logo

ఆలయం.. నిధులందక ఆలస్యం

నర్సీపట్నం మండలం వేములపూడి పంచాయతీలో ఆరు గుడుల నిర్మాణానికి రూ.10 లక్షలు చొప్పున తితిదే అధికారులు కేటాయించారు. నిధులు రాకపోయినా కొన్నిచోట్ల నాయకులు శ్రద్ధ తీసుకుని నిర్మాణ పనులను దాదాపు ముగింపు దశకు తీసుకొచ్చారు.

Updated : 31 May 2023 05:05 IST

నిర్మాణాలకు అందని తితిదే సాయం
ఈనాడు డిజిటల్‌, అనకాపల్లి, న్యూస్‌టుడే,నర్సీపట్నం గ్రామీణం, రోలుగుంట, అనకాపల్లి:

వేములపూడి శివారు అప్పనపాలెంలో దాదాపు పూర్తయిన లక్ష్మీదేవి ఆలయం

నర్సీపట్నం మండలం వేములపూడి పంచాయతీలో ఆరు గుడుల నిర్మాణానికి రూ.10 లక్షలు చొప్పున తితిదే అధికారులు కేటాయించారు. నిధులు రాకపోయినా కొన్నిచోట్ల నాయకులు శ్రద్ధ తీసుకుని నిర్మాణ పనులను దాదాపు ముగింపు దశకు తీసుకొచ్చారు. ఎస్సీ కాలనీలో రామాలయం, పార్వతీదేవి గుడి, బంగారయ్యపేటలో లక్ష్మిదేవి గుడి నిధుల్లేక పునాదుల స్థాయిలోని నిలిచిపోయాయి. రెండు నెలల క్రితం అధికారులు కొలతలు తీసుకువెళ్లినా నిధులు విడుదల కాలేదు.

* రోలుగుంట మండలం బి.బి.పట్నంలో రామాలయం సుమారు 90 ఏళ్ల క్రితం నిర్మించడంతో పూర్తిగా శిథిలాస్థకు చేరుకుంది. ఈ ఆలయాన్ని పునర్నిర్మించడానికి గ్రామస్థులు సంకల్పించారు. గత ఏడాది ఏప్రిల్‌లో సర్పంచి విశ్వేశ్వరరావు నేతృత్వంలో విప్‌ కరణం ధర్మశ్రీ ద్వారా ప్రతిపాదనలు పంపారు. ఇటీవలే శంకుస్థాపన చేసి నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. నిధులొస్తే పనులు చేపట్టొచ్చని చూస్తున్నారు.

..ఇలా ఒకటి రెండు కాదు.. వందలాది గుడులకు తితిదే ఆర్థిక సాయం అందాల్సి ఉంది.

భక్తుల కోర్కెలు తీర్చే భగవంతుడికి గూడు ఏర్పరచాలంటే నిధుల కొరత తప్పడం లేదు. భక్తుల మొర ఆలకించడానికి దేవుడికి ఓ ఆవాసం కల్పించడానికి పాలకులకు అనుగ్రహం కలగడం లేదు. ఆయా గ్రామాల్లో గుడులు, గోపురాలు కట్టడానికి ఆర్థిక సాయం చేస్తామని పెద్దలు హామీలిచ్చినా సొమ్ములు విడుదల చేయడం లేదు. తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన శ్రీవాణి ట్రస్ట్‌ నుంచి గ్రామీణ ప్రాంతాల్లో గుడుల నిర్మాణానికి రూ.10 లక్షలు చొప్పున మంజూరు చేశారు. అనకాపల్లి జిల్లాలో మొదటి విడత 98 దేవాలయాలకు, అల్లూరి జిల్లాలో 161 ఆలయాల నిర్మాణానికి తితిదే నుంచి సాయం ప్రకటించారు. అయితే ఇప్పటి వరకు ఒక్క గుడికీ పైసా కూడా అందలేదు. గ్రామస్థుల చందాలు, దాతల విరాళాలతో కొంతవరకు నిర్మించి సొమ్ముల్లేక ఆలయాలను అసంపూర్తిగా వదిలేయాల్సి వస్తోంది.

దుగ్గాడలో నూకాలతల్లి కోవెల పైకప్పు

ఆ రెండు నియోజకవర్గాలకే..

బడి లేని ఊరుంటుందేమో గాని గుడి లేకుండా గ్రామం కనిపించదు. చిన్నదో పెద్దదో ఓ కోవెల ఉంటే ఊరికి మంచిదని విశ్వాసం. అందుకే గ్రామాల్లోకి నేతలెవరొచ్చినా గుడి కట్టుకుంటాం సాయం చేయండని అడుగుతుంటారు. హిందూ ధర్మ ప్రచారంలో భాగంగా తితిదే కూడా శ్రీవాణి ట్రస్ట్‌ ద్వారా ఆలయాల నిర్మాణానికి నిధులు సమకూర్చుతుంది. అందులో భాగంగానే ఎమెల్మేలు కూడా తితిదే నిధుల కోసం ప్రతిపాదనలు పంపిస్తుంటారు. ప్రస్తుతం అధికార పార్టీ ప్రాంతీయ సమన్వయకర్తగా తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి వ్యవహరిస్తున్నారు. ఆయన కూడా నేతలు ఎవరు అడిగినా కాదనడం లేదు. మొదటి విడతలో నర్సీపట్నం, చోడవరం నియోజకవర్గాల్లో 98 గుడులకు తితిదే ద్వారా మంజూరు లభించింది. తాజాగా రెండో విడతలో కూడా నర్సీపట్నం, చోడవరం ఎమ్మెల్యేలు 81 దేవాలయాలకు ఆర్థిక సాయం కోసం ప్రతిపాదనలు పంపించారు. ఇవి కాకుండా మరో అయిదు గ్రామాల నుంచి నేరుగా ప్రతిపాదనలు రాగా వాటన్నింటికీ మంజూరు లభించినట్లు తెలిసింది.

జీఎస్టీ గండం..

గ్రామంలో కమిటీల ద్వారా కోవెలలు నిర్మిస్తుంటారు. తితిదే తరఫున అందించే సాయం కూడా ఈ కమిటీ సభ్యుల పేరునే ఇవ్వాల్సి ఉంటుంది. పూర్తయిన పనికి బిల్లు చేసేటప్పుడు నిర్మాణ కమిటీల పేరున జీఎస్టీ చెల్లించాలి. ఒక్కో గుడికి రూ.10 లక్షలు ఖర్చుచేస్తే అందులో రూ.1.35 లక్షల వరకు జీఎస్టీ కింద పోతుంది. ఇది పెద్ద సమస్య కాకపోయినా జీఎస్టీ కమిటీ సభ్యుల పేరున చెల్లించడం వల్ల ప్రభుత్వ సంక్షేమ పథకాలకు వారు అనర్హులుగా మారిపోయే ప్రమాదం ఉంది. దీంతో బిల్లుల చెల్లింపులపై సందిగ్ధత నెలకొంది. ఈ విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లినా అట్నుంచి స్పష్టత రాక.. బిల్లులు చెల్లింపుల్లో తీవ్ర జాప్యం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయమై దేవాదాయ శాఖ కార్యనిర్వాహక ఇంజినీరు రాంబాబు వద్ద ప్రస్తావించగా తితిదే నుంచి నిధులైతే విడుదలయ్యాయని, జీఎస్టీ సమస్యపై ప్రభుత్వం నుంచి ఉత్వర్వులు వస్తాయేమో అని ఎదురుచూస్తున్నట్లు వివరించారు. త్వరలోనే మొదటి విడత నిర్మాణాలకు సొమ్ములు అందుతాయని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. అయితే మొదటి విడతలో నిర్మిస్తున్న వాటికే నిధులు ఇవ్వకపోవడంతో రెండో విడతలో మంజూరైన వాటిని కార్యరూపంలోకి తేలేకపోతున్నారు.

బి.బి.పట్నంలోని పునాదుల దశలో రామాలయం పనులు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని