logo

గుత్తేదారును గుల్ల చేసిన పెత్తందారు!

ఉమ్మడి జిల్లాలో 2015 మొదలు 2019 వరకు తెదేపా హయాంలో చేపట్టిన పనులు చేయడానికి గుత్తేదారులు పోటీపడేవారు. టెండర్లు పిలిస్తే చాలు ప్రతిపాదిత వ్యయానికంటే తక్కువకు టెండర్లు దాఖలు చేసేవారు.

Published : 08 May 2024 05:37 IST

బిల్లులివ్వక వేధింపులు

 ఆగిన వేలాది పనులు

 జగన్‌ జమానాలో తప్పని ఇబ్బందులు

పాలకొల్లు, న్యూస్‌టుడే :  నాడు ఇలా...ఉమ్మడి జిల్లాలో 2015 మొదలు 2019 వరకు తెదేపా హయాంలో చేపట్టిన పనులు చేయడానికి గుత్తేదారులు పోటీపడేవారు. టెండర్లు పిలిస్తే చాలు ప్రతిపాదిత వ్యయానికంటే తక్కువకు టెండర్లు దాఖలు చేసేవారు. పనులు దక్కించుకున్నాక వాటిని వేగంగా పూర్తిచేసి మళ్లీ మరోపని చేయడానికి ఉత్సాహం చూపేవారు. 2015లో వచ్చిన గోదావరి పుష్కరాలకు నరసాపురం వలంధరరేవు మొదలుకుని అప్పటి ఉమ్మడి జిల్లాలోని కొవ్వూరు గోష్పాద క్షేత్రం వరకు రూ. వేల కోట్లు విలువచేసే పనులు జరిగాయి. ఏ ఒక్క గుత్తేదారు బిల్లు అందలేదనే మాట వినపడకుండా పనులు పూర్తిచేశారు. గోదావరి తీరం లేకపోయినా సమీపంలో పంచారామ క్షేత్రం ఉండటంతో పుష్కరాల సందర్భంగా పాలకొల్లు రూపురేఖలే మారిపోయాయంటే అప్పట్లో జరిగిన పనులను ఊహించవచ్చు.

నేడు ఇలా...

2019 తర్వాత గుత్తేదారుల ముఖచిత్రం మారిపోయింది. రివర్స్‌ టెండర్ల పేరిట వేధింపులు మొదలయ్యాయి. ఎన్నిసార్లు టెండర్లు పిలిచినా ఒక్కరు కూడా ముందుకు రాక పనులు కదలని దుస్థితి. పురపాలికల్లో 15వ ఆర్థిక సంఘం నిధులు, సాధారణ నిధులతో చేపట్టే పనులకు గుత్తేదారులు కరువయ్యారంటే వైకాపా ప్రభుత్వం వచ్చాక ప్రగతి పనుల మంద గమనాన్ని అర్థం చేసుకోవచ్చు. గడప గడపకు మన ప్రభుత్వం పనులది అదే దుస్థితి. దిక్కుతోచని స్థితిలో అధికారులు బతిమలాడి వైకాపా నాయకులతో చేయించిన కొన్ని పనులకు కూడా బిల్లులు రాక వారు కూడా ఆగ్రహం వ్యక్తం చేసే పరిస్థితి నెలకొంది.

  • పాలకొల్లు రహదారులు భవనాలశాఖ పరిధిలో పోడూరు, వీరవాసరం, యలమంచిలి మండలాల్లో ఐప్యాక్‌ కొన్ని రహదారులను నిర్మించాలని ప్రభుత్వానికి సూచించింది. ఐప్యాక్‌ పనులంటే వెంటనే బిల్లులు వచ్చేస్తాయనే ఊహతో పలువురు గుత్తేదారులు ముందుకొచ్చి పనులు పూర్తి చేశారు. మొత్తం పనుల విలువ రూ.18 కోట్లు. ఏడాది దాటుతున్నా పైసా విడుదల కాలేదు. ఊరకే ఉండలేక ఉన్నదంతా పెట్టుబడి పెట్టి చేతులు కాల్చుకున్నామని ఆయా పనులు చేసిన గుత్తేదారులు ఇపుడు గొల్లుమంటున్నారు.
  •  ఉమ్మడి జిల్లాలో జలవనరులశాఖ, డ్రెయిన్లశాఖ పరిధిలో ఏటా రూ.16 కోట్లతో కనీస నిర్వహణ పనులు చేయడానికి ప్రతిపాదనలు చేస్తున్నారు. గడిచిన అయిదేళ్లలో ఒక్క పని చేయడానికి కూడా గుత్తేదారులు ముందుకు రాలేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అక్కడక్కడా చేసినా రూపాయి బిల్లు విడుదల చేయలేదు. ఆచంట, యలమంచిలి మండలాల్లో బ్యాంకు కెనాల్‌లో పూడిక తవ్వడానికి, తూడు నివారణకు యలమంచిలి మండలానికి చెందిన గుత్తేదారు ఒకరు పనులు చేయగా రూ.కోటి వరకు బిల్లులు గడిచిన అయిదేళ్లుగా పెండింగ్‌లో పెట్టారు.
  • ‘రోడ్లు వేయడం భవనాలు నిర్మించడం తప్ప మరోపని మాకు చేతగాదు. కోట్లాది రూపాయలు వెచ్చించి కొనుగోలు చేసిన మిక్సర్లు, రోడ్డు రోలర్లు నిరుపయోగంగా ఉంటున్నాయి. మా దగ్గర ఏళ్ల తరబడి పనిచేసే అనుభవమున్న కూలీలు ఎందరో ఉన్నారు. వీరంతా ఈ ప్రభుత్వం వచ్చాక పనుల్లేక ఖాళీగా ఉంటుంటే చూస్తూ ఉండలేక పోతున్నాం. ఎంతో కొంత బిల్లులు వస్తే కనీసం నిర్వహణ ఖర్చులైనా పోతాయని ఆశతో చిన్నాచితకా పనులు చేస్తున్నాం’. - ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఊబలంకకు చెందిన ఒక గుత్తేదారు ఇటీవల ‘న్యూస్‌టుడే’ దగ్గర చేసిన వ్యాఖ్యలివి.

జగన్‌ గద్దెనెక్కాకే..

వైకాపా ప్రభుత్వం వచ్చాక సీఎం ఒట్టి బటన్‌ నొక్కడం తప్ప, అభివృద్ధి పనులను పూర్తిగా గాలికొదిలేశారు. బ్యాంకు రుణమిస్తుందనో లేక కేంద్రం సాయం చేస్తుందనో అప్పుడప్పుడూ కొన్ని రహదారుల పనులు చేపట్టినా వాటికి బిల్లులు చెల్లించని దుస్థితిలో గుత్తేదారులు పనులు వదిలేసి పారిపోయే పరిస్థితి. ఉమ్మడి జిల్లాలో 11 ప్రధాన రహదారులను అభివృద్ధి చేయడానికి రహదారులు వంతెనల పునర్‌నిర్మాణ పథకం( ఏపీఆర్‌బీఆర్‌పీ) కింద న్యూడెవలప్‌మెంట్‌ బ్యాంకు రుణం రూ.200 కోట్లు 2022లో మంజూరయ్యాయి. దీనిలో 70శాతం కేంద్ర ప్రభుత్వం వాటా కాగా మిగిలినది రాష్ట్ర ప్రభుత్వం వెచ్చించాల్సి ఉంది. మొత్తం పనులను పూర్తిచేయడానికి రూ.140 కోట్లకు ఒకే సంస్థ అగ్రిమెంట్‌ కుదుర్చుకుంది. వీటిలో ఒకటైన యలమంచిలి మండలం మేడపాడు నుంచి వయా చించినాడ మీదుగా నరసాపురం వరకు 18 కి.మీ. మేర రహదారి పనులు అప్పట్లోనే ప్రారంభించారు. రెండోది ఏలూరు-కైకలూరు రహదారి పనులు చాలా వరకు పూర్తిచేసేశారు. కాని ఆయా పనులకు బిల్లులు ఇవ్వకపోవడంతో చేస్తున్న పనులను సైతం గుత్తేదారు వదిలేశారు. కొత్తరోడ్లు మంజూరైనా పనులు జరగక ప్రజలకు పాట్లు తప్పడం లేదు
ఉమ్మడి జిల్లాలో ఏ నియోజకవర్గాన్ని తీసుకున్నా రహదారులు భవనాల శాఖ  పరిధిలో చేసిన పనులకు 2022 నుంచి గుత్తేదారులకు బిల్లుల రూపేణా పైసా విడుదల కాలేదంటే నమ్మక తప్పని విషయం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని