logo

మాకూ కావాలి.. ఓ గన్‌!!

ప్రశాంతతకు మారు పేరుగా నిలిచే విశాఖలో ఇటీవలి పరిణామాలు కలవరపెడుతున్నాయి. దీంతో ‘గన్‌’ లైసెన్స్‌కు దరఖాస్తులు పెరుగుతున్నాయి.

Published : 27 Jun 2023 03:52 IST

విశాఖలో లైసెన్సులకు దరఖాస్తులు!
భూ కబ్జాలు, కిడ్నాప్‌లు, హత్యల నేపథ్యంలో ఆందోళన
వ్యక్తిగత భద్రతపై విశాఖ ప్రముఖుల దృష్టి

ఈనాడు-విశాఖపట్నం : ప్రశాంతతకు మారు పేరుగా నిలిచే విశాఖలో ఇటీవలి పరిణామాలు కలవరపెడుతున్నాయి. దీంతో ‘గన్‌’ లైసెన్స్‌కు దరఖాస్తులు పెరుగుతున్నాయి. కొన్నాళ్లుగా హత్యలు, కిడ్నాప్‌లు, దాడులతో భయానక పరిస్థితి నెలకొంది. విశాఖపట్నం నుంచి పరిపాలన సాగిస్తామని వైకాపా ప్రభుత్వం ప్రకటించిన తరువాత భూకబ్జాలు, ఆక్రమణలు, బెదిరింపులు-వేధింపులు పెరగడంతో నేరాల తీరు కూడా మారిపోయింది. నగరంలో 2021లో 37 హత్యలు, 2022లో 38 హత్యలు జరిగాయి. ఈ ఏడాది ఆరు నెలల వ్యవధిలో 15 జరిగాయని గణాంకాలు చెబుతున్నాయి. మరో వైపు గంజాయి నిల్వ... రవాణాకు నగరం కేంద్రంగా మారింది. ఇటీవల వైకాపా ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ భార్య జ్యోతి, కుమారుడు శరత్‌లతోపాటు, వైకాపా నేత, ప్రముఖ ఆడిటర్‌ జీవీలను డబ్బు కోసం కిడ్నాప్‌ చేయడం ఉలిక్కిపడేలా చేసింది. ఎంపీ కుటుంబీకులకే రక్షణ లేకపోతే సామాన్యుల పరిస్థితి ఏంటనే అంశం చర్చనీయాంశమయింది. దీంతో విశాఖలోని కొందరు రాజకీయ, వ్యాపార, స్తిరాస్థి (రియల్‌ ఎస్టేట్‌) ప్రముఖుల్లో వణుకు మొదలైంది.

నేరగాళ్ల కన్ను పడింది: ఒక్క కిడ్నాప్‌ ఘటనతోనే నగరవాసుల్లో ఇంత భయం కలగలేదు. గత కొంత కాలంగా వరుసగా జరుగుతున్న నేరాలు తీవ్ర స్థాయికి చేరడంతోనే ఈ ఆందోళన నెలకొంది. కొందరు నేతల భూదాహం విపరీత పరిణామాలకు దారి తీస్తోంది. వివాదాస్పద స్థలాల్లో ఓ వర్గానికి కొమ్ముకాస్తూ ‘డెవలెప్‌మెంట్‌’ పేరుతో పాగా వేస్తున్నారు. అధికార అస్త్రాన్ని ప్రయోగించి విలువైన భూములను తమపరం చేసుకుంటున్నారు. వారికి దన్నుగా నిలుస్తున్న కొందరు రౌడీషీటర్లే కిడ్నాప్‌లు, హత్యలకు తెగబడుతున్నారు. రౌడీషీటర్‌ హేమంత్‌ గతేడాది జూన్‌లో భీమిలికి చెందిన తెదేపా నేత, రియల్టర్‌ను కిడ్నాప్‌ చేసి, కారులో తిప్పుతూ రూ.కోటి డిమాండ్‌ చేశాడు. ఆ తర్వాత కొన్నాళ్లకు మరో రియల్టర్‌ను ప్లాటు అమ్ముతానంటూ పిలిచి కిడ్నాప్‌ చేసి రూ.7.50 లక్షలు వసూలు చేశాడు. ఇటీవల ఎంపీ కుటుంబీకులను, ఆడిటర్‌ను కిడ్నాప్‌ చేసిన సమయంలో ‘ఎంపీ అయినా, ఆటోడ్రైవరైనా ఒక్కటే.. పదిహేను రోజుల్లో బయటకు వచ్చేస్తాం’ అని కిడ్నాపర్లు ధీమాగా మాట్లాడటం గమనార్హం. ఎవరిని అడిగితే అప్పటికప్పుడు రూ.కోట్లు తెచ్చి ఇస్తారో? ఎవరి వద్ద డబ్బులు ఎక్కువ ఉంటాయో? నగరంలోని ప్రముఖల పేర్లు, ఫోన్‌ నెంబర్లు చెప్పి మరీ బాధితులతో ఫోన్‌ చేయించారంటే నేరగాళ్ల కన్ను వీరందరిపైనా ఉన్నట్లు స్పష్టమవుతోంది. కిడ్నాప్‌ సంఘటన తరువాత తన కుమారుడు శరత్‌కు వ్యక్తిగత భద్రత నేపథ్యంలో గన్‌ లైసెన్సు జారీ చేయాలని దరఖాస్తు చేసుకున్నట్లు ఎంపీ ఇటీవల వెల్లడించారు. పరిశ్రమలశాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ మూడు నెలల క్రితం గన్‌ లైసెన్సు విషయంలో నిర్ణయం తీసుకోగా... నెల కిందట దరఖాస్తు పెట్టినట్లు సమాచారం. మంత్రికి గన్‌మెన్లతో వన్‌ ప్లస్‌ ఫోర్‌ సెక్యూర్టీ ఉన్నప్పటికీ, వ్యక్తిగత భద్రత పేరుతో గన్‌ కోసం దరఖాస్తు చేసుకున్నారు.

కొన్ని రోజులుగా: నగరంలో ఇప్పటి వరకు 300 పైగా గన్‌ లైసెన్సులు ఉన్నాయి. ఎంపీ కుటుంబం కిడ్నాప్‌ ఘటనతో గత పదిరోజులుగా కొత్తగా దరఖాస్తులు అందుతున్నట్లు సమాచారం. వెంటనే లైసెన్సు మంజూరు చేయాలనే సిఫార్సులతో, అభ్యర్థనలతో దరఖాస్తుల సంఖ్య పెరిగినట్లు తెలుస్తోంది. పోలీస్‌ కమిషనర్‌కు వచ్చే దరఖాస్తులను స్పెషల్‌బ్రాంచ్‌కి పంపి విచారణ చేయించాల్సి ఉంటుంది.  దరఖాస్తుదారుకు బందోబస్తు అవసరమని గుర్తిస్తే దస్త్రాన్ని  అమరావతి పంపి అనుమతి రాగానే మంజూరు చేస్తారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని