logo

ఉద్యోగుల ఓట్లకూ గేలం

సాధ్యమైనంత వరకు ఉద్యోగులు ఓటేయకుండా చూడాలనే ప్రభుత్వ పన్నాగంలో భాగంగా జిల్లాలో పోలింగ్‌ కేంద్రాల వద్ద కనీస ఏర్పాట్లకు మోకాలడ్డారన్న విమర్శలున్నాయి.

Published : 07 May 2024 06:07 IST

అడుగడుగునా వైకాపా నాయకుల ప్రలోభాలు

ఈనాడు డిజిటల్‌, భీమవరం, న్యూస్‌టుడే బృందం: సాధ్యమైనంత వరకు ఉద్యోగులు ఓటేయకుండా చూడాలనే ప్రభుత్వ పన్నాగంలో భాగంగా జిల్లాలో పోలింగ్‌ కేంద్రాల వద్ద కనీస ఏర్పాట్లకు మోకాలడ్డారన్న విమర్శలున్నాయి. నిబంధనలేమీ వెల్లడించకపోవడంతో ఉద్యోగినులు హ్యాండ్‌ బ్యాగ్‌లు, చరవాణులతో వరుసలో నిలబడగా.. వాటిని లోపలికి అనుమతించలేదు.

భీమవరం, ఉండి నియోజకవర్గాలకు ఎస్‌ఆర్‌కేఆర్‌లో ఏర్పాటుచేసిన పోలింగ్‌ కేంద్రంలో ఓటుహక్కు వినియోగించుకునేందుకు పోలవరం, గణపవరం ప్రాంతాల్లో పనిచేస్తున్న వారు దరఖాస్తు చేసుకోగా వారి ఓట్లు ఇంకా రాకపోవడంపై కొంతమంది అసహనం వ్యక్తం చేశారు. పాలకొలు ఎంఎంకేఎన్‌ఎం పాఠశాలలో  కుర్చీలు లేకపోవడంతో  వృద్ధులు, అనారోగ్యంతో ఉన్నవారు ఇబ్బందులు పడ్డారు. తాడేపల్లిగూడెంలోని కడకట్ల మున్సిపల్‌ ఉన్నత పాఠశాలలో ఏర్పాటుచేసిన కేంద్రంపై కొంతమంది ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆచంటలో మందకొడిగా పోలింగ్‌ జరిగింది. నరసాపురంలో వై.ఎన్‌ కళాశాలలో సరైన సమాచారం లేక ఉద్యోగులు ఇబ్బందులు పడ్డారు.

 ఆగని పైరవీలు..  ఓటర్లను ఇప్పటికే అనేక ప్రలోభాలకు గురిచేస్తున్న వైకాపా నాయకులు పోస్టల్‌ బ్యాలెట్ల ఓట్లను కొనుగోలుకు సైతం బేరసారాలు సాగించారు. తాడేపల్లిగూడెం కేంద్రం వద్ద వైకాపా నాయకులు నగదు పంపిణీ చేస్తూ ప్రలోభాలకు దిగారు. ఓటేసి సెల్‌ఫోన్‌లో ఫొటో తీసి పంపిస్తే రూ.3 వేలు ఇస్తామని ఆశ చూపారని కొంతమంది వాపోయారు. తణుకులోని జిల్లా పరిషత్తు బాలికోన్నత పాఠశాల కేంద్రానికి కూత వేటు దూరంలో వైకాపా నాయకులు ప్రలోభాలకు తెర తీశారు. ఆచంట పరిధిలో అధికార పార్టీ నాయకులు ఓటర్లకు వెండి గిన్నెలు పంపిణీ చేశారు.

 తాడేపల్లిగూడెం అర్బన్‌, న్యూస్‌టుడే: తాడేపల్లిగూడెంలోని పోస్టల్‌ బ్యాలెట్‌ పోలింగ్‌ కేంద్రం వద్ద మంత్రి కొట్టు సత్యనారాయణ బంధువు నిమ్మల నాని ఓటర్లను ప్రలోభాలకు గురి చేశారు. డబ్బుతో కూడిన కవర్లు అందిస్తూ కనిపించారు.                
నీ తాడేపల్లిగూడెంలోని  కేంద్రం వద్ద అధికార పార్టీ నేతలు కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. కార్లకు వైకాపా జెండాలు కట్టి కేంద్రం వద్దకు వస్తుండగా కొందరు జనసేన నాయకులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు పరిస్థితిని సమీక్షించి ఇరువర్గాలను పంపించే ప్రయత్నం చేశారు. ఆ సమయంలో జనసేన నాయకులు, పోలీసుల మధ్య తోపులాట చోటుచేసుకుంది. ఈ క్రమంలో జనసేన నాయకుడు బొలిశెట్టి రాజేశ్‌ను పోలీసులు అడ్డగించారు.  పోలింగ్‌ జరిగే ప్రాంతంలోకి వైకాపా నాయకులు వెళ్లేందుకు విశ్వప్రయత్నం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని