logo

కాలం మారింది మైనరు... తగ్గాలి నీ జోరు

రోడ్డు రవాణా.. రహదారుల మంత్రిత్వశాఖ గణాంకాల ప్రకారం మనదేశంలో 18 సంవత్సరాలకంటే తక్కువ వయసు ఉన్న మైనర్లు రోడ్డు ప్రమాదాల్లో రోజుకు సగటున 29 మంది మరణిస్తున్నారు. అదే గుంటూరు జిల్లాకు వచ్చేసరికి నెలకు సగటున ఐదు

Published : 19 Jan 2022 03:31 IST

పాఠశాలల్లో అవగాహన ముఖ్యం..

న్యూస్‌టుడే- అమరావతి ఫీచర్స్‌

రోడ్డు రవాణా.. రహదారుల మంత్రిత్వశాఖ గణాంకాల ప్రకారం మనదేశంలో 18 సంవత్సరాలకంటే తక్కువ వయసు ఉన్న మైనర్లు రోడ్డు ప్రమాదాల్లో రోజుకు సగటున 29 మంది మరణిస్తున్నారు. అదే గుంటూరు జిల్లాకు వచ్చేసరికి నెలకు సగటున ఐదు నుంచి పది మంది.. కృష్ణాకు వచ్చేసరికి 15 నుంచి 20 మంది మృతి చెందుతున్నారు.

శిక్షణలేని వ్యక్తి చేతిలో ఉన్న వాహనం ఒక ఆయుధంలాంటిది. అది తీవ్రమైన హాని కలిగించగలదనే హెచ్చరిక నిజమవుతోంది. గుంటూరు, కృష్ణా జిల్లాల్లో తరచూ వెలుగుచూస్తున్న ప్రమాద మరణాల్నిచూస్తే బండి నడిపే సరదా పిల్లల జీవితాల్ని తెల్లారేలా చేస్తోంది..

ఒంగోలుకు చెందిన ఏడోతరగతి విద్యార్థి కుంచాల రవికిరణ్‌(13), ఎనిమిదో తరగతి చదువుతున్న అక్కల ప్రభాకర్‌ తల్లిదండ్రులకు తెలియకుండా సోమవారం సరదాగా ద్విచక్ర వాహనంపై హైదరాబాద్‌ వెళ్తూ అద్దంకి-నార్కట్‌పల్లి రహదారిపై పెదనెమలిపురి వద్ద రోడ్డు ప్రమాదం బారినపడ్డారు. వారు ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనం రోడ్డు విభాగినిని ఢీకొనడంతో రవికిరణ్‌ మృతి చెందగా ప్రభాకర్‌ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది.

తెలిసీ తెలియని వయసు బండి కనిపించగానే ఉరకలేస్తోంది. నేనూ బైకు నడుపుతున్నానని స్నేహితులు.. తెలిసినవారికి చూపించాలనే తాపత్రయం.. సరదా, షికారు మోజులో మైనర్లు రోడ్డు ప్రమాదాల బారినపడి మృతి చెందుతున్నారు. తల్లిదండ్రుల ఆశలు తీరకుండానే వారి కలల దీపాలు ఆరిపోతున్నాయి.  పెద్దలు సరిగా చెప్పకపోబట్టే ఈ అనర్థాలు జరుగుతున్నాయి.

బండి ఇస్తే శిక్ష.. కౌమార దశలో ఉన్న అబ్బాయిలు ఎక్కువగా బైకు రేసింగ్‌.. వేగంగా వాహనాలు నడపడాన్ని ఇష్టపడతారని మనస్తత్వ నిపుణులు చెబుతున్నారు. హెల్మెట్‌, సీట్‌బెల్టు ధరించకుండా రోడ్డు భద్రతా నిబంధనలు పాటించకుండా వాహనాలు నడుపుతూ వారు ప్రమాదాల బారినపడుతున్నారు. మైనరు వాహనం నడిపితే బండి యజమానికి మూడేళ్ల జైలుశిక్ష, రూ.25 వేలు జరిమానా విధించవచ్చు. 12 నెలలపాటు మోటారు వాహనం రిజిస్ట్రేషన్‌ రద్దుకు అనుమతిస్తారు. ప్రమాదం చేసిన మైనర్‌కు 25 ఏళ్ల వరకు లెర్నర్‌ లైసెన్సు జారీ చేయరు.

పాఠశాలల్లో అవగాహన ముఖ్యం..
రోడ్డు భద్రతా వారోత్సవాలతోపాటు సాధారణ రోజుల్లోనూ ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో అవగాహనా కార్యక్రమాలు నిర్వహించాలి. ఉత్తరాది రాష్ట్రాలు టీనేజర్లకు మోటారు వాహన చట్టంపై సంపూర్ణ అవగాహన కల్పిస్తున్నాయి.. దిల్లీలో పాఠశాలస్థాయిలోనే రోడ్డు భద్రతపై సంపూర్ణ అవగాహన కల్పిస్తున్నారు. రవాణా, పోలీసు, విద్యాశాఖ అధికారులు మైనర్ల చేతికి ద్విచక్ర వాహనాలు చిక్కకుండా ఉండేలా.. లైసెన్సులు పొందిన తరువాత కూడా నిబంధనల మేరకు ఎలా వాహనాలు నడపాలనే అంశాలపై చెప్పగలగాలి.

విజయవాడ నగర పోలీసులు కొంతకాలం క్రితం టీనేజర్లు నడుపుతున్న వాహనాల్ని పట్టుకుని తల్లిదండ్రులకు కౌన్సెలింగ్‌ ఇచ్చి పంపారు. గుంటూరు నగరంలోనూ ఇదేతరహ ప్రయత్నం జరిగింది.
గుంటూరు గ్రామీణ ఎస్పీగా అప్పలనాయుడు పనిచేసిన సమయంలో మైనర్లు బైకులు నడపకుండా చేసేలా రోడ్లపై పోలీసులు గస్తీలు నిర్వహించి కౌన్సెలింగ్‌ ఇవ్వడంతోపాటు కేసులు కూడా నమోదు చేశారు.

18 ఏళ్లు నిండాల్సిందే..
18 ఏళ్లు పూర్తిగా నిండిన తరువాతే ఎవరికైనా రవాణా వాహనాలు నడిపేందుకు అనుమతి ఉంటుంది. మైనర్లకు రోడ్లపై వాహనాలతో వచ్చే అనుమతి కూడా లేదు.

నాలుగు నుంచి తొమ్మిదేళ్లలోపు చిన్నారులతో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తుంటే క్రాష్‌ హెల్మెట్‌ లేదా సైకిల్‌ హెల్మెట్‌ తప్పనిసరిగా ధరించాలని నిబంధనలు చెబుతున్నాయి.

పిల్లలతో ప్రయాణించే ద్విచక్ర వాహనాల వేగం గంటకు 40 కిలోమీటర్లు మించకూడదు.


మైనర్ల చేతికి వాహనాలు ఇవ్వవద్దు..

మీరాప్రసాద్‌, డీటీసీ, గుంటూరు
మైనర్లు నడిపే వాహనాలు ఎక్కడికక్కడ నిలుపుదలచేసి వాటిని స్వాధీనం చేసుకోవడంతోపాటు వాహనదారులు, పిల్లలకు కౌన్సెలింగ్‌ ఇచ్చే కార్యక్రమం నిరంతరం జరుగుతోంది. ఒక ఆర్‌ఎస్సై ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటుచేసి పిల్లలు నడిపే వాహనాలతో ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నాం. పాఠశాలల్లోనూ రోడ్డు భద్రతా అవగాహనా కార్యక్రమాల్ని నిర్వహిస్తాం. కృష్ణా జిల్లాలోనూ ఈ కార్యక్రమం అమలు జరుగుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని