logo

ప్రగతికి మణిహారం

తీరప్రాంత వాసుల నాలుగున్నర దశాబ్దాల స్వప్నం సాకారమైంది. కొంగొత్త ఆశలు తీసుకొస్తూ.. ఆకాంక్షలు నెరవేర్చేందుకు.. ప్రగతిని పరుగులు పెట్టించేందుకు భావనారాయణుడి క్షేత్రం బాపట్ల కేంద్రంగా సోమవారం కొత్త జిల్లా ఆవిర్భవించింది.

Published : 05 Apr 2022 02:42 IST

బాపట్ల, చీరాల, న్యూస్‌టుడే  తీరప్రాంత వాసుల నాలుగున్నర దశాబ్దాల స్వప్నం సాకారమైంది. కొంగొత్త ఆశలు తీసుకొస్తూ.. ఆకాంక్షలు నెరవేర్చేందుకు.. ప్రగతిని పరుగులు పెట్టించేందుకు భావనారాయణుడి క్షేత్రం బాపట్ల కేంద్రంగా సోమవారం కొత్త జిల్లా ఆవిర్భవించింది. ఘనమైన చారిత్రక నేపథ్యం.. సారవంతమైన డెల్టా భూములు.. గ్రానైట్ పరిశ్రమలు.. వస్త్ర వ్యాపారం.. పోర్టులు.. జాతీయ రహదారులు.. కృష్ణానది తీరం.. అందమైన బీచ్‌లు రాష్ట్రంలో పొడవైన తీర ప్రాంతం.. అపార సహజ వనరులతో విలసిల్లనుంది.

45 ఏళ్ల క్రితమే   మొగ్గతొడిగిన నినాదం..
నల్లమడ వాగు ముంపు సమస్య శాశ్వత పరిష్కారానికి బాపట్ల కేంద్రంగా కొత్త నల్లమడ జిల్లా ఏర్పాటు చేయాలన్నా స్థానిక ప్రజలు, రైతుల ఆకాంక్షకు అనుగుణంగా ప్రముఖ కమ్యూనిస్టు యోధుడు కొల్లా వెంకయ్య 1977లో తొలిసారిగా జిల్లా ప్రతిపాదన తెరపైకి తీసుకొచ్చారు. అప్పటి పాలకులను గట్టిగా కోరారు. 1980 నాటికి ప్రబలంగా ఉన్న నల్లమడ జిల్లా ప్రాధాన్యాన్ని అప్పటి బాపట్ల ఎమ్మెల్యే కోన ప్రభాకరరావు గుర్తించి జిల్లా ఏర్పాటు కోసం కేంద్ర, రాష్ట్రస్థాయిలో కృషి చేసినా అడుగు ముందుకు పడలేదు. ప్రభుత్వ నిర్ణయం, ఉప సభాపతి రఘుపతి కృషి, చొరవతో బాపట్ల కేంద్రంగా నూతన జిల్లా రూపుదిద్దుకుంది.

ఎన్నెన్నో ఘనతలు..ప్రత్యేకతలు
భావపురిలో ఐదో శతాబ్దం నాటి భావనారాయణ స్వామి ఆలయం, బౌద్ధ సంస్కృతి తెలిపే భట్టిప్రోలు బౌద్ధారామం చారిత్రక ప్రాంతాలుగా ప్రసిద్ధి. బాపట్ల తాలూకా 1794లో ఏర్పడింది. పట్టణంలోని టౌన్‌హాలులో 1913 మే 26, 27న నిర్వహించిన ప్రథమాంధ్ర మహాసభలు తెలుగు వారికి ప్రత్యేక రాష్ట్రం కావాలన్న భావనకు బీజం పలికాయి. భాషా ప్రయుక్త రాష్ట్రాల వాదన బలపడింది. స్వాతంత్య్రోద్యమంలో ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య నాయకత్వంలో 1919లో నిర్వహించిన చీరాల- పేరాల ఉద్యమం జాతీయ స్థాయిలో ప్రముఖ ఘట్టంగా నిలిచింది. 

ఆంధ్రా గోవా..  సూర్యలంక
సహజ సిద్ధ సూర్యలంక బీచ్‌కు ఆంధ్రా గోవాగా గుర్తింపు ఉంది. తీరంలో అరుదైన విదేశీ జాతి వలస పక్షులు, మడ అడవుల అందాలు వీక్షించేందుకు వారాంతాల్లో పర్యటకులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు.  పర్యాటక శాఖకు ఏటా రూ.కోట్లలో ఆదాయం సమకూరుతోంది.

శత్రు  దుర్బేధ్యం 
సూర్యలంకలో రక్షణపరంగా కీలకమైన వాయుసేన కేంద్రం ఉంది. ఇది తూర్పుతీరంలో వైమానిక దళానికి ఏకైక క్షిపణి పరీక్ష కేంద్రం. ఏటా పలు క్షిపణుల పనితీరును పరిశీలించేందుకు ఇక్కడి నుంచి ప్రయోగిస్తుంటారు.

అన్నదాతకు  నేస్తం..
దక్షిణ భారతదేశంలో తొలి వ్యవసాయ కళాశాల బాపట్లలో 1945 జులై 11న ప్రారంభమైంది. ఈ కళాశాలలోనే ప్రపంచ ప్రసిద్ధి చెందిన బీపీటీ-5204 సాంబా మసూరి వరి వంగడాన్ని ప్రముఖ శాస్త్రవేత్త ఎంవీ రెడ్డి ఆవిష్కరించారు. బాపట్ల పేరు చెప్పగానే ఈ వంగడమే అందరికీ గుర్తుకొస్తుంది. వేటపాలెం జీడిపప్పు, బాపట్ల జీడిమామిడి పరిశోధనా కేంద్రం శాస్త్రవేత్తలు రూపొందించిన బీపీపీ-8 వంగడం జాతీయ స్థాయిలో విశేష ప్రాచుర్యం పొందింది. సాగును లాభసాటి చేసేందుకు బాపట్ల కేంద్రంగా పరిశోధనలు జరుగుతున్నాయి.

కృష్ణా తీరం ఉద్యాన పంటల వనం
వేమూరు, రేపల్లె నియోజకవర్గాల్లో 55 కి.మీ. మేర కృష్ణానది పరివాహక ప్రాంతం విస్తరించి ఉంది. లంక గ్రామాల్లో విస్తృతంగా ఉద్యాన పంటల సాగు చేస్తున్నారు. కంద, అరటి, తమలపాకు, నిమ్మ, గులాబీ తదితర పంటల సాగుకు ప్రసిద్ధి.

నిజాంపట్నం..మత్స్య సంపద కేంద్రం
రాష్ట్రంలో పొడవైన సముద్ర తీరప్రాంతం కలిగిన జిల్లాగా బాపట్లకు విశిష్టత ఉంది. నిజాంపట్నం పోర్టును రూ.451 కోట్లతో విస్తరిస్తున్నారు. చీరాల మండలం ఓడరేవులో పోర్టు నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేశారు. తీరం ఆక్వా రంగానికి హబ్‌గా ఎదుగుతోంది. ఏటా రూ.1200 కోట్ల విలువైన రొయ్యలు, పిల్లలు, చేపలు విదేశాలు, ఇతర రాష్ట్రాలకు ఎగుమతవుతున్నాయి.
చేనేతకు చిరునామా   :  చీరాల వస్త్ర పరిశ్రమ కేంద్రం. తెలుగు రాష్ట్రాలకు ఇక్కడి నుంచి వస్త్రాలు ఎగుమతవుతుంటాయి. చీరాల, రేపల్లె, పేటేరు, భట్టిప్రోలు, చెరుకుపల్లిలో పెద్ద సంఖ్యలో చేనేత కార్మికులు ఉన్నారు. ఇక్కడి చేనేత వస్త్రాలకు రాష్ట్రస్థాయి గుర్తింపు ఉంది.
సహజ వనరుల క్షేత్రం  : గ్రానైట్ పరిశ్రమల కేంద్రంగా మార్టూరుకు గుర్తింపు ఉంది. అద్దంకి నియోజకవర్గంలోని గ్రానైట్ గనులు ఉన్నాయి.

మార్గం..  అనుసంధానం
బాపట్ల జిల్లా నుంచి వెళ్తున్న కోల్‌కతా- చెన్నై 16వ నంబరు జాతీయ రహదారి, దిగమర్రు- ఒంగోలు 216ఎ జాతీయ రహదారి, ఓడరేవు- పిడుగురాళ్ల 167ఎ జాతీయ రహదారి, మేదరమెట్ల-అద్దంకి-నార్కట్పల్లి ఎక్స్‌ప్రెస్‌ వే ఉన్నాయి. విజయవాడ- చెన్నై ప్రధాన రైల్వే మార్గంలో బాపట్ల, చీరాల రైల్వేస్టేషన్లు ఉన్నాయి. రైలు మార్గంతో వేమూరు నుంచి రేపల్లె ప్రాంతాలు అనుసంధానమవుతున్నాయి. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు