logo

మాటలు ఎక్కడో.. పనులు ఇక్కడే

‘ప్రభుత్వ బడుల రూపురేఖలు మార్చేస్తాం.. తొమ్మిది రకాల అభివృద్ధి పనులు చేపట్టి కార్పొరేట్‌ స్థాయిలో తీర్చిదిద్దుతాం’ అని సీఎం జగన్‌, వైకాపా నాయకుడు ఊకదంపుడు ఉపాన్యాసాలిచ్చారు.

Published : 27 Apr 2024 04:53 IST

నాడు- నేడు..అంతా జాప్యమే
విద్యా సంవత్సరం పూర్తయినా అదే తీరు
ఏలూరు విద్యా విభాగం, పెదపాడు, గ్రామీణ, న్యూస్‌టుడే

‘ప్రభుత్వ బడుల రూపురేఖలు మార్చేస్తాం.. తొమ్మిది రకాల అభివృద్ధి పనులు చేపట్టి కార్పొరేట్‌ స్థాయిలో తీర్చిదిద్దుతాం’ అని సీఎం జగన్‌, వైకాపా నాయకుడు ఊకదంపుడు ఉపాన్యాసాలిచ్చారు. వారు చెప్పిన మాటలు కోటలు దాటాయే తప్ప ఆచరణలో అమలు కాకపోవడంతో విద్యార్థులకు అవస్థలు తప్పడం లేదు.

తీవ్ర ఆలస్యం..

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో మొదటి విడత నాడు- నేడులో 1,030 బడులను ఎంపిక చేశారు. వాటిలో అభివృద్ధి పనులకు రెండేళ్లు పట్టింది. రెండో విడతలో ఏలూరు జిల్లాలో 829 పాఠశాలలు ఎంపిక చేసి 2023- 24 విద్యా సంవత్సరం పూర్తయ్యేలోగా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. కానీ ఒక్క బడిలోనూ నూరు శాతం పనులు పూర్తి కాలేదు. జిల్లాలో మొత్తం 1,878 ప్రభుత్వ పాఠశాలలున్నాయి. ఇందులో తొలి విడతలో 621 బడుల్లో పనులు పూర్తయ్యాయి. రెండో విడత చేపట్టిన పనులు పూర్తి కావాల్సి ఉంది.


పెదపాడు మండలం అప్పనవీడు జడ్పీ ఉన్నత పాఠశాలలో రెండో విడతలో ఆరు తరగతి గదులు నిర్మించాలని నిర్ణయించారు. ఒక్కో గదికి రూ.12 లక్షల చొప్పున రూ.72 లక్షలు మంజూరు చేశారు. ఇది జరిగి దాదాపు ఏడాది కావస్తున్నా ఇప్పటికీ మూడు గదులే నిర్మించారు. మిగిలిన మూడింటి నిర్మాణం అసంపూర్తిగా నిలిపివేశారు. మొత్తం గదుల నిర్మాణం పూర్తికాకున్నా వాటిని ఎమ్మెల్యే అబ్బయ్యచౌదరి గత నెలలో ప్రారంభించారు.


చాటపర్రు జడ్పీ ఉన్నత పాఠశాలకు ఏడు అదనపు తరగతుల భవన నిర్మాణానికి ఏడాది కిందట రూ.84 లక్షలు మంజూరు చేశారు. వాటి నిర్మాణానికి పునాదులు తీసి పిల్లర్లు వేశారు. ఆ తరువాత పనుల్లో జాప్యం,  నిధుల లేమి తదితర కారణాలతో మంజూరు చేసిన నిధులను ఏడు నుంచి రెండు తరగతి గదులకు కుదించారు. ఈ పనులు కూడా పూర్తిస్థాయిలో చేయలేదు. ఇంకా ప్లాస్టరింగ్‌, నల్లరాయి పరుపు, రంగులు, ఎలక్ట్రిక్‌ సామగ్రి బిగింపు తదితర పనులు చేయాల్సి ఉంది. తరగతి గదులు చాలక విద్యార్థులు పాఠశాల వరండాలో కూర్చొని చదువుకుంటున్నారు. ఈ విషయమై హెచ్‌ఎం విజయకుమారి ‘న్యూస్‌టుడే’తో మాట్లాడుతూ పాఠశాల భవన నిర్మాణ పనులకు ఇప్పటి వరకు ఎంత ఖర్చు చేశారు, మిగిలిన గదుల నిర్మాణానికి ఎంత మొత్తం కావాలి వంటి వివరాలను ప్రభుత్వానికి నివేదించామన్నారు.


పాఠశాలలు తెరిచే నాటికి పూర్తి చేస్తాం

‘జిల్లాలో రెండో విడత చేపట్టిన నాడు- నేడు పనులను వేసవి సెలవుల అనంతరం పాఠశాలలు తెరిచే నాటికల్లా పూర్తి చేస్తాం. ఇప్పటి వరకు 601 బడుల్లో అయిదు రకాల పనులు 90 శాతం వరకు పూర్తయ్యాయి. మిగతా పనులతో పాటు మిగిలిన పాఠశాలల్లో పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేసేందుకు కార్యాచరణ ప్రణాళిక అమలు చేస్తున్నాం’ అని సమగ్ర శిక్షా ఏపీడీ సోమశేఖర్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని