logo

హామీలకు మంగళం... ఖాకీలకు ద్రోహం!

జిల్లా వ్యాప్తంగా కడప, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, పులివెందుల, మైదుకూరు సబ్‌ డివిజన్లు ఉన్నాయి.

Published : 20 Apr 2024 04:44 IST

జగన్‌ పాలనలో తప్పని అవస్థలు
అమలుకాని వారాంతపు సెలవులు
న్యూస్‌టుడే, కడప నేరవార్తలు]

పోలీసు శాఖలో గత 30 ఏళ్లుగా పనిచేస్తున్నాను. ఒకప్పుడు విధులు వేరు, ఇప్పుడు భిన్నంగా ఉన్నాయి. సీఎం జగన్‌ వారాంతపు సెలవులు ఇస్తామని హామీ ఇచ్చినా ఎక్కడా అమలు కావడం లేదు. అధికారులను అడిగితే సిబ్బంది కొరత అంటూ మాట దాటవేస్తున్నారు. వివిధ రకాల రోగాలతో ఇబ్బందులు పడుతున్నాం. ఉద్యోగానికి రాజీనామా చేస్తే రావాల్సిన బెనిఫిట్స్‌ ఎప్పుడు వస్తాయో తెలియని పరిస్థితి. దీంతో అలానే విధులు నిర్వహిస్తున్నాం. 

 - కడపలో నగరంలోని ఓ కానిస్టేబుల్‌ ఆక్రోశం

విరామం లేకుండా విధులు నిర్వహించాలంటే కష్టంగా ఉంది. వారాంతంలో ఏదైన పని పెట్టుకోవచ్చు అనుకుంటే కుదరడం లేదు. అనునిత్యం విధులతో సతమతమవుతున్నాం. అత్యవసరమైతే సెలవు పెట్టుకోవాల్సి వస్తోంది. అది కూడా దొరకాలంటే కష్టంగా ఉంది. చాలామంది అనారోగ్యంతో బాధపడుతున్నారు. వారికైనా వారాంతపు సెలవులివ్వాలి. 

 - ప్రొద్దుటూరు సబ్‌ డివిజన్‌ పరిధిలోని ఓ కానిస్టేబుల్‌ ఆవేదన

జిల్లా వ్యాప్తంగా కడప, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, పులివెందుల, మైదుకూరు సబ్‌ డివిజన్లు ఉన్నాయి. 11 సర్కిల్‌ కార్యాలయాలు, అప్‌గ్రేడ్‌ ఠాణాలు 15, ఠాణాలు 47, ఒక సీసీఎస్‌, మూడు ట్రాఫిక్‌, ఒక దిశ ఠాణాలున్నాయి. 24 గంటలపాటు విధులు  నిర్వహించే వీరికి జగన్‌ ప్రభుత్వంలో కష్టాలు తప్పడంలేదు. ప్రతి ఉద్యోగికి వారాంతపు సెలవు అనేది హక్కు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే పోలీసులకు వారాంతపు సెలవును మంజూరు చేస్తామని పాదయాత్ర సమయంలో హామీ ఇచ్చిన సీఎం జగన్‌ ఆ ఊసే మరిచారు. పోలీసు సిబ్బందిని అనారోగ్యాల పాల్జేశారు. ఫలితంగా వారాంతపు సెలవుల్లేక సిబ్బంది తీవ్ర ఒత్తిడికి గురవుతుండడమే కాకుండా రోగాల బారిన పడుతున్నారు.  ట్రావెలింగ్‌ అలవెన్సులు, డీఏలు పూర్తిగా ఇవ్వడం లేదు. వైకాపా ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి వేతనాలు సక్రమంగా సమయానికి వేయకపోవడంతో బ్యాంకుల్లో రుణాలు తీసుకున్న సిబ్బంది సిబిల్‌ స్కోర్‌ దెబ్బతిని రుణాలిచ్చేందుకు బ్యాంకు అధికారులు ముందుకు రావడం లేదు. దీనికితోడు సరెండరు లీవులు, అడిషనల్‌ సరెండర్‌ లీవులు ఇవ్వడం లేదు. తాము అధికారంలోకి వస్తూనే సీపీఎస్‌ రద్దు చేస్తామని సీఎం మాట తప్పడంతో ఉద్యోగుల భవిష్యత్తుకు గ్యారెంటీ లేకుండా పోయింది. జీపీఎఫ్‌ రుణాలు, ఏపీజీఎల్‌ఐసీ రుణాలు పూర్తిగా రావడం లేదు. ప్రస్తుతం ఎన్నికల సమయంలో మెడికల్‌ లీవులు కూడా తీసుకోలేని పరిస్థితి. సిబ్బందికి న్యాయపరంగా రావాల్సిన బకాయిలు కూడా రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మండుటెండలో విధులు నిర్వహిస్తూ అనారోగ్యాల బారిన పడుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని