logo

వేసవి శిక్షణ... తప్పని నిరీక్షణ!

ఏడాదిపాటు చదువులతో అలిసిపోయిన విద్యార్థులకు కాస్తంత ఊరట, వినోదం కోసం నిర్వహించే వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు ఇప్పటికీ ప్రారంభం కాకపోవడం క్రీడాకారులను నిరాశ పరుస్తోంది.

Published : 17 May 2024 03:28 IST

నిరాశతో మగ్గిపోతున్న క్రీడాకారులు  
పట్టించుకోని అధికార యంత్రాంగం

ఫుట్‌బాల్‌ సాధన చేస్తున్న చిన్నారులు

ఏడాదిపాటు చదువులతో అలిసిపోయిన విద్యార్థులకు కాస్తంత ఊరట, వినోదం కోసం నిర్వహించే వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు ఇప్పటికీ ప్రారంభం కాకపోవడం క్రీడాకారులను నిరాశ పరుస్తోంది. ఏటా మే 1వ తేదీ నుంచి జరిగే వీటిని ఈ ఏడాది ఎన్నికల కోడ్‌ కారణంగా మే 15 నుంచి జూన్‌ 15వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ప్రకటించినా ఇంతవరకు అతీగతీ లేదు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా దరఖాస్తు చేసుకున్న 50 మంది వివిధ క్రీడల శిక్షకులతోపాటు క్రీడాకారులు శిబిరాల ఎప్పుడు నిర్వహిస్తారా అని నిరీక్షిస్తున్నారు. కనీసం డీఎస్‌ఏ నుంచి ఎలాంటి సమాచారం లేదని వారంతా వాపోతున్నారు.

న్యూస్‌టుడే, కడప క్రీడలు: ఎన్నికలు ముగిసినా ఎలాంటి స్పష్టత లేని కారణంగా వేసవి క్రీడా శిక్షణ శిబిరాల నిర్వహణపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వాటి విధి విధానాలు సంబంధిత అధికారులకు నేటికీ అందలేదు. దీనికి తోడు పాఠశాలల్లోని ప్లే ఫీల్డ్స్‌ (క్రీడా మైదానాలు) అధ్వానంగా తయారయ్యాయి. శిక్షణ శిబిరాలు ఎక్కడ, ఎప్పుడు నిర్వహిస్తారనే వాటిపై స్పష్టత కరవైంది.

గత ఎన్నికలకు అడ్డురాని కోడ్‌ ఇప్పుడొచ్చిందా?

వేసవి శిబిరాల్లో పాల్గొనే శిక్షకుడికి గౌరవ వేతనం రూ.2 వేలు, క్రీడా సామగ్రికి రూ.6 వేలు నుంచి రూ.8 వేలు, మైదానం నిర్వహణ ఖర్చు కింద రూ.వేయి నిధులు కేటాయిస్తారు. గతేడాది ఉమ్మడి కడప జిల్లాలో వంద శిబిరాలు ఏర్పాటు చేయగా, ఈ ఏడాది వైఎస్‌ఆర్‌, అన్నమయ్య జిల్లాల్లో 50 చొప్పున శిబిరాలు నిర్వహించేందుకు సన్నాహాలు చేశారు. వీటన్నంటికీ నిధులిచ్చేందుకు ప్రభుత్వం ఆసక్తిగా లేదని క్రీడా నిపుణులు చెబుతున్నారు. 2019 సాధారణ ఎన్నికలప్పుడు వేసవి శిక్షణ శిబిరాలు నిర్వహించేందుకు ఎవరూ అడ్డు చెప్పలేదని, ఏటా ఈ శిబిరాలను నిర్వహించారని, ఈసారి ఎందుకు ఈ ఎన్నికల కోడ్‌ కారణం చెప్పి ఆటలను అడ్డుకుంటున్నారని క్రీడారంగం నిపుణులు ప్రశ్నిస్తున్నారు. మరోపక్క వేసవి శిబిరాలు ఏర్పాటు చేసే ముందు జిల్లా క్రీడాప్రాధికారిక సంస్థ అధికారులు క్రీడా సంఘాల ప్రతినిధులు, ఒలింపిక్‌ సంఘం ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేయాల్సి ఉండగా ఇంతవరకు నిర్వహించలేదు. స్పోర్ట్స్‌ ఆథారిటీ ఆఫ్‌ ఏపీ (శాప్‌) సౌజన్యంతో జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ (డీఎస్‌ఏ) ఆధ్వర్యంలో ఏటా వేసవి శిక్షణ శిబిరాలను నిర్వహించాలని వారంతా విన్నవిస్తున్నారు.

డీఎస్‌ఏ నిర్లక్ష్యంతో సందిగ్ధంలో క్రీడాకారులు

వైఎస్‌ఆర్‌, అన్నమయ్య జిల్లాల్లో గుర్తింపు లేని క్రీడాసంఘాలు చాలా ఉన్నాయి. ప్రస్తుతం అనేక క్రీడలకు రెండు అసోసియేషన్లు ఏర్పాటు చేసుకున్నా ఏ సంఘానికి గుర్తింపు ఉందో, ఏ సంఘానికి లేదో కూడా చెప్పలేని దుస్థితిలో జిల్లా క్రీడా ప్రాధికారిక సంస్థ ఉంది. కనీసం వాటి గుర్తింపు పత్రాలు సైతం సంస్థ వద్ద లేకపోవడం గమనార్హం. వేసవి శిబిరాల నిర్వహణలో ఆయా క్రీడా సంఘాల ప్రతినిధులతో సమావేశం నిర్వహించి చేయాల్సిన సూచనలు, క్రీడా ప్రణాళిక విడుదల చేయకపోవడం గమనార్హం.

అన్ని క్రీడాంశాలకు అవకాశం కల్పించాలి 

నేను ఖోఖో క్రీడలో శిక్షణ ఇచ్చేందుకు దరఖాస్తు చేశాను. ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం లేదు. అసలు శిక్షణ శిబిరం ఉంటుందో లేదో తెలియని పరిస్థితి. నానాటికీ పెరుగుతున్న వేసవి క్రీడా శిక్షణ ఆదరణకు అనుగుణంగా శిబిరాల సంఖ్యను కూడా పెంచాలి.

పవన్‌కుమార్‌, ఖోఖో

సీనియర్‌ క్రీడాకారుడు చర్యలు తీసుకుంటాం

ఇంతవరకు శాప్‌ నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదు. ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు. నిధులూ మంజూరు కాలేదు. రాగానే వేసవి శిక్షణ శిబిరాలను నిర్వహిస్తాం. లేదంటే కలెక్టర్‌ ద్వారా స్థానికంగా ఉన్న నిధులతోనైనా రెండు, మూడు రోజుల్లో క్రీడా శిబిరాలను నిర్వహించేవిధంగా చర్యలు తీసుకుంటాం.

జనార్దనరెడ్డి, జిల్లా ముఖ్య క్రీడా శిక్షకులు, డీఎస్‌ఏ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని