 32 పీచు పరిశ్రమలు ఉండగా ప్రస్తుతం 23 ఉన్నాయి. వాటికీ ముడిసరకు అందడం లేదు. చీడపీడల మూలంగా కొబ్బరి ఆకులు దెబ్బతినడంతో పుల్లల పరిశ్రమలు పది వరకు మూతపడ్డాయి. వీటి ఆధారంగా ఉపాధి పొందే కూలీలు ఇబ్బందులు పడుతున్నారు.  

చీడపీడలతో దెబ్బ

తిత్లీ తుపాను తర్వాత కుదేలైన కొబ్బరిసీమను ఆదుకోడానికి ప్రత్యేక చర్యలు తీసుకోకపోవడంతో సాగు పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. కొత్తగా నాటిన మొక్కలు చీడపీడలతో దెబ్బతిన్నాయి. వంద మొక్కలు నాటితే పది కూడా బతకలేదు. కొత్తవి పంపిణీ చేయలేదు. నాలుగేళ్లుగా కవిటి, కంచిలి, సోంపేట, మందస మండలాల పరిధిలో కొబ్బరితోటలకు నల్లముట్టే, తెల్లదోమ, ఎర్రముక్కు ఇతర చీడపీడలు ఆశించాయి. వాతావరణ మార్పు, నీటి లభ్యత తగ్గిపోవడంతో రెండు నెలలకోసారి వచ్చే దిగుబడులు ఆరేళ్లకూ చేతికందడం లేదు. తిత్లీకి ముందు ఎకరా కొబ్బరి తోటలో ఏడాదికి ఐదు వేల నుంచి 5,500 వరకు కాయలు దించేవారు. ప్రస్తుతం 1,500 నుంచి రెండు వేల కాయలు దిగుబడి కావడం లేదు.

సోంపేట మండలం గొల్లగండిలో దెబ్బతిన్న కొబ్బరి చెట్టు

సలహాలూ కరవే..

చీడపీడల నివారణకు శాస్త్రవేత్తల సలహాలు అందకపోవడంతో రైతులు వ్యయప్రయాసలు పడినా ఫలితం దక్కడం లేదు. గతంలో ప్రభుత్వం రాయితీపై సౌర విద్యుత్తు, ఇతర పరికరాలు అందించేది. వైకాపా ఐదేళ్ల పాలనలో ఎలాంటి సాయం చేయకపోవడంతో కొబ్బరి సాగుపై ఆధారపడి బతుకుతున్న కుటుంబాలు ఇతర ప్రాంతాలకు వలస వెళ్తున్నాయి. పలాస, టెక్కలి రెవెన్యూ డివిజన్లలో 90 శాతం కొబ్బరి సాగవుతుండగా ఉద్యాన పంటల పేరిట 100 కిలోమీటర్లకు పైగా దూరంలో ఉన్న బూర్జ మండలం పెద్దపేటలో నామమాత్రంగా ఏర్పాటు చేసిన పరిశోధన కేంద్రంతో ఇక్కడి రైతులకు ప్రయోజనం చేకూరడం లేదు.

జిల్లాలో కొబ్బరి సాగు: 45 వేల ఎకరాలు
తిత్లీ తుపానుకు ముందు దిగుబడులు: 27 కోట్ల కాయలు
ప్రస్తుతం: 8 కోట్ల కాయలు
ఉపాధి పొందుతున్న రైతు, కూలి, ఇతర కుటుంబాలు: 1.25 లక్షలు
తిత్లీ తుపానుకు ముందు ఏటా లావాదేవీలు: రూ.700 కోట్లు
ప్రస్తుతం: రూ.200 కోట్ల కంటే తక్కువ

తోటలు విక్రయించుకుని జీవనం  

ఆదాయం లేకపోవడంతో జీవనోపాధికి కొబ్బరి తోటలు విక్రయించుకుని బతకాల్సిన పరిస్థితి రైతులకు తలెత్తింది. గతంలో ఏటా కొంత విస్తీర్ణం కలిగిన తోట కొనుగోలు చేసి సాగును విస్తరించే వాళ్లం. ఐదేళ్ల నుంచి రాయితీ పరికరాలూ ఇవ్వలేదు. కొబ్బరి రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటామని జగన్‌ హామీ ఇచ్చినా పట్టనట్లు ఊరుకున్నారు. 

బార్ల చిన్నబాబు, కొబ్బరి రైతు ప్రతినిధి, కవిటి మండలం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని