logo

ఈ పాలనలో కోత

విజయనగరంలోని ప్రభుత్వ ఈత కొలను గుర్తుందా.. ఉండే ఉంటుంది లెండి.. ఒకప్పుడు మీ పిల్లల్లో కొందరు అక్కడ సాధన చేసేవారే కదా.. ఈ మధ్య అటు వైపు వెళ్లారా.. కనీసం ప్రవేశానికి అనుమతైనా లభించిందా.. లోపలికి వెళ్లాలంటే డబ్బులు అడుగుతున్నారా..

Updated : 25 Apr 2024 04:57 IST

ప్రభుత్వ ఈత కొలను ఆ నేత సొంతం!
న్యూస్‌టుడే, విజయనగరం క్రీడా విభాగం

సాధనకు దూరమైన స్విమ్మర్లు

విజయనగరంలోని ప్రభుత్వ ఈత కొలను గుర్తుందా.. ఉండే ఉంటుంది లెండి.. ఒకప్పుడు మీ పిల్లల్లో కొందరు అక్కడ సాధన చేసేవారే కదా.. ఈ మధ్య అటు వైపు వెళ్లారా.. కనీసం ప్రవేశానికి అనుమతైనా లభించిందా.. లోపలికి వెళ్లాలంటే డబ్బులు అడుగుతున్నారా.. అంటే అవుననే అంటున్నారు నగరవాసులు, క్రీడాభిమానులు. ప్రస్తుతం ఆ స్విమ్మింగ్‌ పూల్‌ ఉప సభాపతి కోలగట్ల ఆసనాలకు అడ్డాగా మారిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆయన అనుచరుల ఈత పోటీలకు నెలవైందని అంటున్నారు.

తంలో విజయనగరం జిల్లాలో స్విమ్మర్లు అరుదుగా కనిపించేవారు. గత ప్రభుత్వం ఈత క్రీడాకారులనూ తీర్చిదిద్దేందుకు నగరంలోని కంటోన్మెంట్‌ ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ ఆక్వా ఈత కొలనును వారికి కేటాయించింది. దీంతో పూల్‌లో మార్పులు, చేర్పులు చేసి ప్రజలకు, విద్యార్థులకు అందుబాటులోకి తెచ్చింది. ఇందుకోసం ఒక శిక్షకుడిని, సహాయకులను నియమించింది. అక్కడితో ఆగకుండా స్విమ్మింగ్‌ పట్ల పిల్లల్లో ఆసక్తిని పెంచేందుకు పలు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. ఫలితంగా క్రీడాకారుల సంఖ్య పెరిగింది. రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో స్విమ్మర్లు తయారయ్యారు. విజయనగరంలోనూ స్విమ్మర్లు ఉన్నారని చాటి చెప్పారు. ఇంతలో ప్రభుత్వం మారింది. అంతే మొత్తం కొలనును అస్తవ్యస్తం చేసేశారు. సాధకులను బయటకు తోసేసి నిర్వహణ బాధ్యతలను ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టేశారు.

12 ఏళ్లు దాటితే రూ.1200..

ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి ఈత కొలను వెళ్లాక క్రీడాకారులకు సాధన చేయడం భారంగా మారింది. ముఖ్యంగా నిరుపేద, మధ్యతరగతి పిల్లలు దూరమయ్యారు. 12 ఏళ్లు దాటిన పిల్లలు నెలకు రూ.1200 చెల్లించాలి. గత ప్రభుత్వం ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదివిన వారికి, జాతీయస్థాయిలో రాణించిన వారికి  కాసింత వెసులుబాటు ఇచ్చేది. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. తెలిసిన వాళ్లు అయితే ఒకలా, తెలియని వారైతే మరోలా ఫీజు వసూలు చేస్తున్నారనే విమర్శలున్నాయి. రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో రాణించిన చాలా మంది ఇప్పుడు అటు వైపు వెళ్లేందుకు ఇష్టపడటం లేదు. క్రీడాశాఖ అధికారి ఎస్‌.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఒప్పంద కాగితాలను పరిశీలించి, క్రీడాకారులు సాధన చేసుకునేలా చూస్తామన్నారు.

ప్రధాన గేటు వద్ద ఏర్పాటు చేసిన ప్రవేశ రుసుం బ్యానర్‌

ఆయన కోసమేనా?

వాస్తవానికి ప్రభుత్వానికి ఆదాయం తెచ్చే క్రీడా విభాగాల్లో ఈ స్విమ్మింగ్‌ పూల్‌ ఒకటి. బయట వ్యక్తులు సాధన నిమిత్తం వచ్చి ఫీజులు చెల్లించేవారు. ప్రస్తుత అధికార పార్టీ నిర్వహణ కష్టంగా ఉందని గతేడాది ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టేసింది. జాతీయ స్విమ్మింగ్‌ డే పేరుతో గతేడాది జులై 18న కోలగట్ల ఈ కొలనులో ఆసనాలు వేశారు.  దీని సమీపంలో ఉన్న వ్యాయామశాలలో వెళ్లాలన్నా అనుమతి ఉండాలి.


ప్రోత్సాహం కరవు..

గత ప్రభుత్వ హయాంలో స్విమ్మింగ్‌ సాధన చేసిన వారిలో సుమారు జిల్లా స్థాయిలో 50 మందికి పైగా ఉండగా, రాష్ట్రస్థాయిలో 15 మంది వరకూ ఉండేవారు. జాతీయస్థాయిలో 5 నుంచి 8 మంది వరకు రాణించేవారు. 2019లో కరోనా సమయంలో ఈ కొలను మూసేశారు. పిల్లలు మాత్రం సాధన ఆపలేదు. చెరువులు, బందలు, వాగులు వద్దకు వెళ్లి సాధన చేస్తూ వచ్చారు. ఆ తరువాత నెమ్మదిగా తెరిచినా వారిని రానివ్వలేదు. తమ పరిస్థితి ఏంటని అడిగితే కొన్ని నిబంధనలు పెట్టారు. తమ డిమాండ్లు వింటేనే సాధనకు రండని చార్ట్‌ చూపడంతో 50 మంది వరకూ ఉండే పిల్లలు ఒక్కసారిగా తగ్గిపోయారు. గత ప్రభుత్వం స్విమ్మింగ్‌ను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో సాధన చేసే పిల్లలకు పోషకాహారం నిమిత్తం నెలకు రూ.1500 చొప్పున ఇచ్చేది. కేవలం స్విమ్మింగ్‌కే కాకుండా, బాక్సింగ్‌, అథ్లెటిక్స్‌, ఫుట్‌బాల్‌ పిల్లలకు సైతం చెల్లించేది. ప్రభుత్వం మారాక ఆ పథకాన్ని పూర్తిగా ఎత్తేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని