logo

జగన్‌ ఏలుబడిలో... అంగన్‌వాడీల అగచాట్లు

అయిదేళ్లలో వైకాపా ప్రభుత్వం ఏ వర్గాన్నీ విడిచిపెట్టకుండా చిత్రహింసలకు గురి చేసింది. ఇందులో అంగన్‌వాడీలు పడ్డ ఇబ్బందులు అన్నీఇన్నీ కావు.

Published : 07 May 2024 04:43 IST

ఎన్నడూ లేని విధంగా చిత్రహింసలు
పని భారంతో తప్పని ఇబ్బందులు
న్యూస్‌టుడే, ఎంవీపీకాలనీ

అయిదేళ్లలో వైకాపా ప్రభుత్వం ఏ వర్గాన్నీ విడిచిపెట్టకుండా చిత్రహింసలకు గురి చేసింది. ఇందులో అంగన్‌వాడీలు పడ్డ ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. ఒకవైపు యాప్‌లతో పని భారం, మరోవైపు రాజకీయ వేధింపులు ఎదుర్కొన్నారు. దీంతో న్యాయమైన డిమాండ్ల సాధన కోసం సుమారు 40 రోజుల పాటు వారంతా ఆందోళన బాట పట్టారు. చివరికి ఉద్యోగాల నుంచి తొలగిస్తామంటూ భయభ్రాంతులకు గురి చేసిన తీరుతో సమ్మె విరమించాల్సి వచ్చింది.  ప్రధానంగా ఎఫ్‌ఆర్‌ఎస్‌ విధానం వద్దని చెబుతున్నా యంత్రాంగం మాత్రం కొనసాగించాలని ఒత్తిడి పెంచింది.

ఆందోళన చేస్తున్న అంగన్‌వాడీ ఉద్యోగులు(పాతచిత్రం)

రెండు యాప్‌లు.. ఒకటే సమాచారం: అంగన్‌వాడీల నిర్వహణను పర్యవేక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం ‘పోషణ ట్రాకర్‌’ అనే యాప్‌ను రూపొందించింది. ఇది ఉన్నప్పటికీ వైకాపా సర్కారు అదే సమాచారంతో మరో యాప్‌ను తీసుకొచ్చింది. నిత్యం హాజరు, లబ్ధిదారుల వివరాలు, నిత్యావసరాల సరఫరా, పూర్వ ప్రాథమిక విద్య వంటి అంశాలను ఈ రెండు యాప్‌ల్లో నమోదు చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం వీరికి ఫోన్లను ఇచ్చారు. నిత్యం సాంకేతిక సమస్యలతో ఆయా వివరాలను పొందుపరిచేందుకు ఇబ్బందులు పడుతున్నారు. ఒక యాప్‌నే కొనసాగించాలని కోరినా అధికారులు కనీసం పట్టించుకున్న దాఖలాలు లేవు.

బొమ్మకే ప్రాధాన్యమిచ్చారు: గర్భిణులు, బాలింతలకు కేంద్రాల్లోనే పోషకాహారం వండి వడ్డించాలని బలవంతం పెట్టగా.. సరైన సదుపాయాలు కల్పించకుండా ఎలా అంటూ అంగన్‌వాడీలు వ్యతిరేకించారు. దీంతో తిరిగి టీహెచ్‌ఆర్‌ (టేక్‌ హోమ్‌ రేషన్‌) విధానాన్ని తీసుకొచ్చారు. లబ్ధిదారులకు అందించే నిత్యావసరాల ప్యాకెట్లపై ముఖ్యమంత్రి చిత్రం ఉంచేందుకే ప్రాధాన్యం ఇచ్చారు తప్ప నాణ్యతను మాత్రం గాలికొదిలేశారు. గుడ్లుపై కూడా జగన్‌ బొమ్మ ముద్ర వేయాల్సిందే. కేంద్రానికి వచ్చే గుడ్డులో 5 శాతం పాడవుతున్నా పట్టించుకున్న వారే లేరు. ఇది కూడా వారికి భారంగా మారింది.

  • నిత్యావసరాలు లబ్ధిదారులకు అందించేందుకు పారదర్శకత ఉండాలని చెబుతూ ఎఫ్‌ఆర్‌ఎస్‌ విధానాన్ని తీసుకొచ్చారు. లబ్ధిదారుల ముఖచిత్రం యాప్‌లో పొందుపరిచి నిత్యావసరాలు అందించాల్సి ఉంది. ఇందుకోసం సమయం ఎక్కువ పడుతుందని ఆందోళన బాట పట్టగా, వద్దని చెప్పిన అధికారులు మరోసారి ఎఫ్‌ఆర్‌ఎస్‌ను తప్పనిసరి చేశారు.
  • భోజన నిర్వహణకు బహిరంగ మార్కెట్లో కూరగాయలు, ఆకుకూరలు వంటివి తీసుకొస్తుంటారు. ఆయా ధరలకు అనుగుణంగా చెల్లింపులు చేయకపోవడంతో అంగన్‌వాడీలపై ఆర్థిక భారం పడుతోంది. బిల్లులు కూడా నాలుగైదు నెలలకు గానీ రాని పరిస్థితి. నాడు-నేడు కింద అంగన్‌వాడీ భవనాల నిర్మాణ బాధ్యతను అప్పగించడంతో కేంద్రాల నిర్వహణ సరిగా చేయలేకపోతున్నామని వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా తమకేమీ తెలియదన్నట్లు వ్యవహరిస్తోంది. దీంతో రాబోయే ఎన్నికల్లో ఓటుతో బుద్ధి చెబుతామంటూ వారంతా హెచ్చరిస్తున్నారు.

జిల్లా వ్యాప్తంగా ప్రాజెక్టులు : 3
అంగన్‌వాడీ కేంద్రాలు : 776
గర్భిణులు : 12,485
బాలింతలు : 10,300
3-6 సంవత్సరాల బాలలు : 19,300

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని