logo

అణచివేతలతో అరాచక పర్వం

Updated : 07 May 2024 06:35 IST

అయిదేళ్ల వైకాపా జమానాలో దౌర్జన్యకాండ

నాయకుల జేబుల్లో మనుషుల్లా పోలీసులు

వైకాపా అయిదేళ్ల పాలనలో అరాచకం రాజ్యమేలింది..  విధ్వంసం విజృంభించి వెర్రితలలేసింది. జగన్‌ జమానాలో అక్రమాలను అడ్డుకుంటే తమ దౌర్జన్యకాండను తట్టుకోవాలన్నట్లు  ఆ పార్టీ అనుచరగణం వ్యవహరించింది.  వీరికి పోలీసులు జేబులో మనుషుల్లా  మారారు. వారు చెప్పిందే వేదంలా చేశారు.

 ఈనాడు, భీమవరం , పాలకొల్లు, న్యూస్‌టుడే: భీమడోలుకు చెందిన తెలుగు యువత నాయకులు గంజి మహేష్‌, మనోజ్‌లను 2022 జూన్‌లో ఒక హత్యకేసులో విచారించడానికి భీమడోలు పోలీసులు రాత్రి సమయంలో స్టేషన్‌కు తీసుకెళ్లారు. మర్నాడు కోర్టుకు తీసుకెళ్లే క్రమంలో గంజాయి సంచులను వెంటతీసుకొచ్చిన పోలీసులు విచారణ ఎదుర్కొంటున్న సోదరుల ఆయిల్‌ఫామ్‌ తోటలో పెట్టడానికి ప్రయత్నించడంతో పెద్ద దుమారం రేగింది.
2024 ఫిబ్రవరిలో పెదవేగి మండలం కొప్పాకకు చెందిన తెదేపా కార్యకర్త కాటేపల్లి నాగసురేష్‌ పోలవరం కుడికాలువ గట్టుపై అక్రమంగా తవ్వుతున్న మట్టి, గ్రావెల్‌ తవ్వకాలను అడ్డుకున్నారు. దీంతో 300మంది వైకాపా కార్యకర్తలు రాత్రివేళ మూకుమ్మడిగా వచ్చి అతని ఇంటిపై దాడికి తెగబడ్డారు. సామాన్యులపై వైకాపా చేసిన దాష్టీకాలకు ఇదో ఉదాహరణ మాత్రమే. వైకాపా అధికారం చేపట్టిన నాటి నుంచి ప్రజాస్వామ్యం పీక నొక్కుతూనే ఉన్నారు. కళ్ల ముందు అరాచకాలు జరుగుతున్నా నోరుమెదిపితే అడ్డగోలుగా దాడులకు తెగబడ్డారు. అక్కడితో ఆగరు..ప్రశ్నించిన వారికి వచ్చే సంక్షేమ పథకాలు రాకుండా చేస్తామంటూ బెదిరించారు. చివరికి అధికార పార్టీ నాయకులకు జీ హుజూర్‌ అనేలా చేశారు.

లోకేశ్‌ యువగళం పాదయాత్రలో కర్రలతో వైకాపా మూకల వీరంగం

విపక్షాల విజయాన్ని సహించలేక

విపక్షాల యాత్రలు, సభలు విజయవంతమైనా..ప్రతిపక్షాలకు ఆదరణ పెరుగుతున్నా వైకాపా నేతలు సహించలేరు. ఏ కారణం లేకున్నా విపక్ష కార్యకర్తలపై దాడులు చేయించి వారి కసి తీర్చుకుని అధికార దర్పం ప్రదర్శిస్తారు. గతేడాది జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ తణుకులో నిర్వహించిన వారాహియాత్ర విజయవంతం కావటం వైకాపా నాయకులు సహించలేకపోయారు. ఆ రాత్రి ఇరగవరం శివారులో కాలనీ దగ్గర దారికాచి యాత్రకు వచ్చిన అభిమానులపై బ్లేడులు, కర్రలతో దాడిచేశారు. ఈ సంఘటనలో కాకిలేరుకు చెందిన బండారు సతీష్‌ మాదాసు కిరణ్‌, పాలకొల్లుకు చెందిన వీర మహిళ తీవ్రంగా గాయపడ్డారు. లోకేశ్‌ యువగళం పాదయాత్ర అద్వితీయంగా సాగడం సహించలేక భీమవరంలో వైకాపా మూకలు దాడులకు దిగారు. సజావుగా జరుగుతున్న యాత్రలో అలజడి సృష్టించి..రాళ్లు, సీసాలతో తెదేపా కార్యకర్తలపై దాడి చేశారు. పోలీసులను కూడా గాయపరిచారు. అయినా వారిని పట్టించుకోకుండా యాత్రలో ఉన్న 26 మంది తెదేపా నాయకులు, యువగళం వాలంటీర్లపై హత్యాయత్నం కేసులు బనాయించారు.యలమంచిలి మండలం చించినాడలో ఎస్సీలకు చెందిన గోదావరి పెరుగులంక భూముల్లో ప్రభుత్వమే నిబంధనలకు విరుద్ధంగా మట్టి తవ్వకాలను చేపట్టిన తరుణంలో ఆయా భూములకు చెందిన లబ్ధిదారులు 2023 మే నెలలో అడ్డుకున్నారు. దీనికి ఆగ్రహించిన వైకాపా ప్రభుత్వం వందలాదిమంది పోలీసులను పంపించి ఎస్సీ మహిళలపై దౌర్జన్యకాండకు దింపి తీవ్రంగా గాయపరిచింది. అనేక మందిపై అక్రమ కేసులు బనాయించింది.

పోలీసులా... వైకాపా కార్యకర్తలా

పోలీసులను వైకాపా నాయకులు జేబుల్లో మనుషులుగా మార్చుకున్నారు. ఆయా స్టేషన్ల పరిధిలో నాయకుడు ఊ అంటే కేసు లేదంటే నెలలు గడిచినా పట్టించుకోరు. నాయకులు ఎవరి పేరు చెబితే వారిపై కనీస విచారణ లేకుండా అడ్డగోలుగా తప్పుడు కేసులు బనాయించడమే వారి పని. ముసునూరు మండలం రమణక్కపేటలో వైకాపా నాయకుడు పంచాయతీ స్థలంలో ఇల్లు నిర్మిస్తున్నారని శివనాగాంజనేయులు అనే వ్యక్తి స్పందనలో ఫిర్యాదు చేశారు. అధికారులు విచారణ చేస్తుండగా వైకాపా కార్యకర్తలు ఫిర్యాదుదారుడిపై దాడి చేశారు. ఆశ్చర్యం ఏంటంటే  దాడి చేసిన వారిని వదిలి బాధితుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అమరావతి రైతుల పాదయాత్ర సమయంలో తణుకులో వైకాపా అల్లరి మూకలు భారీ సంఖ్యలో వచ్చి నల్లబెలూన్లు, ప్లకార్డులు పట్టుకుని రౌడీల్లా నిరసన తెలుపుతుంటే పోలీసులు వారికి రక్షణగా నిలబడ్డారు.

ప్రజలపై వైకాపా దొరతనం?

అధికారపార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు ప్రజలతో వ్యవహరిస్తున్న తీరు అత్యంత దారుణంగా ఉంది. తమను ఎన్నుకున్నది వారేనన్న ఓటర్లు లేకుంటే నాయకులే లేరన్న విషయం విస్మరించి ప్రజలంటే బానిసలన్న ధోరణిలో నాయకులు ప్రవర్తిస్తున్నారు. కనీస గౌరవ మర్యాదలు లేకుండా తిట్లదండకం చదవడం..దాడులు చేయించడం నాయకులకు పరిపాటిగా మారిపోయింది. ఇటీవల దెందులూరు ఎమ్మెల్యే అబ్బయ్యచౌదరి ప్రచారానికి వెళ్తుండగా ఒక యువకుడు నిలబడలేదని 20 మంది వైకాపా కార్యకర్తలు చావబాదారు. అదే ప్రాంతంలో కాంగ్రెస్‌ పార్టీ ప్రచారానికి వెళ్లొస్తున్న మహిళలపై దాడిచేసి వారు ప్రయాణిస్తున్న వాహనం అద్దాలు పగులకొట్టడం వైకాపా విధ్వంసానికి అద్దంపట్టింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని