logo

మోరంచపల్లి.. గట్టెక్కే మార్గమిది!

వరద సృష్టించిన బీభత్సం జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి మండలం మోరంచపల్లి గ్రామాన్ని కోలుకోలేని దెబ్బతీసింది. ప్రజలు సర్వస్వం కోల్పోయారు.

Updated : 08 Aug 2023 04:40 IST

విలయానికి ఈ ఇల్లే సాక్ష్యం

వరద సృష్టించిన బీభత్సం జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి మండలం మోరంచపల్లి గ్రామాన్ని కోలుకోలేని దెబ్బతీసింది. ప్రజలు సర్వస్వం కోల్పోయారు. మోరంచ వాగుతో ఈ గ్రామానికి భవిష్యత్తులోనూ ముంపు పొంచి ఉంది. ఏటా ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని బతుకుతున్నామని గ్రామస్థులు భయాందోళన చెందుతున్నారు. తమకు శాశ్వత పరిష్కారం చూపించాలని వేడుకుంటున్నారు..

ఆ రోజు లెక్క.. 1.44 లక్షల క్యూసెక్కులు

మోరంచపల్లి వద్ద నిర్మించిన రెండు వంతెనల ద్వారా 60 వేల క్యూసెక్కుల లోపు వరద మాత్రమే ప్రవహిస్తుంది. గత నెల 27వ తేదీన ఏకంగా 1.44 లక్షల క్యూసెక్కుల ప్రవాహం వచ్చిందని అంచనా. వరద ఉద్ధృతి ఎక్కువ కావడంతో బయటకు వెళ్లలేక ప్రవాహం దిశ మార్చుకుని గ్రామంపైకి వచ్చింది.

ఈనాడు డిజిటల్‌, జయశంకర్‌ భూపాలపల్లి

వంతెనలు చిన్నవి కావడంతోనే..

మోరంచపల్లి సమీపంలో వాగుపై నిర్మించిన వంతెన చిన్నగా ఉంటుంది. గతంలో ఉన్న రోడ్డుకంటే జాతీయ రహదారి 353సి ని ఆరడుగులపైగా ఎత్తు పెంచారు. దీంతో పైనుంచి వచ్చిన వరద.. వంతెన, రోడ్డు వైపు పోటెత్తి మోరంచపల్లి వైపు మరలుతుంది. వంతెన ఎత్తుగా, రోడ్డు కిందకు ఉన్నా ఇంత ప్రమాదం జరిగి ఉండేది కాదు. గతంలో వంతెన కాకుండా రోడ్‌డ్యాం ఉండేది. ఎంత వరద వచ్చినా సాఫీగా వెళ్లేదని.. వంతెనను చిన్నగా నిర్మించడంతో ఈ సమస్య తలెత్తిందని గ్రామస్థులు చెబుతున్నారు. దీనికి సమీపంలోనే మరో చిన్న  వంతెన కూడా ఉంది. గతంలోనే ఈ రెండింటిని కలిపి పెద్దగా నిర్మించి ఉంటే మోరంచపల్లికి వరద వచ్చేది కాదని వివరించారు.

ఇలా చేస్తే మేలు..

  • ప్రస్తుతం ఉన్న రెండు వంతెనలు కలిపి ఒకటే పెద్దగా నిర్మించాలి. ప్రస్తుతం ఉన్నదాని కంటే ఎత్తుగా, పిల్లర్లు వేసి నిర్మాణం చేయాలి.
  • వరద గ్రామంలోకి రాకుండా కరకట్టలు నిర్మించాలి.
  • లోతట్టు ప్రాంతాల వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలి.
  • వరద అంచనా వేయడానికి గేజ్‌ లెవల్‌ను ఏర్పాటు చేయాలి.

వంతెన ఎత్తు పెంచాలి

మోరంచ వాగుపై ఉన్న వంతెన ఎత్తు తక్కువ ఉండటంతో గ్రామం వరద బారినపడింది. పైన ఉన్న గణపురం, రామప్ప చెరువులు మత్తళ్లు పోసినా.. అటువైపుగా ఉన్న చెరువులు ఎప్పుడు కట్టలు తెగినా మోరంచపల్లికి తీవ్ర నష్టం తప్పదు. ఈసారి 10 అడుగులకు పైగా ఎత్తులో వరద వచ్చింది. మోరంచవాగుపై నిర్మించిన వంతెన చిన్నగా ఉండటమే దీనికి కారణం. మోరంచవాగుపై ఉన్న వంతెనను ఎత్తు పెంచి, పెద్దగా నిర్మించడమో లేదా గ్రామస్థులను సురక్షిత ప్రాంతానికి తరలించడమో సత్వరమే చేయాలి.

బండ లింగారెడ్డి

సురక్షిత ప్రాంతానికి తరలించాలి

మోరంచ వాగు ఉప్పొంగి మా ఊరు కొట్టుకుపోయింది. ఇదే మొదటిసారి కాదు.. గతంలోనూ ఇలాగే జరిగింది. మోరంచపల్లిని సురక్షిత, ఎత్తైన ప్రాంతానికి తరలించాలి.

ములకనూరి రాజు

సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం

మోరంచపల్లి వాసుల సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తున్నాం. ఆరోజు అధిక వర్షాలు కురవడం, ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద రావడంతో ప్రమాదం సంభవించింది. ఆనాడు తెల్లవారుజామున 3:30 గంటలకు పోలీసులు పెట్రోలింగ్‌కు వెళ్లినప్పుడు ఎలాంటి వరద లేదు. 4 గంటలకు వరద ఆకస్మాత్తుగా గ్రామాన్ని ముంచెత్తింది. ఇక్కడ లోతట్టు ప్రాంతాల్లోని చెంచు కాలనీ వాసులు రెండు పడక గదుల ఇళ్లు కావాలని అడిగారు. వారికి కేటాయిస్తాం. ఇంకా ఎవరైనా అక్కడి నుంచి వెళ్లాలనుకునే వారు మా దృష్టికి తీసుకురావొచ్చు. ఊరిని ఖాళీ చేయించడం అంటే ఇళ్లు ఒకటే ఇస్తే సరిపోదు. వారికి ఉపాధి, జీవించడానికి కావాల్సిన ఇతర అవసరాలు కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఇటీవల కేంద్ర బృందం గ్రామాన్ని, అక్కడి వాగుపై నిర్మించిన వంతెనను సందర్శించింది. బాధితులు వారి సమస్యలను బృందం దృష్టికి తీసుకెళ్లారు.

భవేశ్‌ మిశ్రా, కలెక్టర్‌ జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా

మోరంచ వాగుపై నిర్మించిన వంతెన..

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని