logo

గద్దెనెక్కావ్‌.. చెరబట్టావ్‌

ఆయనో పెద్దన్న.. అధికారం.. అహంకారం.. ఆక్రమణలు.. ఒక్కటేమిటి.. అతడు చేయని దౌర్జన్యం లేదు.. ఆవు చేలో మేస్తే.. దూడ గట్టున మేస్తుందా.. అతడి హయాంలో అనుచరులు.. ఆ పార్టీ నాయకులదీ అదే తీరు.. ఈ ఐదేళ్లలో పాలనను.. ప్రజా సమస్యలను పక్కనెట్టి.. తవ్వకాలు, ఆక్రమణలపైనే దృష్టి పెట్టారు.

Updated : 04 May 2024 04:46 IST

వైకాపా హయాంలో చెరువులు మాయం
ఫిర్యాదులు పట్టని అధికారులు
ఈనాడు- విజయనగరం, న్యూస్‌టుడే, విజయనగరం అర్బన్‌

ఆయనో పెద్దన్న.. అధికారం.. అహంకారం.. ఆక్రమణలు.. ఒక్కటేమిటి.. అతడు చేయని దౌర్జన్యం లేదు.. ఆవు చేలో మేస్తే.. దూడ గట్టున మేస్తుందా.. అతడి హయాంలో అనుచరులు.. ఆ పార్టీ నాయకులదీ అదే తీరు.. ఈ ఐదేళ్లలో పాలనను.. ప్రజా సమస్యలను పక్కనెట్టి.. తవ్వకాలు, ఆక్రమణలపైనే దృష్టి పెట్టారు. ముఖ్యంగా నీటి వనరులన్నింటినీ మాయం చేశారు.. చెరువులను, కోనేర్ల రూపే మార్చేశారు.. కప్పేసి.. కబ్జా చేసేశారు. వాటిని అమ్మి రూ.కోట్లు గడించారు.

రాష్ట్రంలో ఉమ్మడి విజయనగరం జిల్లాలోనే చెరువులు అధికం. ఇక్కడ 9,186 ఉన్నాయి. వీటి ద్వారా 3.09 లక్షల ఎకరాల ఆయకట్టు సాగవుతోంది. గత అయిదేళ్లలో పెద్దఎత్తున ఆక్రమణకు గురయ్యాయి. లేఅవుట్లు, భవన నిర్మాణాల సమయంలో కబ్జా చేసేశారు. దాదాపు 5 వేల ఎకరాల వరకు నీటి వనరులు మాయమైనట్లు అధికారులు గుర్తించారు. క్షేత్రస్థాయిలో ఇంకా ఎక్కువగానే ఆక్రమణలే తప్ప.. అభివృద్ధి లేదు.

వైకాపా పాలనలో చెరువుల అభివృద్ధి కలగానే మిగిలింది. ఏటా తప్పనిసరిగా పూడికలు తీయాలి. తెదేపా హయాంలో నీరు-మీరు, నీరు- చెట్టు తదితర పథకాల ద్వారా ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఈ పనులతో నీటి నిల్వ సామర్థ్యం పెరిగి అదనపు ఆయకట్టును స్థిరీకరించారు. ఆక్రమణల తొలగింపు ఇందులో భాగంగా ఉండేది. నీటిపారుదల విభాగం ద్వారా గొలుసుకట్టు కోనేర్లను అభివృద్ధి చేశారు. జగన్‌ ప్రభుత్వం వచ్చాక ఇవన్నీ ఆగిపోయాయి. నాటి పథకాలను ఆపేశారు. కొత్తవీ తీసుకురాలేదు. ఉపాధి పథకం కింద అరకొరగా పూడికలు తీస్తున్నారు. ఇందులో ప్రభుత్వ పాత్ర లేదు.

అందుబాటులోకి 1,111

గ్రామాల్లో పూర్వీకులు, వారి వారసులు, రాజుల కాలాల్లో తవ్విన మంచినీటి చెరువులు నేడు ఉపయోగకరంగా లేవు. వినియోగించక మరుగునపడ్డాయి. గత ప్రభుత్వం ఇలాంటి వాటిని గుర్తించింది. విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో ఏకంగా 1,111 వరకు బాగు చేసి, ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. అంతటా ఆక్రమణలే దర్శనమిస్తున్నాయి.


25 ఎకరాలు మాయం

ఇది గజపతినగరం మండలం కొనిశ గ్రామానికి చెందిన రాజుచెరువు. విస్తీర్ణం 90 ఎకరాలు. ఇందులో 25 ఎకరాల మేర చదును చేసేశారు. వర్షాకాలంలో సమీపంలోని పొలాలు ముంపునకు గురవకుండా గట్లకు గండ్లు సైతం కొట్టేస్తూ అక్కడి ప్రధాన నీటివనరును దెబ్బతీస్తున్నారు. దీని కింద 250 ఎకరాల మేర ఆయకట్టు ఉంది. ప్రస్తుతం శివారు భూములకు నీరు అందడం లేదు. అధికారులు నోటీసులిచ్చినా పట్టించుకోలేదు.


గర్భాలనూ వదల్లేదు

గరివిడి: శివరాంలో రూపుకోల్పోయిన చెరువు

చీపురుపల్లి నియోజకవర్గంలో దాదాపు 1100 వరకు సాగునీటి చెరువులున్నాయి. వీటి కింద సుమారు 8 వేల హెక్టార్లలో పంట సాగవుతోంది. గడిచిన ఐదేళ్లలో పెద్దఎత్తున కనుమరుగయ్యాయి.

  • గరివిడి మండలం చుక్కవలస పరిధిలో 40 ఎకరాల విస్తీర్ణం గల వెదుళ్ల చెరువు గర్భం 5 నుంచి 10 ఎకరాల వరకు కనుమరుగైంది.
  • శివరాంలో 24 ఎకరాల విస్తీర్ణంలో గల లక్ష్మణరావు చెరువులో 9 ఎకరాలు మాయమైంది.
  • గుర్ల మండలం సామాలమ్మ, మెరకముడిదాం మండలం పద్మనాభ సాగరం తదితర వాటి పరిస్థితీ ఇంతే..

న్యూస్‌టుడే, గరివిడి


అతడి అనుచరులే..

భోగాపురం మండలం దల్లిపేటలో అక్రమ తవ్వకాలు

నెల్లిమర్ల నియోజకవర్గంలో ఓ కీలక నేత అనుచరులు చెరువులపై దృష్టిపెట్టారు. అభివృద్ధి పేరుతో చదును చేయడం.. అనంతరం మట్టి తరలింపు.. చివరికి ఆక్రమించి, కట్టడాలు నిర్మించడం.. ఈ ఐదేళ్లూ వారికి ఇదే పని. నెల్లిమర్ల మండలంలో 2011కు ముందు 15 చోట్ల ఆక్రమణలు గుర్తించారు. ఈ ఐదేళ్లలో ఆ సంఖ్య 36కు చేరడం గమనార్హం. ఈ మధ్యకాలంలో కొండగుంపాంలోని 59 ఎకరాల సీతమ్మచెరువులో సుమారు రెండెకరాల్లో ఆక్రమణలు జరిగాయి. రైతులు అడ్డుకోవడంతో వెనక్కి తగ్గారు.

న్యూస్‌టుడే, భోగాపురం


మట్టి తెచ్చి.. చదును చేసి

బొబ్బిలి మండలంలోని పిరిడి గ్రామానికి ఆనుకుని ఉన్న కోనేరును కొందరు కప్పేందుకు యత్నించారు. అధికారులు వెళ్లి హెచ్చరిక బోర్డులు సైతం పెట్టారు. అయినా పట్టించుకోని అక్రమార్కులు చదునుచేసేందుకు ఇతర ప్రాంతాల నుంచి మట్టి తెచ్చి, పోశారు. కొన్నిరోజులుగా మళ్లీ పనులు చేస్తున్నారు.

న్యూస్‌టుడే, బొబ్బిలి గ్రామీణం


గట్లపై దుకాణాలే వెలిశాయ్‌..

విజయనగరం మండలం సారిక రెవెన్యూ రామనారాయణం ఆలయానికి వెళ్లే మార్గంలో ఉన్న ఎర్రబందను అధికార పార్టీ నాయకుల అండతో కొందరు ఆక్రమించుకుంటున్నారు. బందకు ఒక వైపున్న రోడ్డు పక్కన తాత్కాలికంగా దుకాణాలు ఏర్పాటు చేసుకొని, క్రమేనా చదును చేస్తున్నారు. అధికారుల దృష్టికి వెళ్లినా.. వారు ముందుకు రాలేదు.

న్యూస్‌టుడే, విజయనగరం గ్రామీణం


మింగేస్తున్నారు..

బొబ్బిలి పట్టణంలోని పలు చెరువులు ఆక్రమణకు గురవుతున్నాయి. రెవెన్యూ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారు. విలువైన భూములు అన్యాక్రాంతమవుతున్నాయి. స్థానికంగా 200 ఎకరాల్లో ఉన్న కోటిచెరువు కనుమరుగవుతోంది. 30 ఎకరాల్లో ఆనవాళ్లు కోల్పోయినట్లు అధికారులు గుర్తించారు. ఈ వనరు ద్వారానే పట్టణంలోని పలు వీధులకు చెందిన వారికి తాగు, సాగునీటి అవసరాలు తీరుతాయి. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు.

న్యూస్‌టుడే, బొబ్బిలి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని