logo

అరకులోయ వైకాపాలో వర్గపోరు

అరకులోయ నియోజకవర్గ వైకాపాను వర్గపోరు వెంటాడుతోంది. క్యాడర్‌ను అభ్యర్థి సమన్వయం చేసుకోవడం లేదు.

Published : 27 Apr 2024 01:30 IST

శ్రేణులను సమన్వయం చేసుకోలేకపోతున్న అభ్యర్థి
అనంతగిరి, న్యూస్‌టుడే

ఇటీవల ఓ రిసార్ట్‌లో జరిగిన సమావేశానికి వచ్చిన అభ్యర్థితో మాట్లాడుతున్న వైకాపా శ్రేణులు

రకులోయ నియోజకవర్గ వైకాపాను వర్గపోరు వెంటాడుతోంది. క్యాడర్‌ను అభ్యర్థి సమన్వయం చేసుకోవడం లేదు. ఈ కారణంగా పలువురు నాయకులు, కార్యకర్తలు బయటకు కలిసి తిరుగుతున్నట్లు కనిపిస్తున్నా అంతర్గతంగా ఎవరి దారి వారిదే అన్నట్లు ఉంటున్నారు. ఎమ్మెల్యే అభ్యర్థిగా మొదట ఎంపీ గొడ్డేటి మాధవి పేరును అధిష్ఠానం ప్రకటించింది. స్థానిక నాయకులు, కార్యకర్తలు తీవ్రంగా వ్యతిరేకించారు. దీంతో గతంలోనే టికెట్‌ ఆశించి ఉద్యోగం వదిలి వచ్చిన రేగం మత్స్యలింగాన్ని అభ్యర్థిగా అధిష్ఠానం ప్రకటించింది. అప్పటినుంచి ఆయన అడపాదడపా పర్యటనలు చేస్తున్నా అసంతృప్తులను దారిలోకి తెచ్చుకోలేకపోతున్నారు. అనంతగిరి మండలంలో 24 పంచాయతీలు ఉన్నాయి. ప్రస్తుత ఎమ్మెల్యే ఫాల్గుణ, ఎమ్మెల్సీ కుంభా రవిబాబు వర్గాల నాయకులు, కార్యకర్తలు ప్రస్తుతం ఒకేతాటిపైకి వచ్చి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లుగా బయటికి కనిపిస్తున్నా అంతర్గతంగా వర్గపోరు కొనసాగుతోంది.

బుజ్జగింపులు

ఒక్కొక్కరు ఒక్కోదారిలో ఉంటుండటంతో వారు జారిపోకుండా ఉండేందుకు అభ్యర్థితోపాటు పార్టీ పెద్దలు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు.  ఓ వైపు కూటమి అభ్యర్థి ప్రచారంలో జోరు పెంచారు. స్వతంత్రులు సైతం ప్రచారంలో దూసుకుపోతున్నారు. దీంతో పార్టీ క్యాడర్‌ ఎక్కడ జారిపోతుందోనని వైకాపా పెద్దలు బుజ్జగింపు చర్యలు చేపడుతున్నారు. భీంపోలు పర్యటనలో భాగంగా క్యాడర్‌ అంతా వ్యతిరేకతను ప్రదర్శించటంతో తప్పనిసరి పరిస్థితులలో అభ్యర్థి వెంటనే శివలింగపురంలో ఉన్న ఓ ప్రైవేటు రిసార్ట్సు వద్దకు అసంతృప్తి నేతలను పిలిచి బుజ్జగించారు. కొద్దిరోజులకు ముందే ములియగుడ సమీపంలో ఓ ప్రైవేటు రిసార్ట్సులో ఎంపీటీసీ సభ్యులు, సర్పంచులు, నేతలను పిలిచి పార్టీ కోసం పనిచేయాలని కోరారు. వెళ్లిన వారందరికి ఎంతో కొంత ముట్టజెప్పినట్లు సమాచారం. ఎప్పటికప్పుడు బుజ్జగింపు చర్యలు చేపడుతున్నా అంతర్గత విభేదాల కారణంగా క్యాడర్‌ చాలావరకు అసంతృప్తితో ఉన్నట్లుగా తెలుస్తోంది.. ప్రచారంలో అభ్యర్థి పెద్దగా ఆకట్టుకోవడం లేదని మండలవాసులు చెబుతున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే ఓటమి తప్పదని పలువురు పేర్కొంటున్నారు.

ఎవరి దారి వారిదే

అనంతగిరి ఎంపీపీగా శెట్టి నీలవేణి ఉన్నారు. పార్టీ మండల అధ్యక్షుడిగా రేగబోయిన స్వామి కొనసాగుతున్నారు. వీరు మత్స్యలింగానికి టికెట్‌ వచ్చినప్పటి నుంచి ఆయనతో ఉంటూ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. వీరితోపాటు పలువురు ఎంపీటీసీ సభ్యులు, సర్పంచులు సైతం ప్రచారాలు నిర్వహిస్తున్నారు. పార్టీలో క్యాడర్‌కు అభ్యర్థి తగిన ప్రాధాన్యం ఇవ్వడం లేదని పలువురు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. అధిష్ఠానం దృష్టిలో పార్టీకి పని చేస్తున్నట్లుగా కనిపించేందుకు మాత్రమే ప్రచార కార్యక్రమాల్లో వారు పాల్గొంటున్నారని తెలుస్తోంది. మరోవైపు పంచాయతీ స్థాయి నాయకుల్లోనూ వర్గపోరు కనిపిస్తోంది. ఇటీవల భీంపోలులో సర్పంచి వర్గమంతా అభ్యర్థి కోసం ఏర్పాట్లు చేసి ఎదురుచూస్తుండగా, ఎంపీటీసీ సభ్యుడి వర్గం నేతలు అక్కడకు వెళితే ఒప్పుకోమని తెగేసి చెప్పారు. దీంతో అభ్యర్థి అక్కడకు వెళ్లలేదు. తమను పట్టించుకోలేదని సర్పంచి కన్నీరు పెట్టుకున్నారు. గుమ్మకోట, భీంపోలు పంచాయతీల్లో పర్యటన ఉండగా పార్టీ మండలాధ్యక్షుడు, ఇతర నాయకులు ఈ కార్యక్రమానికి హాజరు కాకుండా ఫోన్‌లు స్విచ్‌ ఆఫ్‌ చేసి అందుబాటులో లేకుండా వెళ్లిపోయారు. పార్టీ కోసం పనిచేసిన వారికి తగిన గుర్తింపు ఉండటం లేదని మండలంలో కొందరు నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎంపీపీ, మండల పార్టీ అధ్యక్షుడికి తగిన ప్రాధాన్యం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. అభ్యర్థి తనకు నచ్చినవారిని అనుచరులుగా ఏర్పాటు చేసుకుని వారి ద్వారా కార్యకలాపాలు నడిపిస్తున్నట్లు సమాచారం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని