logo

శిశువులపై జగన్‌ కర్కశత్వం

జగన్‌ నేతృత్వంలోని వైకాపా ప్రభుత్వం అప్పుడే పుట్టిన శిశువు నుంచి పండు ముసలి వరకు ఎవరినీ విడిచిపెట్టకుండా కర్కశత్వాన్ని ప్రదర్శిస్తోంది.

Published : 07 May 2024 04:32 IST

ప్రభుత్వ ఆసుపత్రుల్లో బేబీ కిట్ల పంపిణీ నిలిపివేత

న్యూస్‌టుడే, పెందుర్తి, వేపగుంట, పరవాడ: జగన్‌ నేతృత్వంలోని వైకాపా ప్రభుత్వం అప్పుడే పుట్టిన శిశువు నుంచి పండు ముసలి వరకు ఎవరినీ విడిచిపెట్టకుండా కర్కశత్వాన్ని ప్రదర్శిస్తోంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవమయ్యే వారికి గత తెదేపా హయాంలో ఇచ్చిన బేబీ కిట్లను జగన్‌ పాలనలోకి వచ్చిన తొలినాళ్లలోనే నిలిపేసింది. ఈ కిట్లో బేబీ టవల్‌, జిప్‌ బ్యాగ్‌తో సహా బేబీ బెడ్‌, లిక్విడ్‌ సోప్‌, దోమ తెర, సబ్బు, నూనె  తదితర వస్తువులు ఉండేవి. ఇవన్నీ సూటుకేసు వంటి బ్యాగ్‌లో పెట్టి బిడ్డ పుట్టిన వెంటనే అందజేసేవారు. వైకాపా ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్నాళ్లు కిట్ల పంపిణీ నిలిపివేసింది. ఆసుపత్రుల్లో కిట్లు నిల్వ ఉండిపోవడంతో పసుపు రంగు ఉన్న బ్యాగుల స్థానంలో వైకాపా రంగులతో బ్యాగ్‌లలో సామగ్రి ఉంచి పంపిణీ చేశారు. నాణ్యమైన పసుపు రంగు బ్యాగులను నిర్ధాక్షిణ్యంగా అగ్నికి ఆహుతి చేశారు. ఈ కిట్లోని వస్తువులను బయట మార్కెట్లో కొనుగోలు చేయాలంటే రూ.వెయ్యి వరకు ఖర్చవుతోంది. ఇది పేద బాలింతలకు భారంగా మారింది.

తెదేపా ప్రభుత్వం అందజేసిన బేబీ కిట్(పాతచిత్రం)


నాణ్యమైన వస్తువులు అందేవి..

గత ప్రభుత్వం హయాంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవం అయిన వెంటనే శిశవుల కోసం బేబీ కిట్లు పంపిణీ చేసేవారు. ఎంతో నాణ్యమైన వస్తువులు అందులో ఉండేవి. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కిట్ల పంపిణీ నిలిపివేశారు. ఆయా వస్తువులను కొనుగోలు చేయడానికి పేదలు అదనంగా ఖర్చు చేయాల్సి వస్తోంది.

కిల్లి అపర్ణాదేవి, పెందుర్తి


కిట్‌లే భారమయ్యాయా..

పేద, మధ్య తరగతుల కుటుంబాలు ఎంతో చేశామని వైకాపా ప్రజాప్రతినిధులు గొప్పలు చెబుతున్నారు. శిశువులకు ఎంతో ఉపయోగకరమైన బేబీకిట్‌లను ఎందుకు నిలిపేశారో జగన్‌కే తెలియాలి. ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని చెబుతున్న ముఖ్యమంత్రి జగన్‌కు బేబీ కిట్‌ పంపిణీ భారమైందా. 

శ్రావణి, గృహిణి


ఎంతో ప్రయోజనకరంగా ఉండేవి..

గర్భిణులు ప్రసవం అయిన వెంటనే చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన బేబీ కిట్‌లు ఎంతో ప్రయోజనకరంగా ఉండేవి. శిశువును వెంటనే ఆ కిట్‌లో పెట్టడం వల్ల చల్లదనం నుంచి ఉపశమనం ఉండేది. ప్రభుత్వ ఆసుపత్రులకు ఎక్కువగా పేదవారే వస్తుంటారు. ఇప్పుడు వారంతా అసహనానికి గురవుతున్నారు. జగన్‌ ఇంత మంచి పథకాన్ని ఎందుకు నిలిపేశారో అర్థం కావడం లేదు.

సరస్వతి, ప్రహ్లాదపురం


గొప్పలు చెప్పుకోవడానికే సరిపోతోంది..

వైకాపా ప్రభుత్వం పేదల పక్షపాతి అని గొప్పలు చెప్పుకోవడమే తప్ప వారి మాటలకు, కార్యాచరణకు పొంతన ఉండడం లేదు. తెదేపా ప్రభుత్వం నవజాత శిశువుల సంరక్షణ నిమిత్తం ఎన్టీఆర్‌ బేబీ కిట్లు పథకాన్ని అమలు చేయగా జగన్‌ కరోనా సాకుతో ఈ పథకాన్ని నిలిపేశారు. దీంతో తల్లులు నిరాశ చెందుతున్నారు. ఆర్థిక స్తోమత లేకపోయినా గత్యంతరం లేక బయట కొంటున్నారు.

వెన్నెల అనిత, వెన్నెలపాలెం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని