5g Spectrum: డిజిటల్‌ సార్వభౌమాధికారం కోసం...

దేశంలో ఒకప్పుడు టెలికాం రంగాన మకుటం లేని మహారాజుగా నవరత్న హోదాలో వెలుగులీని అనంతర కాలంలో కళావిహీనమైన సంస్థ- బీఎస్‌ఎన్‌ఎల్‌(భారత్‌ సంచార్‌ నిగమ్‌ లిమిటెడ్‌). కాలానుగుణంగా

Updated : 30 Jul 2022 01:41 IST

దేశంలో ఒకప్పుడు టెలికాం రంగాన మకుటం లేని మహారాజుగా నవరత్న హోదాలో వెలుగులీని అనంతర కాలంలో కళావిహీనమైన సంస్థ- బీఎస్‌ఎన్‌ఎల్‌(భారత్‌ సంచార్‌ నిగమ్‌ లిమిటెడ్‌). కాలానుగుణంగా మార్పుల్ని పొదువుకుంటూ పరివర్తన చెందే స్వాభావిక లక్షణం, అవకాశాలు కొరవడి రుజాగ్రస్తమైన ఆ సంస్థ సముద్ధరణ కోసమంటూ కేంద్రం తాజాగా ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించింది. 2026-‘27 నాటికి మళ్ళీ లాభాల బాట పట్టించడమే లక్ష్యమంటున్న రూ.1.64లక్షల కోట్ల ప్యాకేజీ కూర్పులో ప్రభుత్వ చిత్తశుద్ధి ఎంతన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సరైన స్పెక్ట్రమ్‌ కేటాయింపులు, తగినన్ని మౌలిక వసతులు కరవై, సిబ్బంది పద్దు కింద వ్యయభారం అధికమై ఉక్కిరిబిక్కిరవుతున్న బీఎస్‌ఎన్‌ఎల్‌ తనను ఆదుకొమ్మంటూ జూన్‌ మొదట్లో ప్రభుత్వానికి మొరపెట్టుకుంది. 4జీ, 5జీ సేవల నిమిత్తం ప్రీమియం 700 మెగాహెర్ట్జ్‌ బ్యాండ్‌ సహా మొత్తం రూ.61వేల కోట్ల విలువైన స్పెక్ట్రమ్‌ కేటాయించాలని అభ్యర్థించింది. 5జీ స్పెక్ట్రమ్‌ వేలంపాట కార్యరూపం దాల్చేదాకా ఆ విజ్ఞప్తిని వ్యూహాత్మకంగా పక్కనపెట్టిన కేంద్రం, ఇప్పుడు ప్యాకేజీలో భాగంగా 4జీ స్పెక్ట్రమ్‌, కొంత నగదు సాయం, ఇతరత్రా అనుగ్రహిస్తామంటోంది. దేశంలో 4జీ అడుగిడిన దశాబ్దానికి, జనాభాలో అత్యధికులకు ఆ నెట్‌వర్క్‌ విస్తరణ సాకారమైన దశలో దక్కనుందంటున్న ‘పాత తరం’ స్పెక్ట్రమ్‌తో బీఎస్‌ఎన్‌ఎల్‌ ఇప్పుడు మహాద్భుతాలు సృష్టించగలుగుతుందా? ప్రైవేటు సంస్థలు 4జీ కంటే వందరెట్లు అధిక వేగం కలిగిన 5జీ సేవల ప్రదానానికి సంసిద్ధమవుతున్న తరుణంలో- బీఎస్‌ఎన్‌ఎల్‌ ఇతోధిక ఆదాయ వృద్ధిని కళ్లజూడటం ఆచరణ సాధ్యమేనా? గత అయిదేళ్లలో రూ.50వేలకోట్లకు పైగా నష్టాలపాలై, రూ.33వేలకోట్ల రుణభారంతో సతమతమవుతున్న బీఎస్‌ఎన్‌ఎల్‌కు- ప్రైవేటు పోటీ తట్టుకుంటూ గడువులోగా లాభాలు ఒడిసిపట్టాలని కేంద్రం నిర్దేశించడంలో సహేతుకత కనిపించడంలేదు!

‘జాతీయ ఆప్టికల్‌ ఫైబర్‌ నెట్‌వర్క్‌’ పథకం పట్టాలకు ఎక్కి పదేళ్లయినా నేటికీ ప్రగతి అంతంత మాత్రమే. బ్రాడ్‌బ్యాండ్‌ హైవేలు, సార్వత్రిక మొబైల్‌ అనుసంధానం, పౌరులందరికీ అంతర్జాల సేవలు తదితర నవాంశాలతో ‘డిజిటల్‌ ఇండియా’ అవతరణకు ఎన్డీయే ప్రభుత్వ సంకల్పదీక్షా నీరోడుతోంది. గ్రామీణ డిజిటల్‌ అక్షరాస్యత పరంగా భారత్‌ ఇంకా యోజనాల దూరం అధిగమించాల్సి ఉందని ఇటీవలి కొవిడ్‌ సంక్షోభం సోదాహరణంగా తెలియజెప్పింది. ఇటువంటప్పుడు దేశ ప్రజలందరికీ బ్రాడ్‌బ్యాండ్‌, 5జీ సేవలు అందుబాటులోకి వచ్చే విధంగా మౌలిక వసతుల పరిపుష్టీకరణ బాధ్యతను బీఎస్‌ఎన్‌ఎల్‌కే కట్టబెట్టడం సముచితంగా ఉంటుంది. ‘భారత్‌ నెట్‌’ ద్వారా పంచాయతీలకు, ‘గ్రామ్‌ నెట్‌’తో గ్రామీణాభివృద్ధి సంస్థలకు, ‘నాగర్‌ నెట్‌’ ద్వారా పట్టణాల్లోని బహిరంగ వైఫై కేంద్రాలకు, ‘జన్‌ వైఫై’ రూపేణా పల్లెపట్టులకు బ్రాడ్‌బ్యాండ్‌ సేవలందాలని నాలుగేళ్ల నాటి టెలికాం విధాన ముసాయిదా ప్రతిపాదించింది. ఆ కల సాకారమైతేనే, దేశ ప్రజానీకానికి డిజిటల్‌ సార్వభౌమాధికారం దఖలుపడినట్లు! గిరిజన సాధికారతపై ఏళ్లతరబడి ఉద్ఘాటనలెన్ని మార్మోగుతున్నా- కనీస సదుపాయాలకు నోచని ఆదివాసీ జనావాసాలెన్నో దేశంలో పోగుపడినట్లు ఇటీవలి రాష్ట్రపతి ఎన్నిక సందర్భంగా కథనాలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో మారుమూల ప్రాంతాలకు టెలీవిద్య, టెలీవైద్యం, ఈ-పాలన వంటివి విస్తృతంగా అందుబాటులోకి రావాలన్న డిజిటల్‌ స్వప్నం నెరవేరేదెలా? మారుమూల ప్రాంతాల్లోనూ భారత్‌నెట్‌ వంటి కష్టతర ప్రాజెక్టులను చేపట్టినప్పుడు ‘వాణిజ్యపరమైన లబ్ధి’ ప్రామాణికాంశం కాకూడదు. అందువల్ల, దుస్సాధ్యమైన స్పర్ధలోకి బీఎస్‌ఎన్‌ఎల్‌ను నెట్టి ఆపై నష్టజాతక సంస్థగా ముద్ర వేసేకన్నా- జాతి నిర్మాణ క్రతువులో అది కీలక భూమిక పోషించేలా విధివిధానాలను పునర్‌ నిర్దేశించడం...దీర్ఘకాలికంగా ఎంతో మేలు!

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.