logo

‘ఒకేచోట ఇద్దరి విగ్రహాలు ఆవిష్కరించకపోతే ఆందోళన’

‘‘డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌, బాబూ జగ్జీవన్‌రాం మాకు రెండు కళ్లు లాంటివారు. వారి విగ్రహాలు పక్కపక్కనే ఏర్పాటు చేయాల’’ని ఎమ్మార్పీఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు పేరుపోగు వెంకటేశ్వరరావు మాదిగ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

Published : 07 Feb 2023 06:00 IST

సమావేశంలో పాల్గొన్న వెంకటేశ్వరరావు మాదిగ

గోపాలపురం, న్యూస్‌టుడే: ‘‘డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌, బాబూ జగ్జీవన్‌రాం మాకు రెండు కళ్లు లాంటివారు. వారి విగ్రహాలు పక్కపక్కనే ఏర్పాటు చేయాల’’ని ఎమ్మార్పీఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు పేరుపోగు వెంకటేశ్వరరావు మాదిగ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ఎమ్మార్పీఎస్‌ నాయకులతో కలిసి తూర్పు గోదావరి జిల్లా గోపాలపురంలో సోమవారం సమావేశం నిర్వహించారు. జగ్జీవన్‌రాం జయంతి నాటికి ప్రభుత్వం ఇద్దరి విగ్రహాలు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేస్తామని హెచ్చరించారు. విజయవాడ స్వరాజ్య మైదానంలో 125 అడుగుల అంబేడ్కర్‌ విగ్రహం ఒక్కటే ఏర్పాటు చేయడం మాల, మాదిగల మధ్య చిచ్చుపెట్టడం కాదా? అని ప్రశ్నించారు. ప్రభుత్వం తన నిర్ణయం మార్చుకుని స్వరాజ్యమైదానంలో ఒకే ఎత్తులో ఇద్దరి విగ్రహాలు ఏర్పాటు చేయాలన్నారు. వచ్చే ఎన్నికల్లో 21 ఎమ్మెల్యే, 3 ఎంపీ సీట్లు మాదిగలకు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.  మార్చి 24న విజయవాడ ఐలాపురం కన్వెన్షన్‌ హాలులో దళిత, గిరిజన సంఘాల ఆధ్వర్యంలో రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహిస్తామన్నారు. 26 జిల్లాల వారు పాల్గొని సమస్యలపై చర్చించనున్నట్లు తెలిపారు. ఎమ్మార్పీఎస్‌ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాల నాయకులు కొడవటి బుజ్జిబాబు, బొబ్బిలి వెంకటరాజు, చెట్టే సుజనరావు, ప్రతిపాటి రాంబాబు, గెల్లా వెంకటశ్రీను, మల్లిపూడి సలీమ్‌, ప్రత్తిపాటి సుందరం తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని