logo

విశాఖలో ఐపీఎల్‌ మ్యాచ్‌.. అభిమానులను దోచుకున్న నిర్వాహకులు

చెన్నై సూపర్‌కింగ్స్‌, దిల్లీ క్యాపిటల్స్‌ మ్యాచ్‌ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. ఈ మ్యాచ్‌లో అందరి కళ్లు చెన్నై ఆటగాడు మహేంద్రసింగ్‌ ధోనీపైనే..

Updated : 01 Apr 2024 09:01 IST

అభిమానుల కేరింతలు

ఈనాడు డిజిటల్‌, విశాఖపట్నం: చెన్నై సూపర్‌కింగ్స్‌, దిల్లీ క్యాపిటల్స్‌ మ్యాచ్‌ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. ఈ మ్యాచ్‌లో అందరి కళ్లు చెన్నై ఆటగాడు మహేంద్రసింగ్‌ ధోనీపైనే. ఈ మ్యాచ్‌కున్న డిమాండ్‌ దృష్ట్యా దిల్లీ జట్టు యాజమాన్యం, నిర్వాహకులు టికెట్ల విషయంలో అభిమానులను దోచుకున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ విక్రయాలతో తమకేమీ సంబంధం లేదని చెబుతున్న ఆంధ్రా క్రికెట్‌ అసోసియేషన్‌.. వైకాపా నాయకులకు పెద్దఎత్తున టికెట్లు కేటాయించినట్లు సమాచారం. ఎన్నికల నేపథ్యంలో వైకాపా కార్యాలయాల ద్వారా జిల్లాలోని పారిశ్రామికవేత్తలకు వీటిని చేరవేసినట్లు తెలిసింది. బ్లాక్‌లో టికెట్లు విక్రయించడంలోనూ వీరి పాత్ర ఉందని అభిమానులు ఆరోపిస్తున్నారు. పలువురు వైకాపా నాయకుల వద్ద కాంప్లిమెంటరీ పాస్‌లు ఉండటం గమనార్హం.

పట్టించుకోని పోలీసులు

దిల్లీ, చెన్నై మ్యాచ్‌ టికెట్లను ఈనెల 27న పేటీఎంలో అందుబాటులో ఉంచారు. నిమిషాల వ్యవధిలోనే టికెట్లు ఖాళీ అయిపోయాయని ప్రకటించడంతో అభిమానులు విస్మయానికి గురయ్యారు. కానీ ఆదివారం ఏసీఏ-వీడీసీఏ స్టేడియం గేటు బయట, సామాజిక మాధ్యమాల్లో బ్లాక్‌లో టికెట్ల విక్రయాలు విచ్చలవిడిగా జరిగాయి. రూ.1000 టికెట్‌ను రూ.3 వేలకు, రూ.2 వేల టికెట్‌ను రూ.6 వేలకు, రూ.3 వేల టికెట్‌ను రూ.8 వేలకు విక్రయించారు. పోలీసుల కళ్ల ముందే ఇదంతా జరిగినా.. తమకేమీ పట్టనట్లుగా వ్యవహరించడం గమనార్హం. ప్లాటినం లాంజ్‌, కార్పొరేట్‌ బాక్సుల్లోని టికెట్లను ఆన్‌లైన్‌లో బ్లాక్‌ చేశారు. మ్యాచ్‌ ప్రారంభానికి రెండు గంటల ముందు అధిక ధరల (రూ.12,000, రూ.15 వేలు, రూ.25 వేలు)కు అందుబాటులో ఉంచడం గమనార్హం.

యాజమాన్యమే కేటాయించిందా.?

ఆన్‌లైన్‌లో ఒక్కో ఫోన్‌ నంబర్‌తో రెండు టికెట్లు కొనుగోలు చేయడానికే అవకాశం కల్పించారు. కానీ కొందరు పదుల సంఖ్యలో టికెట్లు చేజిక్కించుకున్నారు. అవన్నీ వారి చేతికి ఎలా వచ్చాయో తెలియని పరిస్థితి. జట్టు యాజమాన్యమే కొందరికి టికెట్లు కేటాయించి, బ్లాక్‌ మార్కెట్లో విక్రయిస్తున్నట్లు అభిమానులు ఆరోపిస్తున్నారు. గతంలో విశాఖ వేదికగా ఐపీఎల్‌ మ్యాచ్‌లు జరిగినా ఎప్పుడూ ఇలా జరగలేదని, ఇదే తొలిసారని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గతంలో టికెట్‌ ప్రారంభ ధర రూ.300 ఉండగా ఇప్పుడు రూ.1000కు పెంచారు. ఏ ధర టికెట్లు.. ఎన్ని విక్రయిస్తున్నామనే వివరాలు వెల్లడించలేదు. రూ.2 వేల టికెట్లు ఆన్‌లైన్‌లో అందుబాటులో పెట్టలేదు. కానీ బ్లాక్‌లో విక్రయించారు. మరోవైపు సామాజిక మాధ్యమాల్లో టికెట్లు కొనుగోలు చేసేందుకు ప్రయత్నించిన కొందరు మోసపోయామని వాపోతున్నారు. మ్యాచ్‌కు టికెట్లు ఉన్నాయని ఓ వ్యక్తి ఎక్స్‌ (ట్విటర్‌)లో పోస్టు చేశాడు. ఓ అభిమాని ఎంతో ఆశగా వాట్సప్‌ నెంబర్‌కు మెసేజ్‌ చేశాడు. ఆ టికెట్లకు చాలా డిమాండ్‌ ఉందని, త్వరగా డబ్బులు చెల్లించాలని అవతలి వ్యక్తి కంగారుపెట్టాడు. డబ్బులు చెల్లించిన వెంటనే సదరు వ్యక్తి ‘బ్లాక్‌’ చేయడంతో మోసపోయినట్లు గుర్తించాడు. చేసేదేమీలేక సామాజిక మాధ్యమాల్లో గోడు వెళ్లబోసుకున్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని