logo

చేయి తడిపితే సరే!!

మహా విశాఖ నగరపాలక సంస్థకు ఆదాయాన్ని సమకూర్చే మార్కెట్లనూ వైకాపా నాయకులు వదలడం లేదు. పాలకవర్గం కొలువుదీరి మూడేళ్లవుతోంది.

Updated : 02 Mar 2024 05:27 IST

మార్కెట్లపై వైకాపా నేతల పెత్తనం
జీవీఎంసీ ఖజానాకు మూడేళ్లలో రూ.15కోట్ల గండి

కార్పొరేషన్‌, న్యూస్‌టుడే: మహా విశాఖ నగరపాలక సంస్థకు ఆదాయాన్ని సమకూర్చే మార్కెట్లనూ వైకాపా నాయకులు వదలడం లేదు. పాలకవర్గం కొలువుదీరి మూడేళ్లవుతోంది. ఏటా జీవీఎంసీ ఆదాయాన్ని పెంచేలా ప్రణాళికలు రచించాల్సిన కొందరు సభ్యులు అందుకు విరుద్ధంగా గుత్తేదారులతో కుమ్మక్కై రాబడికి గండికొడుతున్నారు. తమ దారికి రాని గుత్తేదారుల లీజులను రద్దు చేసేలా ఉన్నతాధికారులపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. మూడేళ్లలో వైకాపా నాయకులు మార్కెట్ల నుంచే రూ.5కోట్ల వరకు దోపిడీ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.

అంతా ఒక్కటై..

నగరంలోని పూర్ణమార్కెట్‌ను 2023-2024 ఆర్థిక సంవత్సరానికి రూ.90లక్షలకు ఓ గుత్తేదారు దక్కించుకున్నారు. 2021-22లో ఈ మార్కెట్‌ నుంచి జీవీఎంసీకి రూ. 1.10కోట్ల ఆదాయం వచ్చింది. అంతకు ముందు ఏడాది ఇది రూ.1.20కోట్లు కావడం గమనార్హం. వాస్తవంగా ఏటా టెండరు మొత్తం పెరగాలి. అందుకు విరుద్ధంగా రూ.20లక్షల వరకు తగ్గిపోయింది. టెండరు మొత్తం పెరగకుండా ఉండడానికి గుత్తేదారులను రింగుగా తయారు చేసిన ఓ వైకాపా నాయకుడు రూ.90లక్షలకు పరిమితమయ్యేలా చేశాడు. అందుకుగానూ ఆ నాయకుడికి రూ.11లక్షలు ఇవ్వడానికి ఒప్పందం జరిగిందని ఆరోపణలు వచ్చాయి. నిబంధనల ప్రకారం టెండర్లు నిర్వహించి ఉంటే రెండేళ్లలో జీవీఎంసీకి రూ.40లక్షల వరకు అదనపు ఆదాయం సమకూరేది.

డబ్బులివ్వకుంటే బెదిరింపులు..

పాతనగరంలోని రామకృష్ణ రైతుబజారును రూ.18లక్షలకు ఓ గుత్తేదారు దక్కించుకోగా, స్థానిక వైకాపా నాయకుడొకరు రూ.5లక్షలు డిమాండ్‌ చేశారు. నిబంధనల ప్రకారం జీవీఎంసీకి నిధులు చెల్లించి టెండరు దక్కించుకున్నానని, అదనంగా ఎందుకు ఇవ్వాలని గుత్తేదారు ఎదురుతిరిగారు. మార్కెట్లో సౌకర్యాలపై జీవీఎంసీ కౌన్సిల్‌ సమావేశంలో మాట్లాడానని, తనకు డబ్బులు ఇవ్వాల్సిందేనని ఆ నాయకుడు డిమాండ్‌ చేశారు. మాట వినకపోతే మార్కెట్‌ నుంచి ఒక్క రూపాయి రాకుండా చేస్తానని బెదిరించి తన పంతం నెగ్గించుకున్నాడు.


అద్దె రూ.2వేలే: అత్యంత రద్దీగా ఉండే హోల్‌సేల్‌ ఫ్రూట్‌ మార్కెట్లో‌ ఒక్కో దుకాణానికి నెలకు అద్దె కేవలం రూ.2వేలు మాత్రమే జీవీఎంసీ తీసుకుంటోంది. జీఓ 56 ప్రకారం మార్కెట్‌ ధరలో 30శాతం లేదా సమీపంలోని ప్రయివేటు వాణిజ్య సముదాయాల అద్దెలలో ఏది ఎక్కువైతే దాన్ని నిర్ణయించాల్సి ఉంది. ఆ లెక్క ప్రకారం ఫ్రూట్‌ మార్కెట్లో‌ దుకాణాల అద్దె రూ.70వేల నుంచి రూ.లక్ష వరకు ఉండాలి. దాన్ని అమలు చేయకుండా పాలకవర్గంలోని కీలక వైకాపా నాయకులు అడ్డుకున్నారు. వ్యాపారులతో కుమ్మక్కై కేవలం రూ.2వేల అద్దెకు దుకాణాలను అప్పగించేశారు. ఫలితంగా జీవీఎంసీ మూడేళ్లలో రూ.11.59కోట్ల ఆదాయం కోల్పోయింది. ఈ దందాలో వైకాపా నాయకులకు రూ.3కోట్లు ముట్టినట్లు ఆరోపణలు వచ్చాయి. ః జ్ఞానాపురం హోల్‌సేల్‌ మార్కెట్లో‌ మరో అక్రమానికి తెరలేపారు. ఇక్కడి దుకాణదారులు తాము ఇబ్బందుల్లో ఉన్నామని, జీవీఎంసీకి అద్దెలు చెల్లించలేమని రెండేళ్ల కిందట కోర్టులో కేసు వేశారు. దాన్ని ఇప్పటి వరకు తేల్చకపోవడంతో జీవీఎంసీˆకి ఏటా రూ.3కోట్ల వరకు నష్టం వాటిల్లుతోంది. కేసు తేలకుండా కొందరు అధికార పార్టీ నాయకులే వెనుక ఉండి నడిపిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. పాలకవర్గం కొలువుదీరిన తర్వాత జీవీఎంసీకి మార్కెట్ల ద్వారా రావాల్సిన ఆదాయంలో రూ.15కోట్ల వరకు గండిపడినట్లు అధికారులే చెబుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని