logo

మూత్రపిండం.. విఫలమైతే ప్రాణగండం

మన శరీరంలో మూత్రపిండాలు అత్యంత ముఖ్యమైన అవయవాలు. శరీరంలోని వ్యర్థాలను శుద్ధిచేసి మనల్ని ఆరోగ్యంగా ఉంచడంలో ఇవి ఉపయోగపడతాయి. మూత్రాన్ని ఉత్పత్తి చేయడంలో, రక్తంలోని అనేక మూలకాల స్థాయిలను, రక్తపోటును నియంత్రించడంలో సహాయపడతాయి.

Published : 14 Mar 2024 05:20 IST

న్యూస్‌టుడే, ఎంజీఎం ఆసుపత్రి

మన శరీరంలో మూత్రపిండాలు అత్యంత ముఖ్యమైన అవయవాలు. శరీరంలోని వ్యర్థాలను శుద్ధిచేసి మనల్ని ఆరోగ్యంగా ఉంచడంలో ఇవి ఉపయోగపడతాయి. మూత్రాన్ని ఉత్పత్తి చేయడంలో, రక్తంలోని అనేక మూలకాల స్థాయిలను, రక్తపోటును నియంత్రించడంలో సహాయపడతాయి. మూత్రపిండం పూర్తిగా విఫలమైతే కృత్రిమంగా రక్తాన్ని శుద్ధి చేసుకోక తప్పదు. నిర్లక్ష్యం చేస్తే ప్రాణగండమే.

ఉమ్మడి జిల్లాలో ఏటా మూత్రపిండాల రోగ బాధితులు పెరిగిపోతుండగా వారికి తగిన రక్తశుద్ధి సేవలు లేకపోవడం ఆందోళన కలిగించే అంశం. నేడు ప్రపంచ కిడ్నీ డే సందర్భంగా ‘న్యూస్‌టుడే’ అందిస్తున్న ప్రత్యేక కథనం.

రక్తంలోని వ్యర్థాలను నిరంతరం వడకడుతూ మూత్రపిండాలు మన శరీరంలో అత్యంత కీలకమైన పాత్రపోషిస్తుంటాయి. వీటిని జాగ్రత్తగా కాపాడుకోవడం అవసరం.  రాత్రి పూట ఎక్కువ సార్లు మూత్రానికి వెళ్లాల్సి రావడం, రంగుమారడం, రక్తం పడటం,  కాళ్లవాపులు, కాళ్లలో నీరు చేరడం, శరీరంపై దురద, చర్మం నల్లబడటం, గోళ్లు తెల్లబడటం, జుట్టు రాలిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుల్ని సంప్రదించి చికిత్స పొందాలి. ఒకసారి మూత్రపిండం విఫలమైందంటే దాన్ని పూర్తిగా నయం చేయడం కష్టం. ఆసుపత్రులకు నిత్యం వెళ్లి రక్తశుద్ధి చేయించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచిత డయాలసిస్‌ సేవలు ఉన్నా.. ప్రైవేటు ఆసుపత్రుల్లో నెలకు రూ.20 వేలకు పైగా ఖర్చు చేయాల్సి వస్తుంది.

ఉమ్మడి వరంగల్‌ జిల్లాతోపాటు, పక్కనున్న కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌, హుస్నాబాద్‌, ఖమ్మం జిల్లా, భద్రాద్రికొత్తగూడెం జిల్లాల నుంచి అత్యవసర రోగులు వరంగల్‌ ఎంజీఎం ఆసుపత్రికి వస్తుంటారు.

ఎంజీఎం ఆసుపత్రిలో రోగులకు రక్తాన్ని శుద్ధి చేస్తున్న టెక్నీషియన్లు

రక్తశుద్ధి సేవలు పెరగాలి..

ఎంజీఎం ఆసుపత్రిలో 14 పడకల వార్డు ఉండగా ప్రతి రోజు మూడు షిప్టుల్లో 130 మందికి డయాలసిస్‌ సేవలందిస్తున్నారు. పడకలు సరిపోక ప్రతి రోజు 20 నుంచి 30 మంది రోగులు వెనక్కి వెళ్లిపోవాల్సి వస్తోంది.  మరో 6 పడకలు పెంచాలని నిర్ణయించినా ఇంకా అందుబాటులోకి రాలేదు.  విషం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వారికి డయాలసిస్‌ చేయాల్సి ఉంటుంది. ఎంజీఎంకు ప్రతి రోజు 5 నుంచి 10 మంది రోగులు ఇలాంటి వారు వస్తున్నారు. వారికి అత్యవసర డయాలసిస్‌ చేయాలంటే ఎంజీఎం నుంచి కేఎంసీలోని సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రికి  తీసుకెళ్లాల్సి వస్తోంది. ఏమాత్రం ఆలస్యమైనా రోగి ప్రాణాలమీదకు వస్తోంది. ఎంజీఎం అత్యవసర విభాగంలో రెండు మూడు డయాలసిస్‌ పడకలు ఏర్పాటు చేసినట్లయితే రోగుల ప్రాణాలు నిలిచే అవకాశముంది. ములుగు జిల్లా ఆసుపత్రిలో ఇప్పటి వరకు డయాలసిస్‌ కేంద్రం ప్రతిపాదన అమలు కాలేదు. మహబూబాబాద్‌ జిల్లా ఆసుపత్రిలో 5 పడకల డయాలసిస్‌ వార్డు ఉంది. ప్రతి రోజు 15 మందికి సేవలందిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న పడకలు సరిపోక 37 మంది రోగులు వెయిటింగ్‌లో ఉన్నారు. మరో 5 పడకలు పెంచాలని ప్రతిపాదన ఉంది.

ఉమ్మడి జిల్లాలో ఉన్న డయాలసిస్‌ సేవలు

పడకలు  రోగులు(ప్రతి రోజు)
వరంగల్‌ ఎంజీఎం      
14 130
కేఎంసీˆ సూపర్‌స్పెషాలిటీ  
10  25
నర్సంపేట            
5 18
జనగామ
10 27
ఏటూరునాగారం        
3 10
మహబూబాబాద్‌        
5  15
జఫర్‌గఢ్‌            
5 8


జాగ్రత్తలు తీసుకోవాలి

- డాక్టర్‌ కుమారస్వామి, నెఫ్రాలజిస్టు , కేఎంసీˆ సూపర్‌స్పెషాలిటీ ఆసుపత్రి

అధిక రక్తపోటు, మధుమేహం, వంశపారంపర్య చరిత్ర ఉన్నవారు తరచుగా కిడ్నీ పని తీరు పరీక్షలు చేయించుకోవాలి. రక్తపోటు, మధుమేహం అదుపులో ఉంచుకోవాలి. నొప్పి నివారణ మాత్రలు వైద్యుడి సలహా లేకుండా వాడరాదు.  రక్తంలో సిరమ్‌ క్రియాటిన్‌ పరీక్ష, యూరియా శాతం తెలుసుకునేందుకు బ్లడ్‌ యూరియా పరీక్ష తరచుగా చేయించుకోవాలి. మధుమేహం, రక్తపోటు పరీక్షలు తరుచుగా చేయించుకుంటూ అవి ఆదుపులో ఉండేలా జాగ్రత్తపడాలి.?

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని