logo

ఎంఆర్‌ఐ సేవలు.. అందని ద్రాక్షేనా!

కేజీహెచ్‌లో మూలకు చేరిన ఎం.ఆర్‌.ఐ స్కానింగ్‌ యంత్రం స్థానంలో కొత్త పరికరాన్ని రెండు నెలల వ్యవధిలో ఏర్పాటు చేస్తామని గతేడాది ఆగస్టు నెలలో ఆసుపత్రి సందర్శన సందర్భంలో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని హామీ ఇచ్చారు.

Published : 31 Jan 2023 04:47 IST

కేజీహెచ్‌లో ఏడాదిగా మూలకు చేరిన యంత్రం
నెరవేరని మంత్రి, అధికారుల హామీలు
వన్‌టౌన్‌, న్యూస్‌టుడే

మరమ్మతులకు గురైన ఎం.ఆర్‌.ఐ. యంత్రం ఇదే

* కేజీహెచ్‌లో మూలకు చేరిన ఎం.ఆర్‌.ఐ స్కానింగ్‌ యంత్రం స్థానంలో కొత్త పరికరాన్ని రెండు నెలల వ్యవధిలో ఏర్పాటు చేస్తామని గతేడాది ఆగస్టు నెలలో ఆసుపత్రి సందర్శన సందర్భంలో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని హామీ ఇచ్చారు. ఇప్పటి వరకు ఆ హామీ కార్యరూపం దాల్చలేదు.

* ఆరు నెలల క్రితం రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు సైతం ఇటువంటి హామీనే ఇచ్చారు. కాని ఇంత వరకు కొత్త వైద్య పరికరం జాడ కనిపించలేదు.

* జిల్లా కలెక్టర్‌ ఎ.మల్లికార్జున సైతం పలుమార్లు కేజీహెచ్‌కు ఎం.ఆర్‌.ఐ స్కానింగ్‌ యంత్రం మంజూరు చేయాలని ప్రభుత్వ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. కాని ఇంత వరకు ఎటువంటి ఫలితం లేదు. ఎప్పుడు వస్తోందో చెప్పలేని దుస్థితి.

అత్యవసర సమయాల్లో ఇబ్బందులు:  ఏడాది క్రితం మరమ్మతులకు గురై మూలకు చేరిన ఎం.ఆర్‌.ఐ పరికరం పునరుద్ధరణకు నోచుకోలేదు. దీంతో పెద్దాస్పత్రికి వచ్చే పేద రోగులకు ఎం.ఆర్‌.ఐ స్కానింగ్‌ సేవలు అందని ద్రాక్షగా మారింది. ప్రత్యామ్నాయంగా ఆరోగ్యశ్రీ కింద చికిత్స పొందే రోగులకు ప్రైవేటు కేంద్రాల్లో ఉచితంగా స్కానింగ్‌ పరీక్షలు చేస్తూ నెట్టుకొస్తున్నారు. అయితే అర్ధరాత్రి వేళ అత్యవసర కేసులకు స్కానింగ్‌ సేవలు అందుబాటులో లేకుండా పోతున్నాయి.

పరిమితికి మించి వినియోగం:  కేజీహెచ్‌కు వచ్చే రోగులు, వారి అవసరాలను దృష్టిలో ఉంచుకొని 12ఏళ్ల క్రితం అప్పటి ప్రభుత్వం ఎం.ఆర్‌.ఐ స్కానింగ్‌ యంత్రాన్ని మంజూరు చేసింది. అప్పటి నుంచి వేలాది మంది రోగులకు సేవలందించారు. రెండేళ్ల నుంచి తరచూ మరమ్మతులకు గురవుతున్నా పునరుద్ధరించి నెట్టుకొచ్చారు. ఏడాది కాలం నుంచి మరమ్మతులు చేయించలేకపోతున్నారు. ఈ పరికరాన్ని పునరుద్ధరించాలంటే జర్మనీ నుంచి ఉప కరణాలను తెప్పించాలి. ఒక వేళ వాటిని తెచ్చి అమర్చినా ఎంత కాలం పనిచేస్తోందో చెప్పలేమని బయోమెడికల్‌ ఇంజినీర్లు తేల్చారు. దీంతో ఆ యంత్రంపై ఆశలు వదులుకున్నారు. ఇప్పటికే పరిమితికి మించి ఎక్కువ కాలం దాన్ని వినియోగించారు.

రోజుకు 40వరకు రోగులు: కేజీహెచ్‌లో రోజుకు 30 నుంచి 40 మంది రోగులకు ఎం.ఆర్‌.ఐ స్కానింగ్‌ పరీక్షలు అవసరమవుతాయి. న్యూరాలజీ, న్యూరోసర్జరీ, ఆర్థోపెడిక్స్‌ వంటి విభాగాలకు వచ్చే బాధితులకు ఎక్కువగా స్కానింగ్‌ పరీక్షలు రాస్తారు. కేజీహెచ్‌లో అందుబాటులో లేకపోవడంతో ప్రైవేటు కేంద్రాలకు పంపుతున్నారు. రాత్రుల వేళ అవి తెరిచి ఉండకపోవడంతో అర్ధరాత్రి వచ్చే బాధితులు తెల్లారే వరకు వేచి చూడాల్సి వస్తోంది. దీని వల్ల వైద్యం అందడంలో ఆలస్యమవుతోంది.


కొత్త పరికరం కోసం ప్రతిపాదన
- డాక్టర్‌ పి.అశోక్‌కుమార్‌, పర్యవేక్షక వైద్యాధికారి, కేజీహెచ్‌

కేజీహెచ్‌ అవసరాల దృష్ట్యా కొత్త ఎం.ఆర్‌.ఐ స్కానింగ్‌ పరికరం మంజూరు చేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం. ప్రస్తుతం ప్రైవేటు కేంద్రాలకు రోగులను పంపి ఉచితంగా పరీక్షలు చేయిస్తున్నాం. ఈ మేరకు ప్రైవేటు కేంద్రాలతో త్వరలో ఒప్పందం చేసుకుంటాం. కేజీహెచ్‌ నుంచి రోజూ 30 మందికి స్కానింగ్‌ పరీక్షలు అవసరమవుతాయి. వాటికయ్యే ఖర్చును ఆసుపత్రి భరిస్తోంది. త్వరలో కొత్త పరికరం త్వరలో వచ్చే అవకాశం ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని