logo

కాంగ్రెస్‌ జనజాతర సభకు సర్వం సిద్ధం

లోక్‌సభ ఎన్నికల్లో అభ్యర్థుల విజయమే లక్ష్యంగా కాంగ్రెస్‌ పార్టీ అడుగులు వేస్తోంది. గిరిజనులకు రిజర్వు అయిన మహబూబాబాద్‌ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్‌ అభ్యర్థి పోరిక బలరాంనాయక్‌ నామినేషన్‌ సందర్భంగా శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్‌ మైదానంలో నిర్వహించనున్న కాంగ్రెస్‌ జనజాతర బహిరంగ సభకు టీపీసీసీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హాజరు కానున్నారు.

Published : 19 Apr 2024 04:20 IST

నేడు మానుకోటకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి 

మహబూబాబాద్‌లో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన సందర్భంగా స్థానిక ఎన్టీఆర్‌ మైదానంలో సిద్ధం చేస్తున్న వేదిక

మహబూబాబాద్‌, న్యూస్‌టుడే: లోక్‌సభ ఎన్నికల్లో అభ్యర్థుల విజయమే లక్ష్యంగా కాంగ్రెస్‌ పార్టీ అడుగులు వేస్తోంది. గిరిజనులకు రిజర్వు అయిన మహబూబాబాద్‌ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్‌ అభ్యర్థి పోరిక బలరాంనాయక్‌ నామినేషన్‌ సందర్భంగా శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్‌ మైదానంలో నిర్వహించనున్న కాంగ్రెస్‌ జనజాతర బహిరంగ సభకు టీపీసీసీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హాజరు కానున్నారు. రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి పదవి చేపట్టాక తొలిసారిగా జిల్లాకు వస్తున్నందున ఈ సభను భారీగా నిర్వహించేందుకు పార్టీ నేతలు సన్నాహాలు చేస్తున్నారు. డీసీసీ అధ్యక్షుడు జెన్నారెడ్డి భరత్‌చంద్‌రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ అభ్యర్థి పోరిక బలరాంనాయక్‌, స్థానిక ఎమ్మెల్యే భూక్యా మురళీనాయక్‌ పర్యవేక్షణలో ఈ సభను విజయవంతం చేసేందుకు ఏర్పాట్లు చేపట్టారు. లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని ఏడు శాసనసభ నియోజకవర్గాల్లోని ఆరు స్థానాల్లో గిరిజన ఎమ్మెల్యేలున్నారు. సభ నిర్వహణపై రాష్ట్ర వ్యవసాయ శాఖమంత్రి, పార్లమెంట్‌ నియోజకవర్గ కాంగ్రెస్‌ ఇన్‌ఛార్జి తుమ్మల నాగేశ్వర్‌రావు జిల్లా కేంద్రంలోని డీసీసీ కార్యాలయంలో రెండు రోజులుగా ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులతో సమీక్ష నిర్వహించారు. సాయంత్రం నాలుగు గంటలకు జరిగే సీఎం సభకు జన సమీకరణ బాధ్యతలను ఎమ్మెల్యేలకు అప్పగించారు. సుమారు లక్ష మందికి పైగా కార్యకర్తలు, పార్టీ అభిమానులను తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ముఖ్య సలహాదారు వేం నరేందర్‌రెడ్డి సభ స్థలాన్ని పరిశీలించారు. శుక్రవారం ఉదయం కాంగ్రెస్‌ అభ్యర్థి పోరిక బలరాంనాయక్‌ తమ కుటుంబ సభ్యులతో కలిసి కలెక్టరేట్‌లో నామపత్రం దాఖలు చేేయనున్నారు. సాయంత్రం నాలుగు గంటలకు స్థానిక ఎన్టీఆర్‌ మైదానంలో జనజాతర సభ్చ నిర్వహించనున్నారు. ఎండ తీవ్రతకు ప్రజలకు ఇబ్బంది కలగకుండా షామియానాలు వేయించారు. తాగునీటి సౌకర్యం ఏర్పాటు చేశారు. సభకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, సీఎం ముఖ్యసలహాదారు వేం నరేందర్‌రెడ్డి, పార్లమెంట్‌ నియోజకవర్గ ఇన్‌ఛార్జి, మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు, మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క, పార్లమెంట్‌ స్థానం పరిధిలోని ఏడుగురు ఎమ్మెల్యేలు, పాలకుర్తి, వరంగల్‌ పశ్చిమ ఎమ్మెల్యేలు యశస్వినిరెడ్డి, నాయిని రాజేందర్‌రెడ్డి, కాంగ్రెస్‌ ముఖ్య నాయకులు హాజరవుతున్నారు. ఎన్టీఆర్‌ స్టేడియం పక్కనే రామచంద్రాపురం కాలనీ సమీపంలోని ఖాళీ స్థలంలో హెలిప్యాడ్‌ను సిద్ధం చేశారు. ఎస్పీ ఆధ్వర్యంలో పోలీసులు భారీ బందోబస్తు చేపట్టారు.

ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి తుమ్మల

జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్‌ మైదానంలో శుక్రవారం నిర్వహించే బహిరంగ సభ ఏర్పాట్లను వ్యవసాయ శాఖమంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు గురువారం పరిశీలించారు. సభ నిర్వహణపై పలు సూచనలు చేశారు. మహబూబాబాద్‌ డీసీసీ అధ్యక్షుడు జెన్నారెడ్డి భరత్‌చంద్‌రెడ్డి, ఎమ్మెల్యే భూక్యా మురళీనాయక్‌, ఎంపీ అభ్యర్థి పోరిక బలరాంనాయక్‌, యువజన కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు అయ్యప్పరెడ్డి తదితరులున్నారు.

సోనియా రుణం తీర్చుకోవాలి

ఇల్లెందు: పార్లమెంట్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థులను గెలిపించి తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన పార్టీ అగ్రనేత సోనియాగాంధీ రుణం తీర్చుకోవాలని వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు. ఇల్లెందు పట్టణంలో గురువారం స్థానిక నేతలతో కలిసి మహబూబాబాద్‌ పార్లమెంట్‌ స్థాయి కాంగ్రెస్‌ మహిళా నాయకులు, నియోజకవర్గ ముఖ్య నేతల సమావేశం నిర్వహించారు. తుమ్మల మాట్లాడుతూ మహబూబాబాద్‌ ఎంపీ అభ్యర్థిగా బలరాంనాయక్‌ శుక్రవారం నామినేషన్‌ వేయనున్నారని, లక్ష మందితో నిర్వహించే ప్రదర్శనకు నియోజకవర్గం నుంచి అధిక సంఖ్యలో ప్రజలు హాజరయ్యేలా ఎమ్మెల్యే, పురపాలక ఛైర్మన్‌ బాధ్యత తీసుకోవాలన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని