logo

విమానాశ్రయం.. మరింత ఆలస్యం!!

హైదరాబాద్‌ తర్వాత రాష్ట్రంలోనే అతిపెద్ద నగరంగా, సాంస్కృతిక రాజధానిగా పేరు పొందిన ఓరుగల్లుకు విమానాశ్రయం కలగానే మిగులుతోంది. ఇదిగో అదిగో అంటూ కాలయాపనే కానీ, విమానాలు ఎగిరేందుకు మోక్షమెప్పుడు కలుగుతుందో తెలియని పరిస్థితి.

Published : 30 May 2023 05:36 IST

మరో 253 ఎకరాలు అవసరమంటున్న యంత్రాంగం
ఉన్న భూమిలోనే ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వం

హైదరాబాద్‌ తర్వాత రాష్ట్రంలోనే అతిపెద్ద నగరంగా, సాంస్కృతిక రాజధానిగా పేరు పొందిన ఓరుగల్లుకు విమానాశ్రయం కలగానే మిగులుతోంది. ఇదిగో అదిగో అంటూ కాలయాపనే కానీ, విమానాలు ఎగిరేందుకు మోక్షమెప్పుడు కలుగుతుందో తెలియని పరిస్థితి. తాజాగా వరంగల్‌ కలెక్టర్‌ ప్రావీణ్య మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావును కలిసి మరో 253 ఎకరాల భూసేకరణ చేపట్టేందుకు అనుమతివ్వాలని కోరారు. ఇప్పుడున్న భూమికి అదనంగా సేకరణ జరిపితేనే బోయింగ్‌ లాంటి పెద్ద విమానాలు ఎగిరేందుకు సాధ్యమవుతుందని వివరించారు. మరింత భూమి కావాలని ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా కోరినట్టు సమాచారం. పర్యాటకంగా ఎంతో ప్రసిద్ధి చెందిన వరంగల్‌కు విమానాశ్రయం లేకపోవడం ఈ ప్రాంత అభివృద్ధికి పెద్ద అడ్డంకి అని చెప్పాలి. ఎప్పటికప్పుడు విమానాశ్రయం ప్రస్తావన తెరపైకి వస్తోందే కానీ, ఏర్పాటులో ముందడుగు పడకపోవడంతో ఈ ప్రాంతంలో ప్రజలు నిరాశ చెందుతున్నారు.

పెద్ద రన్‌వే కోసం..

వరంగల్‌ మామునూరు విమానాశ్రయాన్ని ‘ఉడాన్‌’ పథకం కింద ఉన్న స్థలంలోనే అనుమతించాలని గతేడాది రాష్ట్ర ప్రభుత్వం ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియాను కోరింది. మామునూరులో 670 ఎకరాల విమానాశ్రయ స్థలం అందుబాటులో ఉంది. 1970-77 మధ్య వాయిదూత్‌ విమానాలు ఇక్కడ నడిచాయి. మూడేళ్ల క్రితం ముఖ్యమంత్రి కేసీఆర్‌ హస్తినకు వెళ్లినప్పుడు విమానాశ్రయం మంజూరు చేయాలని కోరారు. భారత విమానాశ్రయ ప్రాధికార సంస్థ రెండేళ్ల కిందట స్థానికంగా మట్టి నమూనా సేకరించి.. పరీక్షలు కూడా చేపట్టింది. గతేడాది ఉడాన్‌ పథకంలో భాగంగా పర్యాటక ప్రాంతాల సమీపంలో ఉన్న పాత విమానాశ్రయాలను(బ్రౌన్‌ ఫీల్డ్‌) పునరుద్ధరించేందుకు కేంద్రం ముందుకు వచ్చింది. వరంగల్‌ను ఆ జాబితాలో చేర్చి అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. మొదటి దశ కింద సమగ్ర ప్రాజెక్ట నివేదిక (డీపీఆర్‌) రూపొందించి ఇవ్వాలని కూడా ఎయిర్‌పోర్ట్‌ అథారిటీని కోరినట్లు సమాచారం. కానీ ఇప్పుడు బోయింగ్‌ లాంటి పెద్ద విమానాలు తిరగాలంటే, పెద్ద రన్‌వే కోసం అదనంగా భూసేకరణ కావాలనే ప్రతిపాదన తెరపైకి వచ్చింది.

ఎంతో అభివృద్ధి

రామప్ప ఆలయానికి వారసత్వ గుర్తింపు లభించింది. ఇప్పటికే వరంగల్‌ స్మార్ట్‌సిటీగా అభివృద్ధి చెందుతోంది. ఐటీ పరిశ్రమలు నెమ్మదిగా వస్తున్నాయి. ఓరుగల్లు నుంచి దేశీయంగా విమాన ప్రయాణికులు గణనీయంగా పెరిగిన నేపథ్యంలో ఇక్కడ విమానాశ్రయం ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది. ఎయిర్‌పోర్టు రావడం వల్ల అభివృద్ధి శరవేగంగా జరిగే వీలుంది. వరంగల్‌ చుట్టూ అనేక ప్రాజెక్టులు వస్తున్నాయి. దేశంలోనే అతిపెద్ద సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి సాకారం కానుంది. వరంగల్‌లో 1200 ఎకరాల భూమి ఇస్తే పూర్తి స్థాయిలో ఎయిర్‌పోర్టును అభివృద్ధి చేస్తామని ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్‌ ఇండియా అధికారులు గతంలో చెప్పారు.

చొరవ చూపితేనే..

రెవెన్యూ అధికారులు గూగుల్‌ మ్యాప్‌ ఆధారంగా సర్వే కూడా చేశారు. స్థానిక నాయకులు దీనిపై దృష్టి పెట్టి ప్రత్యేక సమీక్ష సమావేశం చేపట్టలేదు. ఎయిర్‌పోర్టు ఏర్పాటుకు కేంద్రం ఎలా ఉంది? రాష్ట్ర ప్రభుత్వం మొదటి ప్రాధాన్యం ఇచ్చేలా ప్రతిపాదనలు సిద్ధం చేసి, వెంటనే భూసేకరణ చేపట్టేందుకు నిధులను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసేలా చొరవ చూపాలి. అప్పుడే విమానాశ్రయం కల సాకారమవుతుంది. కానీ ఏడాదికోసారి సాదాసీదాగా సమీక్షలు నిర్వహించి వదిలేస్తే మరికొన్నేళ్లయినా మామునూరులో విమానాశ్రయం పునరుద్ధరణ కాదనే చెప్పాలి.

ఎప్పుడేం జరిగిందంటే?

* 2007లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎయిర్‌పోర్టు ఆథారిటీ ఆఫ్‌ ఇండియాతో ఎంవోయూ కుదుర్చుకున్నాయి. అభివృద్ధి కోసం నీరు, విద్యుత్తు, రోడ్లు, ఇతర సౌకర్యాలను రాష్ట్ర ప్రభుత్వం కల్పించాల్సి ఉంది.

* 2007-08లో వరంగల్‌్, కడప విమానాశ్రయాల అభివృద్ధికి రూ.6 కోట్లు మంజూరయ్యాయి.

* 2008లో మామునూరు రన్‌వేను ఎయిర్‌పోర్టు ఆథారిటీ ఆఫ్‌ ఇండియా అధికారులు సందర్శించారు.

* 2008-09లో హైదరాబాద్‌, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, రాజమండ్రి, కడప, వరంగల్‌ విమానాశ్రయాల అభివృద్ధి కోసం రూ.59 కోట్లు మంజూరు చేసింది.

* 2020 - ఏఏఐ వరంగల్‌లో మట్టి నమూనాలు సేకరించింది. వాతావరణం అనుకూలంగా ఉన్నట్టు తేలింది.

* 2022 - రాష్ట్ర ప్రభుత్వం ఉడాన్‌ పథకం కింద ఉన్న స్థలంలో విమానాశ్రయం ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని కోరింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని