logo

నేరగాళ్ల రాజ్యం.. వీధికో అకృత్యం!!

‘అక్కచెల్లెమ్మలకు అన్యాయం జరిగితే ప్రభుత్వం ఊరుకోదు. ఆడపిల్లల రక్షణపై వెనకడుగు వేయబోం. యువతులు, మహిళల రక్షణ కోసం ఆలోచించి ‘దిశ’ చట్టం, యాప్‌ రూపొందించాం.

Published : 23 Apr 2024 04:51 IST

అక్కచెల్లెమ్మలకు విశాఖలో భద్రతేది జగన్‌!
ఉలిక్కిపడేలా ఘోరాల గణాంకాలు
ఈనాడు- విశాఖపట్నం

‘అక్కచెల్లెమ్మలకు అన్యాయం జరిగితే ప్రభుత్వం ఊరుకోదు. ఆడపిల్లల రక్షణపై వెనకడుగు వేయబోం. యువతులు, మహిళల రక్షణ కోసం ఆలోచించి ‘దిశ’ చట్టం, యాప్‌ రూపొందించాం. రాష్ట్రంలో మహిళల భద్రతకు పటిష్టమైన చర్యలు తీసుకుని పెద్దపీట వేస్తున్నాం.   

ఇదీ జగన్‌ మహిళల భద్రతపై గొప్పగా చెప్పిన మాటలు

... ఇవన్నీ ప్రచార ఆర్భాటానికే తప్ప, ఆడపిల్లలపై అకృత్యాలను అడ్డుకోలేకపోయాయి. అక్కచెల్లెమ్మలకు రక్షణ కల్పించడంలో ఘోరంగా విఫలమయ్యారు. విశాఖలో పట్టపగలే మహిళలపై దాడులకు తెగబడుతున్నారు. ‘వన్‌ స్టాప్‌’ కేంద్రంలో నమోదవుతున్న గణాంకాలు ఆడబిడ్డల భద్రతను ప్రశ్నిస్తున్నాయి. గృహ హింస, అత్యాచారం, మహిళల చిత్రాలను అంతర్జాలంలో పెట్టి బెదిరింపులు, అక్రమ రవాణా, బాలికలపై లైంగిక వేధింపులు వైకాపా హయాంలో పెరిగిపోయాయి. కఠిన చర్యలు తీసుకుంటే  సీఎం జగన్‌ పాలనలో ఇన్ని జరిగేవా అని జనం ప్రశ్నిస్తున్నారు.

ప్రముఖులకే రక్షణ లేదు: విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ భార్య, కుమారుడికే రక్షణ కరవైంది. గతేడాది జూన్‌లో ఇద్దరు రౌడీషీటర్లు ఎంపీ కుమారుడు శరత్‌ ఇంట్లోకి చొరబడ్డారు. శరత్‌ను కిడ్నాప్‌ చేసి, సినీ ఫక్కీలో ఫోన్‌లో మాట్లాడిస్తూ ఎంపీ సతీమణి జ్యోతి, ఆడిటర్‌ జీవీని ఆ ఇంటికి పిలిపించి నిర్బంధించారు. ఎంపీ భార్య వద్ద ఆభరణాలు దోచుకోవడమే కాకుండా, చేయిచేసుకున్నట్లు వెలుగులోకి వచ్చింది. కిడ్నాపర్లు మూడు రోజులు గంజాయి మత్తులో ఉండి విచక్షణారహితంగా బాధితులను కొట్టి హింసించారు.

ప్రశాంత విశాఖలో ఎంపీ కుటుంబానికే భద్రత కరవైన పరిస్థితులు తీవ్ర చర్చనీయాంశ మయ్యాయి. జగన్‌ రుషికొండలో నిర్మించిన రాజసౌధానికి  కూతవేటు దూరంలోనే ఈ ఘటన చోటు చేసుకుంది. గతేడాది రాత్రి సమయంలో ఇంటికి వస్తున్న మహిళా కమిషన్‌లోని ఓ సభ్యురాలి సోదరిపై మద్యం మత్తులో ఓ యువకుడు అసభ్యకరంగా ప్రవర్తించడం ఉలిక్కిపడేలా చేసింది. ఇటీవల ఓ కీలక నేత ఇంట్లోకి చొరబడి ఆయన సతీమణి గొంతుపై కత్తిపెట్టి నగలు తీసుకెళ్లిన ఘటన కూడా కలకలం రేపింది.

అమ్మో ఎన్ని ఘటనలో

గతేడాది మే 30న ఓ వివాదాస్పద భూమిలో కాపలాదారుగా పనిచేస్తున్న మహిళను కొందరు బలవంతంగా బయటకు లాక్కొచ్చి షెడ్డు కూల్చేశారు. ఆమెను నిర్బంధించి ఫోన్‌ లాక్కొని తెల్లవారుజాము వరకు భయ భ్రాంతులకు గురి చేశారు.

నేవీ అధికారి కుమార్తెపై కొందరు అఘాయిత్యానికి పాల్పడ్డారు.  9వ తరగతి చదువుతున్న బాలిక నగ్న వీడియోలు తీసి బెదిరించి ఓ అటెండర్‌ అత్యాచారం చేశారు. ఆ వీడియోలు స్నేహితులకు చేరవేయగా, వారు కూడా లైంగిక దాడికి పాల్పడ్డారు. అటెండర్‌ను అరెస్టు చేసి పోక్సో కేసు నమోదు చేశారు. ఈ ఘోరమైన ఘటన గతేడాది జులైలో వెలుగులోకి వచ్చింది.

గతేడాది ఫిబ్రవరి 19న అర్ధరాత్రి రంగిరీజు వీధిలో ఓ కుటుంబం వెళుతుండగా.. గంజాయి మత్తులో కొందరు యువకులు మహిళ దుస్తులు చింపి క్రూరంగా ప్రవర్తించారు.

  • 2019 డిసెంబరులో కొమ్మాదిలోని వికలాంగులకాలనీలోఅద్దెకు ఉంటున్న వ్యక్తికి ఓ మహిళతో పరిచయం ఏర్పడింది. ఒక రోజున ఇంటికి పిలవగా, ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఆవేశంతో ఆ వ్యక్తి...మహిళను హత్య చేసి ప్లాస్టిక్‌ డ్రమ్ములో కుక్కేశాడు. ఏడాదిన్నర తర్వాత విషయం వెలుగులోకి వచ్చింది.
  • భీమిలి పరిధిలో ఓ ఫార్మా కంపెనీలో పనిచేసే కేరళకు చెందిన వ్యక్తి అత్యంత కిరాతంగా ఓ మహిళను హత్య చేశాడు. తనకు పరిచయం ఉన్న మహిళతో గొడవ జరగ్గా... భవనం పైనుంచి తోసేశాడు. కిందపడిన ఆమె కొన ఊపిరితో ఉండటంతో గొంతు నొక్కడంతోపాటు, శరీరంపై పలుచోట్ల కత్తితో గాయాలు చేసి చంపి నిర్మానుష్య ప్రదేశంలో పడేశాడు.

తగరపు వలసకు చెందిన ఓ మహిళకు ఆటో డ్రైవర్‌తో పరిచయం ఏర్పడింది. ఇద్దరూ ఓ రోజు ఆటోలో ఓ వేడుకకు వెళ్లి తిరిగి వస్తుండగా, తన ఒంటిపై ఉన్న బంగారం కొంత ఇవ్వాలని కోరాడు. ఆమె నిరాకరించడంతో ఆ మహిళను హత్య చేసి గెడ్డలో పడేశాడు.

నగరంలో నిఘా ఏదీ:

మద్యం, గంజాయి మత్తులో మహిళలపై కొందరు పట్టపగలే దాడులకు తెగబడుతున్నారు. బహిరంగంగానే బాలికలు లైంగిక వేధింపులకు గురవుతున్నా నిఘా కళ్లు పసిగట్టలేకపోతున్నాయి. మహిళలపై వేధింపులు...వారిపై కత్తులతో దాడులు జరుగుతున్నా నిరోధించలేక పోతున్నారు. ఘటనల తీరును పరిశీలించాలన్నా నగరంలో వందల సంఖ్యలో సీసీ కెమెరాలు మూలకు చేరిపోయాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని