logo

అక్రమ వ్యాపారాలపై ప్రత్యేక నిఘా

జిల్లాలో అక్రమ వ్యాపారాలపై పోలీసు యంత్రాంగం ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు ఎస్పీ సుధీర్‌ రాంనాథ్‌ కేకన్‌ అన్నారు.

Published : 29 Mar 2024 05:56 IST

నెహ్రూసెంటర్‌, న్యూస్‌టుడే: జిల్లాలో అక్రమ వ్యాపారాలపై పోలీసు యంత్రాంగం ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు ఎస్పీ సుధీర్‌ రాంనాథ్‌ కేకన్‌ అన్నారు. ప్రజల సహకారంతో జిల్లాలో గంజాయి, బెల్లం, రేషన్‌ బియ్యం, ఇసుక అక్రమ రవాణా కట్టడి, అక్రమ వ్యాపారాల నివారణతో పాటు సైబర్‌ నేరాలు, మహిళల రక్షణకు పోలీస్‌ శాఖ తీసుకుంటున్న చర్యలను ఆయన ‘న్యూస్‌టుడే’ ముఖాముఖిలో వివరించారు.


న్యూస్‌టుడే: గంజాయి, గుడుంబా, నిషేధిత బెల్లం, అక్రమ రవాణా జిల్లాలో కొనసాగుతోంది. అరికట్టేందుకు ఏమి చర్యలు తీసుకుంటున్నారు.? 
ఎస్పీ: జిల్లాలో అక్రమ వ్యాపారాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశాం. ఐదేళ్ల నుంచి అక్రమ వ్యాపారాలకు పాల్పడుతున్న వారి వివరాలను సేకరిస్తున్నాం. ప్రతి పీఎస్‌ పరిధిలో గుర్తించి తొలుత కౌన్సెలింగ్‌ నిర్వహిస్తున్నాం. నల్లబెల్లం, గుడుంబా, రేషన్‌ బియ్యం వంటి అక్రమ వ్యాపారాలకు పాల్పడే వారిని బైండోవర్‌ చేశాం. అవసరమైతే పీడీ చట్టం కేసులు నమోదు చేస్తున్నాం.


న్యూస్‌టుడే: గంజాయి రవాణా నిరోధించడమెలా?
ఎస్పీ: జిల్లాలో గంజాయి సాగు తగ్గింది. ఇతర జిల్లా, రాష్ట్రాల నుంచి రవాణా అవుతుందనే సమాచారం ఉంది. గంజాయితో కలిగే అనర్థాలను యువతకు తెలియజేసేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తాం. రాష్ట్ర ప్రభుత్వం మత్తు పదార్థాల నిషేధంపై ప్రత్యేక దృష్టి సారించింది. గంజాయి రవాణా కాకుండా ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తున్నాం. గంజాయి రవాణా చేసిన వారికి ఇటీవల న్యాయస్థానం జైలు శిక్ష విధించింది.


న్యూస్‌టుడే: లోక్‌సభ ఎన్నికలకు పోలీస్‌శాఖ సన్నద్ధత ఎలా ఉంది.
ఎస్పీ: లోక్‌సభ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా పోలీసు శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. జిల్లాలో ఏడు చెక్‌పోస్టులను నెలకొల్పాం. ప్రజలు నిర్భయంగా ఓటుహక్కు వినియోగించుకునేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. అభ్యర్థుల నామినేషన్‌ నుంచి కౌంటింగ్‌ పూర్తయ్యేవరకు పకడ్బందీగా బందోబస్తు నిర్వహిస్తాం. జిల్లాలో 96 రూట్‌లలో 773 పోలింగ్‌ కేంద్రాలున్నాయి. ఇప్పటి వరకు ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా అభివృద్ధి పనులు చేస్తున్న ఒకరిపై కేసు నమోదు చేశాం. కారులో తరలిస్తున్న రూ.3.60లక్షలు స్వాధీనం చేసుకున్నాం.


న్యూస్‌టుడే: ప్రభుత్వ భూములు కబ్జాకు గురవుతున్నాయనే ఆరోపణలున్నాయి. కట్టడికి ఏమైనా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారా..?
ఎస్పీ: ప్రభుత్వ భూములు ఆక్రమిస్తే సహించేది లేదు. కబ్జాకు పాల్పడిన వారిపై రౌడీషీట్‌తోపాటు అవసరమైతే పీడీ చట్టం కేసు నమోదు చేస్తాం. గతంలో కబ్జాకు గురైన భూములపై విచారణ జరుగుతోంది. కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లి ప్రభుత్వ భూములను పరిరక్షించే విధంగా తగిన చర్యలు తీసుకుంటాం.


న్యూస్‌టుడే: సైబర్‌ నేరాల సంఖ్య పెరుగుతోంది. వీటి నిరోధానికి ప్రజల్లో అవగాహన కలిగిస్తున్నారా?
ఎస్పీ: జిల్లాలో సైబర్‌ నేరాల బారిన పడకుండా ఉండేందుకు ప్రజలకు అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నాం. పోలీస్‌ కళాబృందాలు, షీటీం చేత పాఠశాల, కళాశాలలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. నేరాలకు గురైన వారు వెంటనే 1930 సైబర్‌ క్రైమ్‌ టోల్‌ ఫ్రీ నెంబర్‌కు ఫిర్యాదు చేయాలి. అవసరమైతే సంబంధిత ఠాణాలో సంప్రదించాలి.


న్యూస్‌టుడే: ఎస్పీగా ఏ అంశానికి ప్రాధాన్యమిస్తున్నారు?
ఎస్పీ: జిల్లాలో అక్రమ దందాలను అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటాం. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఉపేక్షించం. ప్రతి పౌరుడు పోలీసుగా భావించాలి. నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకునేలా ప్రజల్లో అవగాహన కల్పిస్తాం. లోక్‌సభ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేలా ప్రజలు, రాజకీయ నాయకులు సహకరించాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని