logo

వైద్యం బహుభారం

నూజివీడు డిపోకు చెందిన ఒక మెకానిక్‌ భార్యకు ఏడాదిన్నర కిందట జబ్బు చేసింది. ఈహెచ్‌ఎస్‌ సదుపాయంతో ఆమెకు కార్పొరేట్‌ ఆసుపత్రిలో వైద్యం చేయించాలని ఆయన భావించారు.

Published : 07 May 2024 05:49 IST

ఆర్టీసీ ఉద్యోగులకు విలీనం తెచ్చిన తంటాలు

ఏలూరు అర్బన్‌, న్యూస్‌టుడే: నూజివీడు డిపోకు చెందిన ఒక మెకానిక్‌ భార్యకు ఏడాదిన్నర కిందట జబ్బు చేసింది. ఈహెచ్‌ఎస్‌ సదుపాయంతో ఆమెకు కార్పొరేట్‌ ఆసుపత్రిలో వైద్యం చేయించాలని ఆయన భావించారు. ఏ ఆసుపత్రికి తీసుకెళ్లినా ముందుగా డబ్బు చెల్లిస్తేకాని వైద్యం చేసేది లేదని స్పష్టం చేశారు. పెద్ద మొత్తంలో సొమ్ము చెల్లింలేక భార్యను ఒక సాధారణ ఆసుపత్రిలో చేర్పించారు. సరైన వైద్యం అందక కొద్ది రోజులకే ఆమె మృతి చెందారు.

 ఎందుకూ పనికిరాని ఈహెచ్‌ఎస్‌

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశాక ఇందులో ఉద్యోగులకు మిగతా ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే ఈహెచ్‌ఎస్‌ పథకాన్ని వర్తింపజేశారు. ఇక్కడి నుంచే వారికి వైద్యపరమైన సమస్యలు మొదలయ్యాయి. పాత విధానంలో ఆర్టీసీ కార్మికులు, వారి కుటుంబ సభ్యులకు సంస్థకు చెందిన డిస్పెన్సరీల్లో వైద్యం అందించేవారు. ఇందుకోసం వారు ఎటువంటి రుసుమును చెల్లించాల్సిన అవసరం ఉండేది కాదు. ఖర్చంతా సంస్థ భరించేది. ఈహెచ్‌ఎస్‌ అమల్లోకి వచ్చాక ఆర్టీసీ ఉద్యోగులు, కుటుంబ సభ్యులు వైద్యం పొందడం భారంగా మారింది. కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో వైద్యం పొందాలంటే ముందుగా పెద్ద మొత్తంలో సొమ్ము చెల్లించాల్సి వస్తోంది. ఆ తర్వాత మెడికల్‌ రీయింబర్స్‌మెంట్‌ విధానంలో సొమ్ము పొందడానికి నెలల తరబడి వేచి చూడాలి. ఈహెచ్‌ఎస్‌ పథకం ద్వారా అత్యవసర సేవలు పొందడం మరింత కష్టతరంగా మారింది.


పాత విధానమే మేలు
విశ్రాంత ఉద్యోగులకు పరిమితం

ఆర్టీసీ ఉద్యోగుల కోసం గతంలో ఏర్పాటు చేసిన డిస్పెన్సరీలు ప్రస్తుతం కొనసాగుతున్నాయి. వీటిలో విశ్రాంత ఉద్యోగులకు వైద్య సేవలందిస్తున్నారు. రెగ్యులర్‌ ఉద్యోగులకు వైద్యపరీక్షలు మాత్రమే  నిర్వహిస్తున్నారు. గతంలో ఆర్టీసీ కార్మికులు డిస్పెన్సరీకి వెళితే మెరుగైన వైద్యం కోసం విజయవాడ ప్రాంతీయ వైద్యశాల లేదా కార్పొరేట్‌ ఆసుపత్రికి రిఫర్‌ చేసేవారు. వైద్యానికి అవసరమయ్యే ఖర్చును ఆర్టీసీ యాజమాన్యం భరించేది. ఇలా వైద్యం పొందడానికి ఆర్టీసీ ఉద్యోగులు నెలకు రూ.225 లేదా రూ.300 చెల్లించేవారు. పాత విధానం అమల్లో ఉన్నపుడు ఆర్టీసీ ఉద్యోగులకు వైద్యం నిమిత్తం సంస్థ ఏటా దాదాపు రూ.25 కోట్లను కేటాయించేది.

ఉభయ జిల్లాలకు ఒకటే వైద్యశాల

పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాల్లోని ఆర్టీసీ ఉద్యోగులకు ఏలూరులో ఒకటే వైద్యశాల ఉంది. ఇందులో ఒప్పంద విధానంలో వైద్యుడు పనిచేస్తుంటారు. ఇందులో చిన్నపాటి రోగాలకు మాత్రమే చికిత్స చేసి మందులు అందిస్తుంటారు. పెద్ద రోగం ఏదైనా వస్తే అటు కార్పొరేట్‌ ఆసుపత్రికి వెళ్లలేక.. ఇటు డిస్పెన్సరీలో సరైన వైద్యం అందక ఉద్యోగులు పడుతున్న బాధలు వర్ణనాతీతం. పశ్చిమగోదావరి, ఏలూరు, తూర్పుగోదావరి జిల్లాలోని కొన్ని పట్టణాలకు చెందిన ఆర్టీసీ ఉద్యోగులు ఏలూరులోని డిస్పెన్సరీకే వచ్చి వైద్య సేవలు పొందాల్సిన పరిస్థితి.

ఆర్టీసీ ఉద్యోగులకు వైద్యం అందించడంలో పాత విధానమే ఎంతో మేలు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని ఎవరూ కోరుకోలేదు. ఈ ప్రక్రియ అనంతరం 2021లో ఉద్యోగులు ఒక పేస్కేలు కోల్పోయారు. దీంతో జీతాలు తగ్గాయి. విలీనం అయితే ఉద్యోగ విరమణ తర్వాత పింఛను వస్తుందన్నారు. కానీ ఆ పరిస్థితి లేదు. ఈహెచ్‌ఎస్‌ సదుపాయంతో ఉద్యోగులకు ఎటువంటి ప్రయోజనం లేకపోగా నష్టం ఉంటోంది.’ అని  ఆర్టీసీ ఉద్యోగ సంఘ నాయకుడొకరు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని