logo

కడుపులోనే కరిగించేస్తున్నారు..!

అన్ని రంగాల్లో దూసుకెళ్తున్న ఆడపిల్లలను బాధ్యతగా చూసుకోవాల్సిన వారు బరువుగా భావిస్తున్నారు. గర్భం దాల్చిన కొద్ది రోజులకే పుట్టబోయేది ఆడా.. మగా అని తెలుసుకుని కడుపులోనే కరిగించేస్తున్నారు.

Updated : 21 Apr 2024 06:44 IST

సంచార స్కానింగ్‌ యంత్రాలతో లింగనిర్ధారణ
ఆందోళన కలిగిస్తున్న భ్రూణ హత్యలు

ఈనాడు, మహబూబాబాద్‌, న్యూస్‌టుడే, మహబూబాబాద్‌, ఎంజీఎం ఆసుపత్రి

ఇది మొబైల్‌ స్కానింగ్‌ యంత్రం. ఈ నెల 7న మహబూబాబాద్‌ జిల్లా కురవి మండలం తాట్యాతండా పంచాయతీ పరిధిలోని పిల్లిగుంట్ల తండాలోని ఓ ఇంట్లో గర్భిణులకు ఖమ్మం, మహబూబాబాద్‌ జిల్లాలకు చెందిన వ్యక్తులు మొబైల్‌ స్కానింగ్‌ యంత్రంతో లింగనిర్ధారణ పరీక్షలు చేస్తుండగా స్థానికులు గుర్తించారు. అధికారులకు సమాచారం ఇవ్వడంతో డీఎంహెచ్‌వో కళావతిబాయి, ఎస్సై గోపి, పీహెచ్‌సీ వైద్యురాలు స్రవంతి వెళ్లి వారిని పట్టుకున్నారు. పరీక్షలు నిర్వహించిన వారిపై, ఆర్‌ఎంపీలపై కేసులు నమోదు చేశారు.

న్ని రంగాల్లో దూసుకెళ్తున్న ఆడపిల్లలను బాధ్యతగా చూసుకోవాల్సిన వారు బరువుగా భావిస్తున్నారు. గర్భం దాల్చిన కొద్ది రోజులకే పుట్టబోయేది ఆడా.. మగా అని తెలుసుకుని కడుపులోనే కరిగించేస్తున్నారు. చేసేది తప్పని.. అమ్మాయి పుడితే కలిగే ప్రయోజనాలపై చైతన్యం చేయాల్సిన వైద్యులే డబ్బులకు కక్కుర్తి పడి లింగనిర్ధారణ చేసి గర్భంలోనే కడతేరుస్తుండడం అత్యంత హేయం..

ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో లింగనిర్ధారణ అనేది ఒకప్పుడు ఆసుపత్రుల్లోనే జరిగేది. వైద్యాధికారులు పటిష్ఠ నిఘా పెట్టి అడ్డుకుంటుండడంతో నిర్ధారణ పరీక్షలు చేసే వారిలో కొందరు వక్రమార్గాలను ఎంచుకుంటున్నారు. ఏకంగా సంచార స్కానింగ్‌ యంత్రాలను వాడుతున్నారు. గ్రామీణ వైద్యుల (ఆర్‌ఎంపీ) సమక్షంలోనే గుట్టుచప్పుడు కాకుండా వినియోగిస్తున్నారు.  

ప్రాంతాన్ని బట్టి..

మొబైల్‌ స్కానింగ్‌ యంత్రాలతో నిర్వాహకులు దర్జాగా కార్లలో వచ్చి లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. ఇందుకు ఒక్కో ప్రాంతాన్ని బట్టి రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు తీసుకుంటున్నారు. మహబూబాబాద్‌ జిల్లాకు ఖమ్మం నుంచి కూడా సంచార స్కానింగ్‌ యంత్రాలు వస్తున్నాయి. ఇదే జిల్లాలో కొన్ని ప్రైవేటు ఆసుపత్రుల్లోనూ ఏదో ఒక అనారోగ్య కారణాన్ని చెబుతూ చాటుమాటుగా గర్భవిచ్ఛిత్తి సైతం చేస్తున్నారు. ఔషధదుకాణాల్లో గర్భవిచ్ఛిత్తికి అవసరమైన మందులు లభిస్తుండడంతో ఆర్‌ఎంపీలు వాటితో అబార్షన్లు చేస్తున్నట్లు వినికిడి. గతంలో వైద్యం వికటించి బాధితులు మృతి చెందిన ఘటనలు కూడా ఉన్నాయి.

గుడిసె వాసుల స్ఫూర్తిని చాటుదాం

వరంగల్‌ జిల్లాలోని దేశాయిపేట ప్రాంతంలోని  గుడిసెల్లో  గత నెలలో గుట్టుచప్పుడు కాకుండా లింగనిర్ధారణ పరీక్షలు జరుగుతుండగా ఆ గుడిసె వాసులు స్పందించారు.  పరీక్షలు నిర్వహిస్తున్న సమయంలో పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే పోలీసులు, వైద్యాధికారులు అక్కడికి చేరుకొని పట్టుకున్నారు. ఇలా ఉమ్మడి జిల్లాలో మీ ప్రాంతాల్లో లింగనిర్ధారణ పరీక్షలు జరుగుతుంటే పోలీసులకు సమాచారం ఇవ్వాలి.

ప్రసవానికి అయ్యేంత ఖర్చు

లింగనిర్ధారణలో పుట్టబోయేది ఆడబిడ్డ అని తెలుసుకున్న తర్వాత గర్భవిచ్ఛిత్తి (అబార్షను) చేయించుకోవడానికి ప్రసవానికి అయ్యేంత ఖర్చు చేస్తున్నారు. మహబూబాబాద్‌ లాంటి ప్రాంతంలో రూ.15 వేల నుంచి రూ.30 వేల వరకు ప్రాంతాన్ని బట్టి తీసుకుంటున్నారు. వరంగల్‌, హనుమకొండ ప్రాంతంలో వ్యక్తుల ఆర్థిక పరిస్థితులను బట్టి రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు తీసుకుంటున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.

నాలుగు నెలల్లో 258 అబార్షన్లు..  

మహబూబాబాద్‌ జిల్లాలో 2023 నవంబరు, డిసెంబరు, 2024 జనవరి, ఫిబ్రవరి ఈ నాలుగు నెలల్లో 258 అబార్షన్లు అయినట్లు వైద్యాధికారులు గుర్తించారు. గ్రామాల్లో ఏఎన్‌ఎంల వద్ద గర్భిణులుగా రికార్డు అయిన వివరాలను ఎప్పటికప్పుడు పరిశీలించడం ద్వారా ఈ విషయం తెలిసింది. కొందరు ప్రసవం అయినట్లు రికార్డు చేయించుకోకపోవడంతో అనుమానంతో క్షేత్రస్థాయికి వెళ్లి ఆరా తీస్తున్నారు. ఆ సమయంలో బాధితులు ఏదో ఒక అనారోగ్య కారణంతో అబార్షన్లు చేయించుకోవాల్సి వచ్చిందని చెబుతున్నారు.

నిబంధనల ప్రకారం ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో స్కానింగ్‌ యంత్రాలు ఏర్పాటు చేస్తే తప్పనిసరిగా వైద్య శాఖ  నుంచి అనుమతి తీసుకోవాలి. ఇటీవల మహబూబాబాద్‌లో పట్టుబడిన మొబైల్‌ స్కానింగ్‌ యంత్రం పొరుగు రాష్ట్రం నుంచి తెచ్చినట్లుగా గుర్తించారు. పూర్తి స్థాయిలో ఆ పరికరంపై విచారణ చేస్తే అసలు వ్యక్తులు బయట పడే అవకాశం ఉంది.

ప్రత్యేక నిఘా పెట్టాం..

డాక్టర్‌ బి.కళావతిబాయి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి

జిల్లాలో భ్రూణహత్యలపై ప్రత్యేక నిఘా ఉంచాం. ఎక్కడైనా సంఘటనలు జరిగినట్లు మా దృష్టికి వస్తే విచారణ చేసి చర్యలు తీసుకుంటాం. ఇందులో ప్రమేయం ఉన్న ఎవరినీ ఉపేక్షించేది లేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని