logo

జనావాసాల్లో ఆసుపత్రి వ్యర్థాలు

ప్రతిపక్ష కౌన్సిలర్లు ప్రాతినిధ్యం వహిస్తున్న వార్డుల అభివృద్ధికి నిధుల కేటాయింపులో పుర పాలకవర్గం వివక్ష చూపుతోంది.

Published : 27 Apr 2024 01:23 IST

గంజాయి బ్యాచ్‌కు అడ్డాగా శిథిల భవనం

ఆసుపత్రి వ్యర్థాలతో నిండిన కాలువ

నర్సీపట్నం, న్యూస్‌టుడే: ప్రతిపక్ష కౌన్సిలర్లు ప్రాతినిధ్యం వహిస్తున్న వార్డుల అభివృద్ధికి నిధుల కేటాయింపులో పుర పాలకవర్గం వివక్ష చూపుతోంది. అధికార పక్ష కౌన్సిలర్లకు చెందిన వార్డులకు పెద్దపీట వేస్తున్నా.. ఎక్కడి సమస్యలు అక్కడే ఉంటున్నాయి. నర్సీపట్నంలోని 2, 7, 19, 26 వార్డుల్లో అపరిష్కృత సమస్యలతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు.

  • 26వ వార్డు పరిధిలో ప్రాంతీయ ఆసుపత్రి ఉంది. ఆసుపత్రి వ్యర్థాలను జనావాసాల్లో పడేస్తున్నారని వార్డు ప్రజలు వాపోతున్నారు. ఈ వార్డుకు మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడి సతీమణి పద్మావతి కౌన్సిలర్‌గా వ్యవహరిస్తున్నారు. కౌన్సిల్‌ సమావేశాల్లో పలుమార్లు ఆసుపత్రి వ్యర్థాల సమస్యను పాలకవర్గం దృష్టికి తీసుకువెళ్లినా.. స్పందన శూన్యం. ఆసుపత్రి ప్రహరీని ఆనుకుని వెనుక ఉన్న కాలువలో వ్యర్థాలను పడేస్తున్నారు. కౌన్సిలర్‌గా పద్మావతి సొంత నిధులతో వార్డులో విద్యుత్తు స్తంభాలు, పాత మున్సిపల్‌ కార్యాలయం ఎదుట రోడ్డు, కాలువ నిర్మాణ పనులు చేపట్టారు.
  • వైకాపా కౌన్సిలర్‌ సిరసపల్లి నాని ప్రాతినిధ్యం వహిస్తున్న రెండో వార్డులో రోడ్లు, మురుగు కాలువ సమస్యలతో స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ ప్రాంతంలోని తాగునీటి ట్యాంకులు శిథిలావస్థకు చేరువలో ఉన్నాయి. వేసవిలో కొన్ని ప్రాంతాలకు తాగునీటి సరఫరా సక్రమంగా జరగడం లేదు. కచ్చా కాలువలు పొంగి మురుగు నీరు రోడ్లపైకి చేరుతోంది. వార్డులో దొంగల భయం అధికంగా ఉంది. శిథిలావస్థకు చేరువై నిరుపయోగంగా ఉన్న ఎస్సీ బాలుర వసతిగృహం గంజాయి బ్యాచ్‌కు అడ్డాగా మారింది.
  • ఏడో వార్డుకు కౌన్సిలర్‌గా తెదేపాకు చెందిన రావాడ లక్ష్మి ఉన్నారు. చాలాచోట్ల రోడ్లు, మురుగు కాలువల్లేవు. తెదేపా ప్రభుత్వ హయాంలో రూ.50 లక్షలతో బీసీ కల్యాణ మండపం నిర్మాణానికి ప్రతిపాదించగా నిధులు మంజూరయ్యాయి. వైకాపా అధికారంలోకి వచ్చాక కార్యరూపం దాల్చలేదు. కొత్తవీధి  రహదారి విస్తరణ మధ్యలో నిలిచిపోయింది.
  • కొత్త, పాత బయ్యపురెడ్డిపాలెం ప్రాంతాలతో 19వ వార్డు ఏర్పాటైంది. వైకాపా కౌన్సిలర్‌ బయ్యపురెడ్డి చినబాబు కౌన్సిలర్‌గా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గతంలో నిర్మించిన రోడ్లు దెబ్బతిన్నాయి. మరమ్మతు చేయకపోవడంతో రాకపోకలు సాగించేందుకు స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. కొత్తగా పలుచోట్ల రోడ్లు నిర్మించి కాలువలను వదిలేశారు. దీంతో ఇళ్లలోని వాడుక నీరంతా రోడ్లపైకి చేరుతోంది. వార్డులోని రెండు శ్మశానాలను అభివృద్ధి చేసి ప్రహరీ నిర్మించాలని జనం కోరుతున్నారు.

వ్యాధులు చుట్టుముడుతున్నాయి

ప్రాంతీయ ఆసుపత్రిలోని వ్యర్థాలను ఇళ్ల ముందు కాలువలో పడేస్తున్నారు. దీనిపై స్థానికులు ఆందోళన చేస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. కాలువలో మురుగుకు తోడు వ్యర్థాల నుంచి వచ్చే దుర్వాసన భరించలేకపోతున్నాం. వ్యాధులు చుట్టుముడుతున్నాయి.

లాలం వసంత, 26 వార్డు


పోలీసు గస్తీ లేదు

రెండో వార్డు ప్రాంతమంతా పొలాలను ఆనుకుని ఉండటంతో దొంగల భయం అధికంగా ఉంది. చోరీ సొత్తుతో దొంగలు పొలాల మీదుగా పారిపోతున్నారు. బీసీ కాలనీ ప్రవేశ మార్గంలో పాడుపడిన వసతి గృహ భవనంలో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయి. పోలీసు గస్తీ అంతంతమాత్రంగానే ఉంది.

నాగయ్యమ్మ, 2వ వార్డు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని