logo

కక్ష సాధింపుల్లో.. అధినేతకు పెద్దన్న

జిల్లాలో సంపన్న ప్రాంతంగా గుర్తింపు పొందిన కీలక కేంద్రమది. తొలి నుంచి ప్రశాంత వాతావరణానికి నిలయం. జాతరలైనా, పండుగలైనా లౌకికత గోచరిస్తుంది. ఇలాంటి ప్రాంతం వైకాపా జమానాలో అరాచక పాలనకు, కక్ష  సాధింపులకు వేదికైంది.

Published : 06 May 2024 05:27 IST

కీలక కేంద్రంలో ‘రౌడీ’ రాజ్యం
ఎన్నికల వేళా ఆగని అరాచకీయం
ఈనాడు, ఏలూరు

జిల్లాలో సంపన్న ప్రాంతంగా గుర్తింపు పొందిన కీలక కేంద్రమది. తొలి నుంచి ప్రశాంత వాతావరణానికి నిలయం. జాతరలైనా, పండుగలైనా లౌకికత గోచరిస్తుంది. ఇలాంటి ప్రాంతం వైకాపా జమానాలో అరాచక పాలనకు, కక్ష  సాధింపులకు వేదికైంది. ఇలాంటి అరాచక పాలనను చూసిన జనసేనాని పవన్‌కల్యాణ్‌ ఇక్కడి ప్రజాప్రతినిధిని రౌడీగా అభివర్ణించినట్టున్నారు.

నారా లోకేశ్‌ యువగళం పాదయాత్రలో రాళ్లు రువ్విన ఘటనతో ఎలాంటి సంబంధంలేని వారిని, గ్రామాల్లో వైకాపాకు వ్యతిరేకంగా పోటీ చేశారనే కారణంతో స్థానిక నాయకులను కేసుల్లో ఇరికించారు.

బాలుడినీ వదల్లే..

అధికార వైకాపా నాయకుడి చిత్రం ఉన్న ప్లెక్సీని చించి వేశాడంటూ ఓ బాలుడి నిర్బంధించిన ఉదంతం ఈ నియోజకవర్గంలో చోటు చేసుకుంది. ఎమ్మెల్యే దగ్గరకు వెళ్లి బతిమలాడితే కేసు లేకుండా చేస్తామని ఆ బాలుడి తల్లిదండ్రులకు పోలీసులు చెప్పినట్లు ఆరోపణలున్నాయి. చేయని తప్పును ఒప్పుకునేందుకు ఆ తల్లిదండ్రులు ససేమిరా అన్నారు. దీంతో ఈ కేసు వాయిదాలకు కుమారుడితో సహా హజరవుతూనే ఉన్నారు.

భక్తులకూ వేధింపులు

ఈ నియోజకవర్గంలోని ముఖ్య పట్టణంలో ఓ ఆలయం ఎదుట అయ్యప్ప మాలధారణ భక్తులు ఏటా పడిపూజ చేస్తారు. గతేడాది కూడా ఇలా పూజలు చేస్తుండగా పోలీసులు, అధికారులు ,అడ్డుకున్నారు. రోడ్డుపై అడ్డంకులు తొలగించాలంటూ పూజకు విఘాతం కలిగించారు. సదరు ఎమ్మెల్యేను ఈ వేడుకకు ఆహ్వానించకపోవడమే దీనికి కారణమని భక్తులకు తెలియడంతో వారంతా ఆందోళనకు దిగారు. సదరు ప్రజాప్రతినిధి ఇంటికి సమీపాన కూడలిలో కూర్చొని అయ్యప్ప భజన చేశారు.

పవన్‌ అభిమాని అని..

జనసేనాని అభిమాని ఒకరు ఆయన పుట్టినరోజు సందర్భంగా వేడుకలు చేసి కేకు కోశారు. అది నచ్చని స్థానిక వైకాపా నాయకుడు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఆ యువకుడ్ని తీసుకెళ్లి సంకెళ్లతో మూడురోజుల పాటు పోలీస్‌స్టేషన్లో బంధించారు. రూ.35 వేల ఖరీదైన చరవాణి తీసుకుని ఇప్పటికీ ఇవ్వలేదు. ఎమ్మెల్యే కాళ్లమీద పడితే కేసు లేకుండా చేస్తామని పోలీసు అధికారి ఆ యువకుడి చెప్పడం.. ఈ ప్రాంతంలో అరాచక పాలన ఏ స్థాయిలో ఉందో తేటతెల్లం చేసింది.

ఓటమిని సహించలేక

ప్రాదేశిక ఎన్నికల వేళ ఈ నియోజకవర్గంలో ముఖ్య పట్టణాన్ని ఆనుకొని ఉన్న మండలంలో జనసేన, తెదేపా నాయకులను సమన్వయపరిచి బరిలో నిలిచేలా ఓ మాజీ ఎంపీపీ, తెదేపా నేత కృషి చేశారు. దీంతో ఆ మండలంలో జడ్పీటీసీ, ఎంపీపీ పదవులు వైకాపాకు దూరమయ్యాయి. దీనిని జీర్ణించుకోలేక పోయిన ఎమ్మెల్యే సంబంధిత తెదేపా నాయకుడిని ఎన్నోరకాలు వేధింపులకు గురి చేయడంతో పాటు కేసులు నమోదు చేయించారు. తుదకు రౌడీషీట్‌ కూడా తెరిపించారు. ఇదే మండలంలోని ఓ గ్రామంలో స్థలం కబ్జా వ్యవహారంలో స్థానికులపై కిరాయి మూకలతో దాడులు చేయించారు. కర్రలు, రాడ్లను చేతపట్టి జనాలను పరుగులెత్తించడం చూసిన నియోజకవర్గ ప్రజలు విస్తుపోయారు. అధికార పార్టీ నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గలేదని నాలుగు గ్రామాలకు చెందిన పలువురి నాయకులపై కేసులు బనాయించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని