logo

గిట్టుబాటు కాని గుడ్డు ధర

అవసరాలకు తగ్గట్టుగా కోడి గుడ్ల ఉత్పత్తి ఉన్నా కోల్‌కతా వ్యాపారులు నిర్ణయించిన ధరలను స్థానిక ట్రేడర్లు పాటించడంతో గుడ్డు ధర క్రమంగా తగ్గుతోంది. గడిచిన ఇరవై రోజుల వ్యవధిలో రూ.4.60 పైసల నుంచి రూ.4.20 పైసలకు తగ్గింది. రిటైల్‌లో మాత్రం

Published : 20 Jan 2022 01:57 IST

కోళ్ల రైతులు కుదేలు

తణుకు, న్యూస్‌టుడే : అవసరాలకు తగ్గట్టుగా కోడి గుడ్ల ఉత్పత్తి ఉన్నా కోల్‌కతా వ్యాపారులు నిర్ణయించిన ధరలను స్థానిక ట్రేడర్లు పాటించడంతో గుడ్డు ధర క్రమంగా తగ్గుతోంది. గడిచిన ఇరవై రోజుల వ్యవధిలో రూ.4.60 పైసల నుంచి రూ.4.20 పైసలకు తగ్గింది. రిటైల్‌లో మాత్రం ఒక్కోటి రూ.5కే విక్రయిస్తున్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో చలి ఎక్కువగా ఉండటంతో గుడ్ల వినియోగం పెరిగింది. మేత ధరలు కూడా పెరిగాయి. దీంతో ఆర్థికంగా నష్టపోతున్నామని పలువురు కోళ్ల రైతులు వాపోతున్నారు. ప్రస్తుతం పరిస్థితులు మారాయి. ఇతర రాష్ట్రాలతోపాటు స్థానికంగా ఎక్కువగా వినియోగించడంతో డిమాండ్‌ పెరిగింది. అయినా ధరలు మాత్రం పెరగడం లేదని కోళ్ల రైతులు చెబుతున్నారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 350 వరకు ఫారాలు ఉండగా 1.20 కోట్ల వరకు కోళ్లు ఉన్నాయి. సుమారు 3 వేల మంది రైతులు ఉన్నారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా 30 వేల మంది ఈ పరిశ్రమపై ఆధారపడి పని చేస్తున్నారు. జిల్లాలో రోజుకి కోటి గుడ్లు ఉత్పత్తి అవుతున్నాయి. చలి ఎక్కువగా ఉండటంతో నూరు శాతం ఉత్పత్తి ఉంది. గుడ్డు పరిమాణం కూడా తగ్గకుండా ఉంటున్నాయని రైతులు చెబుతున్నారు.

ఎగుమతులు బాగానే ఉన్నా..

ఈశాన్య రాష్ట్రాల్లో చలి ఎక్కువగా ఉండటంతో గుడ్డు వినియోగం పెరిగింది. జిల్లా వ్యాప్తంగా పశ్చిమ బంగ, ఒడిశా, పంజాబ్‌ వంటి రాష్ట్రాలకు నిత్యం 70 లారీల గుడ్లు ఎగుమతి అవుతున్నాయి. కొవిడ్‌ కారణంగా వినియోగం భారీగా పెరిగింది.

ట్రేడర్ల నిర్ణయం మేరకు..

ప్రస్తుతం డిమాండ్‌కు తగ్గట్టుగా ఉత్పత్తి ఉన్నా కోల్‌కతా ట్రేడర్లు నిర్ణయించిన ధరలకు తగ్గించి విక్రయించాల్సి వస్తోందని కోళ్ల రైతులు చెబుతున్నారు. ఇతర రాష్ట్రాలకు సంబంధించి రవాణా, ఎగుమతులకు సంబంధించి హామాలీ, ప్యాకింగ్‌ ఛార్జీలు తగ్గించి అంటే గుడ్డు ధర రూ.4.60 పైసలు ఉంటే 40 పైసలు తగ్గించి రూ.4.20 పైసలకు స్థానిక ట్రేడర్లు నిర్ణయిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న మేత ధరలను బట్టి రూ.4.80 పైసలు ఉంటే కాని రైతుకు గిట్టుబాటు కాదని ఆంధ్రప్రదేశ్‌ పౌల్ట్రీ ఫెడరేషన్‌ సంయుక్త కార్యదర్శి ఆత్కూరి దొరయ్య తెలిపారు.

గతంతో పోలిస్తే ధరలు ఇలా ఉన్నాయి..

గడిచిన నవంబరులో రూ.4.80

డిసెంబరులో రూ.4.60

ప్రస్తుతం రూ.4.20

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని